కొత్త సచివాలయ నిర్మాణానికి ముహూర్తం

  0

  ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలో కేబినేట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు

  • సభ్యులుగా మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, తలసాని
  • హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా శంకుస్థాపనకే మొగ్గు?

  హైదరాబాద్‌ :

  ప్రస్తుత సచివాలయ స్థలంలోనే కొత్త సచివాలయ నిర్మాణానికి సిఎం కెసిఆర్‌ నిర్ణయంచిడంతో ఈ నెల 27న శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. డి బ్లాక్‌ సవిూపంలో ఉన్న స్థలంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఏర్పాట్లకు ఆదేశించింది. మరోవైపు ప్రస్తు భవనాలను కూల్చాలా వద్దా అన్న విషయంలో తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి నేతృత్వంలో కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, తలసాని శ్రీనివాస యాదవ్‌లు సభ్యులుగా నియమించారు. సచివాలయ భవనాల కూల్చివేత, శాఖల తరలింపు, కొత్త భవన నిర్మాణం దాని నమూనా అంశాలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ అధ్యయనం చేయనున్నది. కమిటీకి ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శర్మ సహకారం అందించనుంది. అన్ని అంశాలను అధ్యయనం చేసి సీఎం కేసీఆర్‌కు కమిటీ నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా కొత్త సచివాలయనిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు సచివాలయనిర్మణం చేపడతామని సిఎం కెసిఆర్‌ ప్రకటించడంతో కొందరు కోర్టులకెక్కారు. దీనిపై శుక్రవారం హైకోర్టు విచారించనుంది. నూతన సచివాలయం, శాసనసభ భవనాల నిర్మాణాలను ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబరు నుంచి చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ నెల చివరివారం తరువాత మంచి ముహూర్తాలు లేకపోవడంతో గురువారం శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవనాల నమూనా తయారీకి ఆర్కిటెక్ట్‌ను కన్‌స్టలెంటుగా నియమించాల్సి ఉంది. ఇంకా గుత్తేదారు ఖరారయ్యేటప్పటికి ఆగస్టు లేదా సెప్టెంబరు వరకు సమయం పట్టవచ్చని అధికారుల అంచనా. ప్రస్తుతమున్న సచివాలయంలోని వివిధ కార్యాలయాలను ఎక్కడికి తరలించాలన్న కసరత్తును సాధారణ పరిపాలన శాఖ చేపట్టింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను గుర్తించే పని ఒకట్రెండు రోజుల్లో కొలిక్కి వస్తుందని చెప్పారు. సచివాలయ నిర్మాణం కోసం అన్ని భవనాలను ఒకేదఫా తొలగించాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. భవన నిర్మాణానికి కావాల్సినంత వరకు గుర్తించి తొలిదశలో అంతవరకే కూల్చివేసి, మిగిలిన భవనాల్లోకి ఆయా కార్యాలయా లను సర్దుబాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం తుది నిర్ణయం ఖరారు చేయాల్సి ఉంది. ఇదేజరిగితే సమతా,తదితర బ్లాక్‌లను కూల్చేసి మిగా భవనాల్లో కార్యాలయాలను సర్దుబాటు చేస్తారు. ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించడంతో భద్రతాకారణాల దృష్ట్యా పక్కనే ఉన్న జలసౌధ భవన సముదాయాన్ని కూడా కూల్చివేయాల్సి ఉంది. రహదారులు-భవనాల శాఖ పాత భవనాలు, జలసౌధ భవనాలను తొలగించిన తరువాత ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థలంలో వాస్తులోపాలు సరిదిద్ది భవన నిర్మాణాలను చేపట్టాలన్నది అధికారులు భావిస్తున్నారు. ఆ ప్రాంగణమంతా భద్రతావలయంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. దీంతో జలసౌధ తొలగింపు అనివార్యమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా ఈ రెండు నిర్మాణాలకు సంబంధించి గురువారం భూమిపూజకు సిఎం కెసిఆర్‌ సిద్దమయ్యారు. అధునాతనంగా అన్నీ అవసరాల మేరకు వీటిని నిర్మించబోతున్నారు. మరోవైపు వీటి నిర్మాణాలపైనా విమర్శలు వస్తున్నాయి. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త సచివాలయం,

  శాసనసభ భవనాల నిర్మాణ అంశాన్ని తెరపైకి తెచ్చారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మరోమారు విమర్శించారు. పాత సచివాలయం కూల్చివేతపై హైకోర్టులో కేసు విచారణలో ఉందని.. ఇప్పుడు దాన్ని కూల్చివేస్తే కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని తెలిపారు. 2016లో కొత్త సచివాలయం నిర్మాణ అంశం తెరపైకి వచ్చినప్పుడు శాసనసభ్యుడిగా తాను హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశానని, దానిపై తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు పాత భవనాన్ని కూల్చొద్దంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇప్పటికీ ఆ ఉత్తర్వులు అమల్లోనే ఉన్నాయని.. ఈ నెల 27న కొత్త సచివాలయ భవనానికి సీఎం శంకుస్థాపన చేస్తే కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని చెప్పారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూస్తానని అన్నారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here