Featuredస్టేట్ న్యూస్

తెలంగాణ, ఆంధ్రలో ప్రత్యామ్నాయం బీజేపీనే

  • మళ్ళీ మోడీనే ప్రధాన మంత్రి
  • ఇక్కడ ఆరు.. అక్కడ ఎనిమిది ఎంపీ సీట్లు
  • రాహుల్‌ ప్రధాని కాలేరు
  • తెలుగు రాష్ట్రాలలో త్వరలో బీజేపీలోకి భారీగా వలసలు
  • పుల్వామా దాడిని రాజకీయం చేస్తున్నరు
  • ఏపీలో టిడిపి మాయమవుతుంది
  • ఆంధ్రా రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రానున్న రోజులలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో అన్ని రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఉండబోతుందని, తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైతే టిడిపి కనుమరుగు అయిందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో ఆయనను ”ఆదాబ్‌ హైదరాబాద్‌” ప్రత్యేకంగా కలిసి ఇంటర్వూ చేపట్టింది. ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో దేశంలో మరో మారు నరేంధ్రమోడీ ప్రధాన మంత్రి అవుతారని, కేంధ్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అంత సీన్‌లేదని, రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రి కాలేరని ఆయన అన్నారు. దేశంలో గతంలో కంటే ఈ సారీ పార్లమెంట్‌ సీట్లు ఎక్కువగానే వస్తాయని, భారత్‌లో మొత్తం 270కి పైగా ఎంపీ స్థానాలను గెలుసుకుంటున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీలో ఎలాంటి విబేధాలు లేదని, విబేధాలు ఉంటే గతంలో ఇతర పార్టీలలో మంత్రులుగా చేసిన నాయకులు ఎందుకు తమ పార్టీలో చేరుతారన, అలాని కాకుండా పార్టీ పెరుగుతున్న కొద్ది అక్కడక్కడా చిన్న చిన్న ఇబ్బందులు రావడం సహజమని విష్ణువర్దన్‌రెడ్డి చెప్పారు. అలాగే రానున్న రోజులలో బీజేపీలోకి అన్ని పార్టీల నాయకులు జంప్‌ కానున్నారని, ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటు టిఆర్‌ఎస్‌ పార్టీకి, అటు వైఎస్‌ఆర్‌సీపికి ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీనే అవతరించనున్నదని అన్నారు. తెలంగాణాలో కనీసం ఆరు సీట్లు వస్తాయని, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌, చేవెళ్ళ, వరంగల్‌ తదితర ఎంపీ స్థానాలు తాము గెలుసుకుంటున్నామని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌లో తమ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలలో ఎన్నికల బరిలో నిలిచిందని, అన్ని స్థానాలలో తాము పోటీలో ఉన్నామని, ఇక తెలుగుదేశం పార్టీ కనుమరుగవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయాల కోసం దేశాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. దేశంలో అంత పెద్ద సంఘటన పుల్వమా దాడి జరిగితే నరేంద్రమోడీ ఓట్ల కోసమే ఈ దాడి జరిపించారని, అసలు అక్కడ దాడే జరగలేదని, జవాన్లను అవమాన పరిచే విధంగా రాజకీయాలు చేస్తున్నారని విష్ణు మండిపడ్డారు. పుల్వమా దాడి విషయంలో ప్రపంచ దేశాలు భారత్‌ను, నరేంద్ర మోడీని అభినందియాని, కానీ అటు కాంగ్రెస్‌ నాయకులకు మింగుడు పడక పసలేని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని, ప్రతిపక్షంగా కూడా ఉండలేదని, 2019 ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ స్థానాలకు ఎన్నిల బరిలో నిలిచి ట్రై చేశామని, కానీ 2024లో ఖచ్చితంగా రెండు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీనే గెలిచి తీరుతుందని జోష్యం చెప్పారు. తెలంగాణలో కేసీఆర్‌ కేంద్రంపై జెండా ఎగురవేస్తామని మాట్లాడుతూ ఎన్నికల్లో లబ్దీ పొందేందుకు చూశారని, కానీ ప్రాంతీయ పార్టీలు కేంధ్రం వరకు వెల్లినవి ఎక్కడా ఏ రాష్ట్రంలో లేవని అన్నారు. కేసీఆర్‌ ఎన్ని కూటములు ఏర్పాటు చేసిన కూటమి ద్వారా ప్రధాన మంత్రి కాలేరని, రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలతో కేంద్రంలో చేసేదేమీ ఉండదని, 17 ఎంపీ సీట్లతో కేంద్రంలో ప్రతిపక్షం సాధ్యం కాదని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. మొన్న జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీలే ఎక్కువ స్థానాల్లో తలపడ్డాయని, తెలంగాణలో గట్టి పోటీ ఇచ్చింది బీజేపీయే అని అన్నారు. దేశంలో జరిగిన మొదటి విడత ఎన్నికల్లోనే మళ్ళీ మోడీనే ప్రధాన మంత్రి అని రుజువయిందని, ఇక రెండో విడత ఎన్నికల్లో అది ఖచ్చితమైపోతుందని తెలిపారు. దేశ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని, కాంగ్రెస్‌ వైపు లేరని, ప్రజా తీర్పు మళ్ళీ బీజేపీవైపే ఉంటుందని విష్ణువర్ధన్‌ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ కుంభకోణాల్లో కూరుకుపోయిందని, ఆ పార్టీ గురించి దేశ ప్రజలందరికీ తెలిసిపోయిందని, కుంభకోణాల పార్టీకి ప్రజలు పట్టం కట్టరని విమర్శించారు. దేశానికి కాపలాదారుడిగా ఉన్న నరేంధ్ర మోడీకే ఓటు వేస్తారని అన్నారు. ఎన్నికల్లో ఇటు చంధ్రశేఖర్‌రావు, అటు చంద్రబాబు నాయుడు ప్రజలను వాడుకుంటున్నారని, ఇద్దరూ కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని, వారి కుటుంబం కోసం అమాయక ప్రజలను వాడుకుంటున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీకి ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని, ప్రజాభివృద్ది కోసమే బీజేపీ పని చేస్తోందని అన్నారు. ఆంధ్రాలో ఏపార్టీ అధికారంలో ఉన్నా వారికి ప్రజా ప్రయోజనాల కోసం చేయూతనిస్తామని, ప్రజలు అభివృద్ది చెందితేనే పార్టీలు బాగుపడతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యే క హోదా కోసం ఏపార్టీ పోరాడినా, ఏ ప్రభుత్వం ఉన్నా వారికి కేంద్రం ద్వారా చేయూత నిస్తామని తెలిపారు. ఆంధ్రలో ప్రజా ప్రయోజనాలు గాలికి వదిలేసి రాజకీయం, సీట్ల కోసం పోరాటాలు చేస్తున్నారని, తమ పార్టీకి ఒక వ్యూహం ఉన్నదని, అదే వ్యూహంతో ముందుకు వెళుతున్నామని, కేరళ, కర్నాటక తదితర రాష్ట్రాలలో వ్యూహంతోనే దూసుకుపోతున్నామని ఆయన తెలిపారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close