హాట్‌ కేక్‌గా జిల్లా పీఠం

0
  • పరిషత్‌ ఛైర్మెన్‌ పదవి ఆసక్తి
  • టీఆర్‌ఎస్‌లో స్థానిక ఎన్నికల సందడి…
  • జెడ్పీటీసీ అభ్యర్థుల కంటే ముందే చైర్మన్‌ అభ్యర్థుల ప్రకటన

జిల్లా పరిషత్‌ పీఠం అనేక మంది రాజకీయ ఉద్దండులను తీర్చిదిద్దింది. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం జెడ్పీ చైర్మెన్‌ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్మన్‌ పదవిని అలంకరించిన అనేక మంది నేతలు ఉన్నత స్థాయికి ఎదిగారు. మండల, జిల్లా పరిషత్‌ లు రాజకీయ ఎదుగుదలకు ప్లాట్‌ ఫామ్‌గా భావిస్తారు స్థానిక నేతలు. తెలంగాణలో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవి ఇప్పుడు హాట్‌ కేక్‌ గా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ఇరవై మూడు జిల్లాలు ఉండటంతో తక్కువ మందికి అవకాశం వచ్చేది. రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణలో 33 జిల్లాలు ఏర్పాటు చేశారు. 32 జిల్లా పరిషత్లు ఏర్పాటు అయ్యాయి. దీంతో చాలా మంది జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఉమ్మడి ర్రాష్ట్రంలో నాటి ఎన్టీఆర్‌ సర్కార్‌ మూడు అంచెల పంచాయితీరాజ్‌ వ్యవస్థలో భాగంగా సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీపీ పదవులు వచ్చాయి. మండల స్థాయిలో మండల పరిషత్‌, జిల్లాస్థాయిలో జిల్లా పరిషత్‌ లు అభివృద్ది, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తాయి. రాజకీయ ఎదుగుదల ఇదో ఓ ప్లాట్‌ ఫామ్‌ గా స్థానిక నాయకులు భావిస్తారు. జిల్లాలో ఇంచార్జీ మంత్రి తర్వాత జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముఖ్యమైన పదవి. జెడ్పీ సమావేశాల్లో అధ్యక్షత వహించే చైర్మన్‌ కు జిల్లాకు కావాల్సిన అభివృద్ది పథకాలను సాధించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మంత్రి కంటే ఎక్కువ పవర్స్‌ వినియోగించుకోవచ్చు. జిల్లా సీఈవో, కలెక్టర్లతో అభివృద్ది పనులు చేయించుకోవచ్చు. దీంతో ఈ పదవంటే చాలా మంది నాయకులు ఇష్టపడుతారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు అభివృద్ధి నిధులను ప్రశ్నించే హక్కు ఉంటుంది. రహదారులు, తాగునీటి సమస్యలు, ప్రభుత్వ భవనాల మరమ్మతులకు నిధులు రాబట్టవచ్చు. మండలం అభివృద్ధికి కృషి చేయవచ్చు. ఐసీడీఎస్‌, డ్వాక్రా, ఉపాధి హావిూ తదితర పనులు పరిశీలించి అభివృద్ధికి తోడ్పడవచ్చు. ఏవైనా అవకతవకలు జరిగితే మండల, జిల్లా పరిషత్‌ సమావేశల్లో ప్రశ్నించవచ్చు. జిల్లా పరిషత్లు, మండల పరిషత్‌ లు వచ్చాక అనేక మంది యువత రాజకీయాల్లోనికి వచ్చి ఉన్నత స్థాయికి ఎదిగారు. మాజీ మంత్రి ఎంపీ దేవేందర్‌ గౌడ్‌ రంగారెడ్డి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ గా పని చేసారు. కాసాని జ్ఞానేశ్వర్‌ జెడ్పీటీసీగా ఎన్నికై ఎమ్మెల్సీగా ఎన్నికైతే, రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్యే గా పనిచేసారు. డీ.కే.అరుణ జెడ్పీటీసీ నుంచే ఎమ్మెల్యే అయ్యారు. వరంగల్‌ కు చెందిన బొడకుంటి వెంకటేశ్వర్లు జెడ్పీ చైర్మన్‌ గా,ఎంపీగా చేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి సునీతా మహేందర్‌ రెడ్డి, మహబూబ్‌ నగర్‌ నుంచి ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి, మహబూబ్‌ నగర్‌ టీఆర్‌ఎంస్‌ ఎంపీగా పోటీ చేసిన శ్రీనివాస్‌ రెడ్డి గతంలో ఎంపీటీసీగా పనిచేసినవారే. అచ్చంపేట్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గతంలో ఎంపీటీసీగా పనిచేసారు. ఇలా అనేక మంది స్థానిక నాయకులు తమ రాజకీయ భవిష్యత్తును సర్పంచ్‌ గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా పని చేసి ఉన్నత స్థాయికి ఎదిగారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు ఆయా పార్టీల్లో మంచి డిమాండ్‌ ఉంది. మహిళా రిజర్వేషన్ల స్థానాలలో కుటుంబ సభ్యులను బరిలో దించేందుకు పెద్ద నాయకులు ఆసక్తి చూపుతుండడం ఆ పదవుల పరపతిని తెలియజేస్తోంది.

టీఆర్‌ఎస్‌లో స్థానిక ఎన్నికల సందడి…

టీఆర్‌ఎస్‌లో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థులుగా ప్రకటించడంతో మిగతా మాజీలు కూడా జెడ్పీ చైర్మన్‌ టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. రిజర్వేషన్లతో తమకు ఛాన్స్‌ మిస్సయినా తమ కుటుంబ సభ్యులు, బంధువులను రంగంలోకి దింపేందుకు రెడీ అవుతున్నారు. సగానికి పైగా జిల్లాల్లో జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థులుగా వారసులే పోటీపడుతుండటం హాట్‌ టాపిక్‌గా మారింది. టీఆర్‌ఎస్‌లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. జెడ్పీటీసీ అభ్యర్థుల కంటే ముందే చైర్మన్‌ అభ్యర్థుల ప్రకటన మొదలు కావడంతో ఆశావహులు హడావుడి చేస్తున్నారు. గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక సభ్యుల అభిప్రాయం మేరకు, లేదా ఓటింగ్‌ ద్వారా జెడ్పీ చైర్మన్‌ను నియమించే వారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా జెడ్పీ చైర్మన్‌ ఎంపిక జరుగుతోంది. దీంతో ఆశావహులు నేరుగా చైర్మన్‌ సీటుపైనే కన్నేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 32 జెడ్పీ స్థానాలకు గాను సగానికి పైగా జిల్లాలకు వారసులే పోటీపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు, మంత్రులు ఎవరికి వారు తమ కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఆసిఫాబాద్‌ జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థిగా కోవా లక్ష్మి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థిగా పుట్టా మధు పేర్లను పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో మిగతా స్థానాల్లో ఆశావహులంతా తెరపైకి వచ్చారు. నిజామాబాద్‌ జెడ్పీ స్థానం జనరల్‌ కేటగిరికి ఇవ్వడంతో స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు భాస్కర్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక కరీంనగర్‌ జెడ్పీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్‌ తన భార్యకు టిక్కెట్టు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. భువనగిరి జెడ్పీ చైర్మన్‌ టిక్కెట్టు కోసం మాజీ ఎమ్మెల్యే ఉమా మాధవరెడ్డి తమ కుమారుడి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయగా వరంగల్‌ రూరల్‌ జెడ్పీ టిక్కెట్టు కోసం ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారి భార్యలకు గానీ, ప్రధాన అనుచరులకు గానీ ఇప్పించేందుకు లాబీయింగ్‌ చేస్తున్నారు. అలాగే, నాగర్‌ కర్నూలు ఎస్సీ జనరల్‌ కావడంతో తన కుమారుడి కోసం మందా జగన్నాథం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఖమ్మం ఎస్సీ జనరల్‌కు కేటాయించడంతో పిడమర్తి రవి, మహబూబాబాద్‌ స్థానం కోసం డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ తన కోడలికి ఇప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. మేడ్చల్‌ జెడ్పీ కోసం మంత్రి మల్లారెడ్డి కూడా కోడలి కోసం ప్రయత్నాలు తీవ్రం చేసినట్టు తెలుస్తోంది. ఇక వికరాబాద్‌ జెడ్పీ చైర్మన్‌ కోసం మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి మరోసారి తన భార్యకే ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి టీఆర్‌ఎస్‌లో స్థానిక ఎన్నికల జాతర మొదలైంది. పార్టీలో కీలక పదవులు అనుభవించిన వారే మళ్లీ స్థానిక పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో కిందస్థాయి నేతలంతా ఆందోళన చెందుతున్నారు. మరి టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here