బడిగంటలు మోగివేళ..

0

నేటినుంచి పాఠశాలలు ప్రారంభం

  • మళ్లీ రోడ్డెక్కనున్న ఆటోలు, బస్సులు
  • బుడిబుడి అడుగులతో చిన్నారులు
  • 14నుంచి మళ్లీ బడిబాట కార్యక్రమం

హైదరాబాద్‌ :

నేటినుంచి బడగంటలు మోగనున్నాయి. ఒకటో తేదీన తెరుచుకోవాల్సిన పాఠశాలలు ఎండల కారణంగా 12న తెరుచుకోబోతున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలన్నీ బుధవారం నుంచి పిల్లల రాకతో మళ్లీ కళకళలాడనున్నాయి. మండుటెండల కారణంగా స్కూళ్లను 12న పునఃప్రారంభించాలని ప్రభ్వుతం ఆదేశించింది. దీంతో బుధవారం బడుల్లో బడిగంట మోగనుంది. ఆటోలు, స్కూలు బస్సులతో మళ్లీ గ్రామల నుంచి పట్టణాల వరకు సందడిగా కనిపించనున్నాయి. బుడిబుడగి అడుగులతో కొత్త విద్యార్థులు కూడా పాటశాలబాట పట్టనున్నారు. గతంలోలాగా కాకుండా ప్రభుత్వం ముందే పాఠ్యపుస్తకాలను స్కూళ్లకు సరఫరా చేయడంతో ఇక పుస్తకాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇందుకోసం అవసరమైన పాఠ్యపుస్తకాలను అందజేసింది. ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. బడి తెరిచిన రోజే తరగతుల వారీగా పంపిణీ చేసేందుకు ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. ఈ సారి కొరత లేకుండా చర్యలు తీసుకున్నారు. విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పాఠ్యపుస్తకాల్లో 95 శాతానికిపైగా వచ్చాయి. ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పపంపిన మేరకు పుస్తకాలను పంపారు. హైస్కూల్‌ విద్యార్థులకు సంబంధించిన అన్ని స్జబెక్టుల పుస్తకాలు పూర్తిస్థాయిలో వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఒకటి నుంచి నాలుగో తరగతికి వరకు సంబంధించిన ఒకటి, రెండు స్జబెక్టులు మాత్రం రాలేదని అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాలకు మాత్రం వందకు వందశాతం పాఠ్యపుస్తకాలు చేరుకున్నట్లు డిఇవోలు చెప్పారు. జనగామ జిల్లాలో ఉన్నత తరగతులకు సంబంధించిన పుస్తకాలు వచ్చాయి. రావాల్సిన పుస్తకాలలో ఎక్కువగా మూడో తరగతికి సంబంధించిన పర్యావరణ, నాలుగో తరగతికి చెందిన ఆంగ్లం అవసరమని, అవి త్వరలోనే వస్తాయని, అధికారులు చెబుతున్నారు. ఆంగ్ల మాధ్యమానికి సంబంధించి మూడో తరగతి పరసరాల విజ్ఞానం, ఒకటి, రెండో తరగతి గణిత పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇకపోతే ఈ నెల 14 నుంచి 19 వరకు జరిగే బడిబాట కార్యక్రమంలో బడిఈడు పిల్లల్ని గుర్తించిన వారిని బడిలో చేర్పించే కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ శాఖలు, సామాజిక సంస్థల సహకారంతో విద్యాశాఖ చేపడుతోంది. పాఠ్యపుస్తకాలు, బాలికలకు ఆరోగ్యకిట్లు అందించడానికి జిల్లావ్యాప్తంగా ఉన్న మండల వనరుల కేంద్రాలకు పంపించారు. అక్కడి నుంచి పాఠశాలలకు చేరుకున్నాయి. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు ఎక్కడికక్కడే విద్యార్థులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాయి. వేసవి సెలవుల్లో పనులు పూర్తి చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పినప్పటికీ చాలాచోట్ల పురోగతి కనిపించలేదు. పలుజిల్లాల్లో గతేడాది ప్రారంభించిన అదనపు తరగతి గదుల నిర్మాణం ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. తాగునీరు, విద్యుత్తు, ప్రహరీ, ఆట స్థలం కొరత, శిథిలమైన భవనాలు, విద్యార్థుల సంఖ్యకు సరిపడా మూత్రశాలలు అవసరాలు లేమితో పాఠశాల నిర్వహణ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు కరవయ్యాయి. అత్యధిక పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో పరిసరాల్లో పారిశుద్ధ్య లోపిస్తోంది.మరోవైపు విద్యార్థులకు పాఠశాల ప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలు, బాలికలకు ఆరోగ్యకిట్లు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసి విద్యా సంవత్సరం ఉత్తమ ఫలితాల కోసం ప్రయత్నిస్తామని అన్నారు.

నిబంధనలకు పాతర.. పట్టించుకోని అధికారులు

ప్రయివేటు స్కూళ్లపై విద్యాశాఖ అజమాయిషీ లేకపోవటంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. 1994 జీవో నెంబరు 1 ప్రకారం పాఠశాలలు 5 శాతానికి తగ్గకుండా లాభాలను ఆశించాలి. వసూలు చేసిన ఫీజులో 50 శాతాన్ని ఉపాధ్యాయులకు వేతనాలుగా చెల్లించాలి. ఉపాధ్యాయులు, విద్యార్ధుల ప్రయోజనాలకు 15 శాతం, పాఠశాల నిర్వహణకు, అభివృధ్దికి 15 శాతం చొప్పున ఖర్చు చేయాలి. కానీ ప్రయివేటు విద్యాసంస్ధలు 80 శాతం ఆదాయాన్ని లాభంగా తీసుకుంటూ కేవలం 20 శాతం మాత్రమే ఉపాధ్యాయులు విద్యార్ధుల కోసం ఖర్చు చేస్తున్నాయి. ఏటా ప్రభుత్వానికి సమర్పించాల్సిన ఆడిట్‌ రిపోర్టూ సమర్పించటంలేదు. ఒకవేళ ఫీజులను పెంచాల్సి వస్తే డిస్ట్రిక్ట్‌ ఫీ రెగ్యులేషన్‌ కమిటీ అనుమతి తీసుకోవాలి. పిల్లలను టెక్స్ట్‌ బుక్స్‌, నోట్‌ బుక్స్‌, యూనిఫామ్‌, షూస్‌, స్కూలులోనే కొనాలనే నిబంధన పెట్టకూడదు. వీటిని అమ్మటానికి స్కూల్లోకౌంటర్‌ ఏర్పాటు చేయరాదు. కానీ అధికారులు వీటిని ఏవిూ పట్టించుకోక పోవటంతో విద్యాసంస్ధలు తమ వ్యాపారాన్ని యధేఛ్చగా కొనసాగిస్తున్నాయి. ప్రయివేటు విద్యా సంస్ధలు నిబంధనలు పాటించకపోవటం, వాటిపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవటంతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని విద్యార్ధుల తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలల్లో ప్లే గ్రౌండ్‌, అవసరమైనన్ని టాయిలెట్స్‌, అర్హతగల ఉపాధ్యాయుల భర్తీ చెయ్యాల్సి ఉన్నా పాఠశాలలు ఇవేవిూ అమలు చేయటంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిజిటల్‌ తరగతి గదులు, ఏసీ గదుల పేరుతో కొన్ని పాఠశాలలు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయటం పట్ల విద్యార్ధి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో నిర్ణయించిన ఫీజులు సకాలంలో చెల్లించకపోతే వాటికి అపరాధ రుసుం కలిపి వసూలు చేస్తున్నాయి. ఒక వేళ అంత ఫీజు చెల్లించినా ఆయా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదని తల్లి తండ్రులు ఆరోపిస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here