కూతురు ఓటిమిపై రగులుతున్న చంద్రుడు

0

‘కిషన్‌’కు పౌర సన్మానం జరిగినా..?

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

తెలంగాణ చంద్రుడు భాజపాపై తెగ కోపంతో రగిలిపోతున్నారు. తప్పదు.. అయినా బాధ భరించాలి.. కానీ తట్టుకోలేని పరాభవం. ప్రతీకారానికి ఇప్పట్లో అవకాశం లేదు. ఎలా మరి. అసహనం వ్యక్తం చేయడానికి తెలంగాణ చంద్రుడికి అవకాశం దొరికింది. భారతీయ జనతా పార్టీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగినన్ని రోజులు కేసీఆర్‌ భాజపా ప్రముఖులకు పౌర సన్మానం చేశారు. ఈసారి కేంద్ర సహాయ మంత్రిగా ఎన్నికైన కిషన్‌ రెడ్డికి పౌర సన్మానంపై సందిగ్ధం నెలకొంది.

చెన్నమనేనికి సన్మానం:

ఒక తెలంగాణ ముద్దుబిడ్డ ఒక రాష్ట్రానికి గవర్నర్‌ అయ్యాడని అభనిందిస్తూ ఆ సన్మాన కార్యక్రమం జరిగింది.మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితుడైన చెన్నమనేని విద్యాసాగర్‌ రావుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నవంబరు 9, 2014 హైదరాబాద్‌, నెక్లెస్‌ రోడ్‌, జలవిహార్‌ లో ఘనంగా

పౌరసన్మానం చేసింది. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీయార్‌ తదితరులు హాజరై విద్యాసాగర్‌రావును ప్రశంసల్లో, పొగడ్తల్లో ముంచెత్తారు.

దత్తన్నకు…

నవంబరు 15, 2014న అదే జలవిహార్‌లో బండారు దత్తాత్రేయకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పౌరసన్మానం చేసింది. (అగ్రకుల నాయకులకు చేసింది… బిసీ నేతకు చేయరా..? అనే విమర్శలు వెల్లువెత్తుత్తాయి.అది వేరే సంగతి) బండారు కాదు, మా ‘బంగారు దత్తన్న’ అంటూ కేసీయార్‌ తెగ పొగిడారు. మస్త్‌ శాలువాలు కప్పి మరీ ఘనంగా వేడుక నిర్వహించారు. బాగుంది.

వెంకయ్యకూ…:

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడికి రాజభవన్‌ వేదికగా

ఆగస్టు 21, 2017న తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా పౌరసన్మానం జరిపింది. రాజధాని నగరమంతా పెద్ద పెద్ద హోర్డింగులు, ప్లెక్సీలు, హడావుడే హడావుడి. నరసింహన్‌, కేసీయార్‌, మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బాగుంది. ఇది చూసిన నారా చంద్రుడు కూడా అమరావతిలో అట్టహాసంగా పౌరసన్మానం చేశారు. అప్పటి అనుబంధం అంత గట్టిగా కూడా ఉంది.

ప్రస్తుతం:

కాలచక్రం గిర్రున తిరిగింది. జాతకాలు మారాయి. బంధాలు మారాయి. పెనవేసుకున్న అనుబంధాలు వేగంగా సడలుతున్నాయి.

గత అయిదేళ్లలో బీజేపీతో తెరాసకు స్నేహమే తప్ప ఘర్షణ – సంఘర్షణలు లేవు. కానీ పార్లమెంట్‌ ఎన్నికల్లో నిజామాబాదులో కేసీఆర్‌ కూతురు కవితను బీజేపీ ఓడించింది. మరో మూడు స్థానాల్లోనూ తెరాస అభ్యర్థులనే బీజేపీె ఓడించింది. పైగా కొన్నిచోట్ల కాంగ్రెస్‌ కూడా బీజేపీకి లోపాయికారీగా ఒప్పందాలు చేసుకుందనే గుసగుసలు ఉన్నాయి.

ఇప్పుడా కోపంలో కేసీఆర్‌ ఉన్నారు.

కిషన్‌ రెడ్డికి సన్మానం జరిగేనా..?:

గంగపురం కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారు. అదీ హోం సహాయ మంత్రిత్వ శాఖ. ఆనవాయితీ ప్రకారం పౌరసన్మానం చేయాలి. మరి కేసీఆర్‌ లో ప్రతీకారేచ్చ రగులుతోంది. మరి ఈ సందర్భంలో కిషన్‌ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా పౌర సన్మానం చేస్తుందా..? లేక తనే మొదలుపెట్టిన ఒక మంచి సంప్రదాయానికి కేసీఆర్‌ గంగ నీళ్లు వదులుతాడా..? ఏం జరుగుతోందో వేచి చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here