అవినీతిలేని పాలన సాగించాం

0
  • మైనింగ్‌ చట్టానికి మేం సవరణలు చేశాం
  • శక్తిమంతమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు
  • ఎన్నికల ప్రచారసభలో ప్రధాని నరేంద్ర మోడీ

భువనేశ్వర్‌ : గత కాంగ్రెస్‌ పార్టీ హయాంలో కుంభకోణాలు, అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఎన్డీయే ఐదేళ్ల కాలంలో అవినీతి లేని పాలన సాగించామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఒడిశాలోని సంబల్‌పూర్‌లో భాజపా నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇంతటి వేడి ఉన్నప్పటికీ చాలా ఉత్సాహంతో ఇంతమంది సభకు వచ్చారని, భాజపా ర్యాలీలకు ఇంతమంది రావడం ప్రతిపక్ష నేతలకు నిద్రలేని రాత్రులకు గురిచేస్తోందని మోడీ అన్నారు. ఇంతమంది మాకు మద్దతు తెలుపుతున్నారంటే దానికి కారణం ప్రజలు శక్తిమంతమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అర్థమైందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడక ముందు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదని, ఈ ప్రభుత్వం ఏర్పడకముందు విూరు నిస్సహాయ, అవినీతికర ప్రభుత్వాన్ని చూశారన్నారు. ఆ ప్రభుత్వం ప్రతి రంగంలోనూ అవినీతికి పాల్పడిందన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఉన్న మైనింగ్‌ చట్టానికి మేము సవరణలు చేశామని, దీనివల్ల చాలా ప్రయోజనాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. కేంద్రం అందిస్తున్న ప్రయోజనాలపై ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని మోడీ వ్యాఖ్యానించారు. నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంటే ఈ ప్రయోజనాలు అందిస్తున్నది కేంద్రమేనని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలన్నారు. ఉదాహరణకు ఓ కుమారుడు ఢిల్లీ నుంచి విూకు ఓ బహుమానం పంపాడనుకోండి.. ఆ గొప్పదనం విూ కుమారుడికి ఇస్తారా? ఆ బహుమతిని విూ చేతికందించిన పోస్ట్‌మెన్‌కి ఇస్తారా అని ప్రధాని ప్రశ్నించారు. ఆస్పత్రుల నిర్మాణం, స్వచ్ఛమైన తాగునీటి కోసం ఒడిశాకు కేంద్ర సర్కారు రూ.6,000 కోట్లు కేటాయించిందన్నారు. ఆ డబ్బు దుర్వినియోగం అయిందని, దానిలో కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను ఒడిశాలోని రైతులు అందుకోలేకపోతున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఎందుకంటే ఇక్కడి రైతుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని, అయినప్పటికీ మేము కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే ఇక్కడి రైతులందరికీ ప్రయోజనాలు అందిస్తామని ప్రధాని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here