రాబందుల మించిన ఆనకొండలు

0

రాబందులు తిండి లేకుండా ఏం చేస్తాయి.. ప్రతి అణువును గాలిస్తాయి.. వాసనను పసిగడుతాయి.. తిండికోసం వెంటాడి, వేటాడి కడుపునిండే వరకు పీక్కుతిని, పీక్కుతిని మిగిలింది వదలేసి వెళతాయి.. తిండికోసం అది వేటాడే స్పూర్తి ఆశ్చర్యపరిచినా మిగిలింది మాత్రం వదిలేసి వెళ్లడంతో చిన్న చితకా జీవులు తిని బతుకుతాయి.. రాబందుల్లో కూడా అంతో, కొంత నిజాయితీ, మానవత్వం ఉంటుందన్న విషయం అతి కొద్దిమందికే తెలుసు.. రాబందుల కన్నా నరరూపకంగా ప్రతి పనికి పైసల కోసం ముడిపెడుతూ జనాన్ని పీక్కుతింటున్నారు.. ప్రజలకు జవాబుదారీగా ఉంటూ పనిచేయాల్సిన అధికారులు రైతులకు భూమికి పట్టా కావాలన్నా, పట్టా మార్పిడి చేయాలన్నా తన స్వంత భూమి తనదేనని నిరూపించుకోవాలన్నా అన్ని పేపర్లున్న అక్కడ పనికాదు… రెవెన్యూ అధికారులు చేయి తడిపాలి.. వారి జేబు నింపాలి.. అప్పుడే మూలకు పడ్డ పైళ్లకు కూడా రెక్కలచ్చి ఎగురుతాయి.. బడా నాయకులది, పైరవీదారులకు నకిలీ పేపర్లున్న క్షణాల్లో పనులు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ అధికారులంటేనే విసుగు చెందాలే ప్రవర్తిస్తున్నారు… వేలకు వేలు జీతాలు తీసుకుంటూ లంచాల కోసం వేధిస్తున్న వీరిని చూస్తే… వీరికన్నా ఆ రాబందులే నయమనిపిస్తుంది….

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌….

ప్రతి పేదవాడి భూమి ప్రభుత్వ గుర్తింపు పొందాలి.. అది ఐదు గుంటలైనా, పది గుంటలైనా ఎంతైనా ఫర్వాలేదు.. మన తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా పట్టాలు చేసి ఇస్తుంది. ఒక్క రైతు కూడా రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదంటూ ముఖ్యమంత్రి ప్రచారం చేశారు.. పట్టాలైన వారికి రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వం పంట రుణం అందిస్తుందన్నారు. రైతులందరూ ప్రభుత్వమే ఉచితంగా పట్టాలు చేపిస్తుందని తెలిసేసరికి వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి పట్టాల కాకుండా ఉన్న పత్రాలు కూడా ముందుకు వచ్చాయి. ఇదే అదనుగా భావించిన రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా వారి చేతివాటాన్ని వాడడం మొదలెట్టారు. ఐదు గుంటలున్నా భూమికి కూడా ఐదు వేలు, పదివేలు తీసుకుంటూ వారి చెప్పిందే వేదంగా పనిచేస్తున్నారు. మరికొంతమంది చోటామోటా నాయకులు మాత్రం గ్రామాలలో, మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని తన పేరుమీద రాయించుకొని రైతుబంధు కింద వచ్చే డబ్బులను కాజేశారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ భూమిని రాసి ఇచ్చి పట్టా చేయించినందుకు అధికారులకు కొంత, తన పేరుమీద చేసుకున్నందుకు నాయకులకు కొంత మాదిరిగా పంచుకున్నారు. కాని అసలు రైతులకు పట్టాలు చేయకుండా, రైతుబంధు రాకుండా తన ఇష్టానుసారంగా దోచుకోవడమే పరమావధిగా పనిచేస్తున్నారు. ఒక రైతుకు ఒక ఎకరం వ్యవసాయం భూమి ఉంటే, అందులో పది గుంటలే పట్టా అవుతోంది. మిగతా ముప్పై గుంటలు మాత్రం పట్టాలోకి ఎక్కనివ్వరు. రైతుబంధు పైసలు రానివ్వరు. రైతులు ఎండనక, వాననక పది, ఇరవై గుంటల భూమి కోసం ఆఫీసుల చుట్టు ఇప్పటికి తిరుగుతూనే ఉన్నారు. ఎంత తిరిగినా అక్కడి అవినీతిపరులకు అమ్యామ్యాలు ఇస్తేనే పైళ్లు కదులుతాయి..

లంచం కోసం వేధిస్తున్న విఆర్వోలు..

ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండల కేంద్రంలో రెవెన్యూ అధికారులు అవినీతి దందా రోజురోజుకు పెచ్చుమీరిపోతుంది. అక్కడ ప్రతి చిన్న పనికి పైసలివ్వాల్సిందే.. విఆర్‌వో, విఆర్‌ఓ చేస్తున్న దందాకు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతోంది. రైతులు తమకు కావాల్సిన పనికోసం ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసుగు చెందుతున్నారు. అధికారులు వారి నిబంధనల ప్రకారం చేయాల్సిన పనులకు కూడా లంచాలు కోసం వేధిస్తున్నారని మండల కేంద్రంలోని రైతులు బమ్మెడి సాంబయ్య, రెడ్డి రామస్వామి, అనుములు దేవేందర్‌, బమ్మెడ చిన్న సాంబయ్య, మామిడి నర్సయ్య, మామిడిపెల్లి అయిలయ్య, దూడపాక కృష్ణమూర్తి, కనుకుంట్ల పెద్ద రాజయ్య, పిల్లి సరోజనలు అధికారులకు ఇవ్వాల్సిన అవినీతి సొమ్ము కొసం వెంకటాపూర్‌ మండల కేంద్రంలో బిక్షాటన చేశారు. రైతుల కథనం ప్రకారం 134, 253 సర్వే నంబర్‌లో ఉన్న భూమిలో 884 ఎకరాల భూమిని అప్పటి సర్వేయర్‌ రఘువీర్‌సింగ్‌ సర్వే చేసి పూర్తి వివరాలు ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయంలో అందజేశారు. అది ఆ రైతులకు చెందాల్సిన భూమి అనిఅధికారులకు తెలిపినా ఇప్పటికి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది.. స్ధానిక రెవెన్యూ సిబ్బంది మాత్రం పైసలు ఇస్తేనే పట్టాలు లేకపోతే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని తమకు రావాల్సిన భూమి తనకు ఇవ్వకుండా లంచాల కోసం వేధిస్తూ పట్టాలు చెయ్యడం లేదన్నారు. గతంలో పనిచేసిన అప్పటి కలెక్టర్‌ వాకాటి కరుణ సర్వే చేసి దాదాపుగా పది సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు ఆ రైతులకు భూమిని అందజేయనే లేదు. రైతులు చెప్పులరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నా అధికారులు మారుతున్నారు కాని పట్టాలు మాత్రం వారి చేతికి అందిందీ లేదు. ఏ అధికారి దగ్గరికి వెళ్లినా డబ్బులిస్తేనే పనిచేస్తాం లేకుంటే లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు కాని ఒక్కరూ పనిచేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలో పనిచేసే విఆర్‌ఓలు, విఆర్‌ఏలు వసూలు దందాకు మాత్రం అడ్డుఅదుపు లేకుండానే పోయింది. మీరు పైసలిస్తేనే పని చేస్తాం. లేకపోతే అవి అసైన్డ్‌ భూములని చెప్పి ప్రభుత్వ ఖాతాలో వేస్తామని బెదిరిస్తున్నారని వారు వాపోతున్నారు. తమ భూమి తప్ప తమ చుట్టు ఉన్న భూములను మాత్రం పట్టాలలోకి మార్పించారు కాని మా భూమి మార్పించడానికి సంవత్సరాలు పడుతుందని బతకడానికి ఇబ్బందిగా ఉన్నా మాకు అధికారులకు లంచాలు ఎక్కడినుంచి ఇవ్వాలో అర్థంకాక గ్రామంలోని బిక్షాటన చేస్తున్నామని వారు అంటున్నారు. ప్రభుత్వమే రైతుల కోసం పనిచేస్తున్నామని చెపుతుంటే రెవెన్యూ శాఖలోని అధికారులు మాత్రం వారి ఇష్టానుసారంగా అందిన కాడికి దండుకుంటూ రైతులను వేధిస్తున్నారు. మొన్నటికి మొన్న భూపాలపల్లి జిల్లా మండల తహాశీల్దార్‌ ఒక వృద్దుని దగ్గర లంచం కోసం వేధించే విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన విషయమే మరువకముందే మళ్లీ పక్కనే ఉన్న ములుగు జిల్లాలో రెవెన్యూ అధికారుల అవినీతి బయటకొచ్చింది. ఇంకా బయటికి రాని అవినీతి విషయాలు అనేకం ఉన్నాయని స్థాని రైతులు ఆరోపిస్తున్నారు. నిత్యం రెవెన్యూ అధికారులతో పని ఉండే రైతులను ఏదో ఒక పనిలో లంచం కోసం వేధిస్తు ఇబ్బందులు పెడుతున్నట్లు తెలుస్తోంది. రైతులందరికి ఉచితంగా పట్టాలు, పాస్‌బుక్కులు అందిస్తున్నామని చెపుతున్న ప్రభుత్వం రెవెన్యూ అధికారుల అవినీతిపై కూడా ప్రత్యేక దృష్టి సారించి రెవెన్యూ కార్యాలయాలలో జరిగే అవినీతిని అరికట్టాలని రైతులు కోరుతున్నారు. కింది స్ధాయిలో పనిచేసే విఆర్‌ఏలు సైతం అక్రమంగా డబ్బులు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారని వీరిపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు…

అవినీతి అధికారులపై ఫిర్యాదు చేస్తాం..

పంబిడి శ్రీధర్‌రావు.. యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ జిల్లా అధ్యక్షుడు..

గత పది, పదిహేను సంవత్సరాల నుంచి రైతులకు న్యాయంగా అందాల్సిన భూమి కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నారు. కాని రెవెన్యూ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం వేలకు వేల రూపాయలు జీతాలు ఇస్తున్నా, అవినీతికి అలవాటు పడ్డ అధికారులు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటున్నామని చెపుతుంటే, కిందిస్ధాయి అధికారులు మాత్రం పైసలు ఇస్తేనే పనులు చేస్తామని చెప్పుతూ రైతులను, కూలీలను పీక్కుతింటున్నారు. ఇలాంటి వారిపై చర్యలు కఠినంగా ఉండాలి. అప్పుడే మరొకరికి భయం ఉంటుంది. లేకపోతే మమ్ములను ఎవరూ ఏం చెయ్యలేరనే ధీమాగా దోచుకోవడమే పనిగా మారిపోతున్నారు. రైతుల ఆవేదనపై తమ సంస్థ నుంచి రాష్ట్ర అధికారులకు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తాం.. రైతుల చేస్తున్న అవినీతి రహిత పోరాటం అభినందనీయమే, వారికి మేము మద్దతు పలుకుతాము..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here