దేశాన్ని ముక్కలు కానివ్వను

0
  • కాంగ్రెస్‌వి కుతంత్ర రాజకీయాలు
  • కాశ్మీరీ పండిట్లు జన్మభూమిని వదిలివేశారు
  • ఎన్నికల ప్రచారంలో మోడీ

కథువా: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండోదశలో పోలింగ్‌ జరగనున్న ప్రాంతాలపై ప్రధాని నరేంద్రమోడీ దష్టి పెట్టారు. జమ్మూకాశ్మీర్‌ పర్యటనలో భాగంగా కథువాలో ప్రచారం నిర్వహించిన ఆయన ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా దేశాన్నివిచ్ఛినం కానివ్వమన్న ఆయన.. వారికి ఓటర్లే బుద్ధి చెప్పాలని కోరారు. ఈసారి ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తామని మోడీ ధీమా వ్యక్తం చేశారు. 2014 కంటే ఇప్పుడు భాజపా వైపు గాలి మరింత బలంగా వీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మూకశ్మీర్‌లోని కథువాలో పర్యటిస్తున్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. జమ్మూకాశ్మీర్‌ కు చెందిన నాయకులు ఒమర్‌ అబ్దుల్లా, మొహబూబా ముఫ్తీలు దేశాన్ని రెండుగా చీల్చటానికి చూస్తున్నారని ఆరోపించారు. వీళ్ల కుటుంబ రాజకీయాల వల్ల మూడు తరాల జమ్మూ కాశ్మీర్‌ ప్రజల జీవితాలు నాశనం అయ్యాయని ఆరోపించారు. వారికి రాజకీయంగా విశ్రాంతి ఇస్తేనే జమ్మూ కాశ్మీర్‌ ప్రజల జీవితాలు బాగుపడతాయని మోడీ అన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా.. దేశాన్ని మాత్రం విచ్ఛిన్నం చేయనివ్వమని స్పష్టం చేశారు. కశ్మీరీ పండిట్ల సమస్యలను పరిష్కరిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. ఆ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. భారత్‌ను నమ్ముకుని పాక్‌ నుంచి వచ్చిన కుటుంబాలకు ఇక్కడి పౌరులుగా గుర్తించేలా చట్టం తీసుకువచ్చే యోచనలో ఉన్నామన్నారు. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల కాశ్మీరీ పండిట్లు తమ జన్మభూమిని వదిలివేశారని ఆయన చెప్పారు. కాశ్మీరీ పండిట్ల సమస్య పరిష్కారానికి తాను కట్టుబడి ఉన్నానని, ఇప్పటికే ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కాశ్మీరీ పండిట్లను వారి స్వస్ధలాలకు పంపే ఏర్పాటు చేస్తామని మోడీ హావిూ ఇచ్చారు. భారత్‌ పై నమ్మకంతో ఇక్కడకు వచ్చిన కుటుంబాలకు సిటిజన్‌ షిప్‌ ఇచ్చేందుకు వీలుగా చట్టంలో మార్పులు చేసే యోచనలో ఉన్నట్లు మోడీ చెప్పారు. కాంగ్రెస్‌ కంటే మూడింతలు అధిక సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జమ్ము, బారాముల్లాలో జరిగిన తొలి విడత ఎన్నికల్లో అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య గొప్పతనాన్ని చాటారని ప్రజల్ని కొనియాడారు. దీంతో ఉగ్రనేతలు, అవకాశవాదులకు గట్టిగా సమాధానం చెప్పారన్నారు. జలియన్‌వాలా బాగ్‌ ఉదంతానికి 100 సంవత్సరాలు గడిచిన సందర్భంగా.. దేశం మొత్తం అమరులకు నివాళులర్పిస్తే కాంగ్రెస్‌ మాత్రం ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేసిందన్నారు. ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరైతే.. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ మాత్రం అక్కడకి రాకపోవడాన్ని ప్రధాని తప్పుబట్టారు. కాంగ్రెస్‌ వారసుడితో వెళ్లి నివాళులర్పించిన ఆయన ప్రభుత్వ కార్యక్రమానికి మాత్రం రాలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌ కుటుంబానికి భక్తిని చాటడంలో నిమగ్నులయ్యారని ఎద్దేవా చేశారు. అమరీందర్‌ దేశభక్తి గురించి తనకు తెలుసని.. ఆయనపై ఎంత ఒత్తిడి ఉంటే ఇలా వ్యవహరిస్తారని పరోక్షంగా కాంగ్రెస్‌ అధిష్ఠానంపై విరుచుకుపడ్డారు. మెరుపు దాడుల పదం వింటే కాంగ్రెస్‌ ఎందుకు ఉలికిపడుతోందని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here