Featuredజాతీయ వార్తలు

గతపాలకుల నిర్లక్ష్యంతో వ్యవసాయం కుదేలు

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): దశాబ్దాల నిర్లక్ష్యంతో వ్యవసాయం, రైతులు కుదేలైపోయారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశ రైతన్నలకు నూతన జనసత్వాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రైతు ఆదాయం రెట్టింపు చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రెండోరోజు శనివారం మోదీ కీలక ప్రసంగం చేశారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. మునుపటి ప్రభుత్వాలు రైతులను కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. కాల్వ నీరు రైతు పొలంలోకి వచ్చినప్పుడు ఫలితం వస్తోందన్నారు. ఒకటిన్నర రెట్లకు ఆదాయం లభించనప్పుడే రైతు చిరునవ్వుతో ఉంటాడు అని పేర్కొన్నారు. పప్పులు, నూనెగింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా ముందుకెళ్తు న్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల పాపాలను ప్రక్షాళన చేయడం సాధ్యం కాదన్నారు. తమ దృష్టిలో రైతులంటే శక్తి దాతలని మోదీ చెప్పారు. రైతులకు ప్రతి అడుగులోనూ సహాయపడుతున్నామని, ఇది నిరంతర, నిలకడైన పక్రియ అని తెలిపారు. వీటి ఫలితాలు దీర్ఘకాలికంగా కనిపిస్తాయని చెప్పారు. కనీస మద్దతు ధర కల్పించాలన్న డిమాండ్‌ దశాబ్దాల నుంచి ఉందని చెప్పారు. గత ప్రభుత్వం కనీస మద్దతు ధరను పెరగనివ్వలేదని రైతులకు తెలుసునని పేర్కొన్నారు. కానీ తన ప్రభుత్వం రైతుల డిమాండ్లను వాస్తవ రూపానికి తీసుకొచ్చినట్లు తెలిపారు. అభివృద్ధి పనుల్లో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఉద్ఘాటించారు. బీజేపీ కార్యకర్తలంతా సుశిక్షుతులు, సంస్కారవంతులు అని పేర్కొన్నారు. అటల్‌ జీ లేకుండా జరుగుతున్న మొదటి జాతీయ సమ్మేళనం ఇది అని గుర్తు చేశారు. పైనుంచి ఆయన ఆశీస్సులు

బీజేపీ కార్యకర్తలందరికీ ఉంటాయన్నారు. బీజేపీ కార్యకర్తల త్యాగాల పునాదులపై బీజేపీ బలీయశక్తిగా ఎదిగిందన్నారు. జనం ఆకాంక్షల ప్రతినిధిగా బీజేపీ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. స్వాతంత్య్రానంతరం పటేల్‌ ప్రధాని అయి ఉంటే దేశ స్థితి మరోలా ఉండేదన్నారు. ఆనాడు ఆయన ప్రధాని అయితే ఇప్పుడు దేశం మరెక్కడో ఉండేదని మోదీ పేర్కొన్నారు.

ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌ బీజేపీ లక్ష్యం

యూపీఏ పదేళ్ల పాలనలో పూర్తిగా అవినీతితో సాగితే.. తమ నాలుగున్నరేళ్ల పాలనలో అవినీతికి తావులేకుండా పరిపాలనను అందించామని మోదీ తెలిపారు. ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌ అన్నది బీజేపీ లక్ష్యమన్న మోదీ.. ఆ లక్ష్యంగానే నిరంతర కృషి జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ అన్నది కేవలం సర్కార్‌ వల్లే సాధ్యం కాదు. ప్రతి పౌరుడి భాగస్వామ్యంతోనే అందరి అభివృద్ధి సాకారమౌతోందన్నారు. 10 శాతం ఈబీసీల రిజర్వేషన్లు నవ భారతం విశ్వాసాన్ని మరింత పెంచుతాయన్నారు. సామాజిక న్యాయం దిశగా ఈబీసీల రిజర్వేషన్లు చారిత్రక ప్రయత్నమని మోదీ చెప్పారు. అందుకోసం మొదటిసారి ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు కల్పించామని పేర్కొన్నారు. ఉన్న రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈబీసీలకు 10 శాతం కోటా కల్పించామని తెలిపారు. ఈ నిర్ణయంతోనే సమస్య మొత్తం పరిష్కారమవుతోందని చెప్పలేను.. కానీ ఇది తొలి అడుగు అని పేర్కొన్నారు. కొంతమంది కావాలని కోటాపై దుష్పచ్రారం చేస్తున్నారు.. వారివి వృథా ప్రయాస అని అన్నారు. ఈ దేశ యువత శక్తి సామర్థ్యాలను పెంపొందించేందుకు ఎంతో పని చేయాలని మోదీ సూచించారు. గడిచిన నాలుగున్నరేళ్లుగా తమ ప్రభుత్వం ఆ ప్రయత్నమే చేస్తోందని మోదీ తెలిపారు. అద్భుతాలు చేయగల శక్తి సామర్థ్యాలు భారత యువత సొంతమని చెప్పారు. ఈ దేశ ఆర్థిక, సామాజిక స్థితిగతులు యువతకు తెలుసన్నారు మోదీ. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. మనమంతా అభివృద్ధి లక్ష్యం వైపు కలిసికట్టుగా కదలాలని మోదీ పిలుపునిచ్చారు. రైతులు భూమిని దున్నినట్లుగానే, మనమంతా రాజకీయ క్షేత్రాన్ని దున్నాలన్నారు. ప్రతి కుటుంబాన్ని కలుసుకుంటూ, వారిని క్షేత్రస్థాయి కార్యకర్తలుగా చేసుకుంటూ మనం అదే పని చేస్తున్నామని చెప్పారు.

సామాజిక న్యాయం దిశగా చర్యలు

సామాజిక న్యాయం దిశగా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా… ఆర్థిక బలహీనవర్గాలకు 10 శాతం కోటా కల్పించామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ నిర్ణయం సమస్యను పూర్తిగా పరిష్కరిస్తుందని చెప్పలేనని, ఇది తొలి అడుగు మాత్రమేనని మోదీ చెప్పారు. మొదటిసారి ఆర్థిక బలహీనవర్గాలకు రిజర్వేషన్లు కల్పించామన్నారు. ఆర్థిక బలహీనవర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు… నవభారతం విశ్వాసాన్ని మరింత పెంచుతాయని మోదీ పేర్కొన్నారు. దేశ చరిత్రలో తొలిసారి అవినీతి ఆరోపణలు లేకుండా పాలన సాగుతోంది. కార్యకర్తల కృషివల్లే వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాం అని మోదీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, అద్వానీ తదితరులు పాల్గొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close