వికలాంగుల సంస్థలో కదులుతున్న అక్రమాల డొంక

0

బ్లైండ్‌ స్టిక్స్‌, వినికిడి యంత్రాలలో కూడా అవినీతికి పాల్పడ్డ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌

సహకార సంస్థలో రాజ్యమేలుతున్న అవినీతి

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం కోట్ల రూపాయలు కేటాయించి 100% సబ్సిడీతో వారికి ఉపయోగపడే పరికరాలు అందించి వారి సంక్షేమం కోరుతుంటే తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అవినీతికి పాల్పడుతూ నాణ్యతలేని బ్లైండ్‌ స్టిక్స్‌, హియరింగ్‌ ఎయిడ్స్‌ కొనడం జరుగుతుంది. గతంలో రూపాయలు 147/- కె బ్లైండ్‌ స్టిక్స్‌ సరఫరా చేస్తున్న ఏజెన్సీకి కాదని కమీషన్లకు కక్కుర్తిపడి, లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని నాణ్యతలేని బ్లైండ్‌ స్టిక్స్‌ ఒకటి 250 రూపాయల చొప్పున 2000 బ్లైండ్‌ స్టీక్స్‌ కొనుగోలు చేశారు. కమీషన్లకు కక్కుర్తిపడి కొన్న బ్లైండ్‌ స్టిక్స్‌ పూర్తిస్థాయిలో ఈ రోజు వరకు కూడా దివ్యాంగులకు ఇవ్వలేదు. వినికిడిలోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వం వారి ఉన్నత చదువులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యమైన హియరింగ్‌ ఎయిడ్స్‌ లబ్ధిదారులకు అందించడానికి సరిపోయేంత నిధులు కేటాయించినా ఢిల్లీలోని ఏఎల్‌సిఎస్‌ కంపెనీ ద్వారా నాణ్యతలేని హియరింగ్‌ ఎయిడ్స్‌ సుమారుగా 2500 రూపాయల నుండి 2700 రూపాయలు ఒక్కొక్కటి చొప్పున వెచ్చించి కొనుగోలు చేశారు. కానీ నాణ్యతలేని హియరింగ్‌ ఎయిడ్స్‌ కనీసం ఆరు మాసాలు కూడా పూర్తికాకుండానే పాడైపోతున్నాయని దివ్యాంగులు ఆరోపిస్తున్నారు. హైదరాబాదులో అనేక సంస్థలు హియరింగ్‌ ఎయిడ్స్‌ సప్లై చేయడానికి ముందుకు వచ్చినా కూడా వారికి కాదని లోపాయికారి ఒప్పందంతో ఏఎల్‌సిఎస్‌ ఢిల్లీ ఏజెన్సీ నుండి కొనుగోలు చేశారు. వికలాంగుల సహకార సంస్థలో ప్రతి కొనుగోలులో కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యతలేని పరికరాలను కొనుగోలు చేస్తూ కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారని వికలాంగ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here