నీతి ఆయోగ్‌కు దూరం..

0

కాళేశ్వరం ప్రారంభోత్సవ పనుల్లో బిజిబిజి

  • మహారాష్ట్ర గవర్నర్‌, సీఎంలను ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌

ముంబయి : సీఎం కేసీఆర్‌ శుక్రవారం ముంబయి వెళ్లారు. ఈనెల 21న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ పలు రాష్ట్రాల సీఎంలను, కేంద్ర మంత్రులను, ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలను ఆహ్వానించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా కేసీఆర్‌ మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావును, సీఎం ఫడ్నవీస్‌ను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం ప్రత్యేక విమానం ద్వారా ముంబయి చేరుకున్న కేసీఆర్‌ మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావుతో భేటీ అయ్యారు. ముంబైలోని రాజ్‌ భవన్‌ కు చేరుకున్న సీఎం కేసీఆర్‌ కు గవర్నర్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణం, ముంపు విషయంలో మహారాష్ట్ర సర్కారు తెలంగాణకు పూర్తి సహకారం అందించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం నిర్మాణాన్ని కేసీఆర్‌ చొరవ తీసుకొని హరీశ్‌ రావును ముంబై పంపారు. కేసీఆర్‌ సర్కారు వినతికి సీఎం ఫడ్నవీస్‌ సానుకూలంగా స్పందించడంతోనే కాళేశ్వరం సాకారమైంది. గవర్నర్‌తో భేటీ అనంతరం కేసీఆర్‌ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఫడ్నవీస్‌ను కేసీఆర్‌ ఆహ్వానించారు. మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం అధికార నివాసమైన వర్షకు చేరుకున్నారు. అనంతరం ఫడ్నవీస్‌తో భేటీ అయ్యారు.

నీతి ఆయోగ్‌ సమావేశానికి కేసీఆర్‌ దూరం..

ఎన్డీఏ సర్కార్‌ రెండోసారి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరగనున్న నీతి ఆయోగ్‌ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు దూరంగా ఉండనున్నారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరుకాకూడదని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ సమావేశం జరగనుంది. దీని కోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం వెళ్లింది. అయితే, ఈ సమావేశానికి సీఎం కేసీఆర్‌ వెళ్లడంలేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో వాటి పనుల్లో బిజీగా ఉన్న కేసీఆర్‌.. నీతి ఆయోగ్‌ సమావేశానికి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం తరఫున చీఫ్‌ సెక్రటరీ లేదా ఫైనాన్స్‌ సెక్రటరీ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here