రక్షణ శాఖకు రూ. కోటి 8లక్షల విరాళం

  0

  కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌ నాధ్‌ సింగ్‌కు అందిచిన మాజీ సైనికుడు

  ఢిల్లీ : భారత వైమానిక దళ మాజీ ఉద్యోగి ఒకరు తన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ని రక్షణ దళాలకు విరాళంగా ఇచ్చారు. 9 సంవత్సరాల పాటు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్సులో ఎయిర్‌ మెన్‌ గా పని చేసి రిటైరైన సీబీఆర్‌ ప్రసాద్‌ (74) పదవీ విరమణ అనంతరం వచ్చిన డబ్బులో కోటి రూపాయల 8లక్షలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌ నాధ్‌ సింగ్‌ కు సోమవారం చెక్కు రూపంలో అందచేశారు. తన కుటుంబ బాధ్యతలను నెరవేర్చిన తర్వాత… సైన్యం నుంచి తనకు వచ్చిన మొత్తాని తిరిగి ఇస్తున్నానని ఆయన తెలిపారు. వైమానిక దళంలో పని చేసిన ఒక చిన్న సిపాయి ఇంత మొత్తం రక్షణ దళాలకు విరాళంగా ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు రక్షణ మంత్రి రాజ్‌ నాధ్‌ సింగ్‌. ఎయిర్‌ ఫోర్సులోంచి బయటకు వచ్చాక జీవనోపాధి కోసం పౌల్ట్రీ ఫామ్‌ ను ప్రారంభించానని ప్రసాద్‌ చెప్పారు. పౌల్ట్రీ ఫామ్‌ లో కష్టపడి బాగా సంపాదించగలిగానని.. కష్టార్జితంతో 500 ఎకరాల భూమి సంపాదించానని ఆనందంగా చెప్పారు. జేబులో 5 రూపాయలతో ఇంటిని విడిచి పెట్టిన తాను 500 ఎకరాల భూస్వామి అయ్యాక తన కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానని గర్వంగా తెలిపారు. తనకు సైన్యం ద్వారా వచ్చిన మొత్తాన్ని తిరిగి విరాళంగా ఇచ్చే ముందు కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నానని… వారు చాలా సంతోషించి తనను ప్రోత్సహించారని ప్రసాద్‌ అన్నారు. తన దగ్గర వున్న దాంట్లో 2 శాతం తన కుమార్తెకు, ఒక శాతం తన భార్యకు ఇచ్చానని మిగిలిన 97 శాతం మొత్తాన్ని సైన్యానికి ఇస్తున్నానని ఆయన తెలిపారు. చిన్నప్పటి నుంచి స్పోర్ట్‌ పై ఆసక్తి ఉన్న ప్రసాద్‌ కి ఒలింపిక్స్‌ లో పతకం సాధించాలనే కల ..కలగానే మిగిలి పోయింది. దాంతో ఆయన ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే లక్ష్యంతో ఉన్న పిల్లలకు 20 ఏళ్లుగా శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం 50 ఎకరాల్లో సువిశాల స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here