Featuredస్టేట్ న్యూస్

పదిలో బాలికలదే హవా..

  • రాష్ట్ర వ్యాప్తంగా 92.43శాతం ఉత్తీర్ణత
  • 99.30శాతంతో మొదటి స్థానంలో జగిత్యాల
  • 89.09శాతంతో చివరి స్థానంలో హైదరాబాద్‌
  • విడుదల చేసిన విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి
  • జూన్‌10నుంచి 24వరకు సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): తెలంగాణలో పదోతరగతి పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. టెన్త్‌తో మరోమారు బాలికలు సత్తా చాటారు. అత్యధిక శాతంలో ఉత్తీర్ణులయ్యారు. అలాగే జగిత్యాల ఫలితాల్లో టాప్‌గా నిలిచింది. సోమవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయం ‘డీ’బ్లాక్‌ సమావేశ మందిరంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 5లక్షలకుపైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకాగా.. 92.43శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. 93.68 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారని, బాలురు 91.18శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫలితాల్లో 99.30 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, 89.09 శాతంతో హైదరాబాద్‌ చివరి స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4374 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. 98.78 శాతం ఉత్తీర్ణతతో బీసీ గురుకుల పాఠశాలలు అత్యుత్తమంగా నిలిచాయన్నారు. జూన్‌ 10 నుంచి 24 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జనార్దన్‌రెడ్డి తెలిపారు. పరీక్ష రుసుం చెల్లించేందుకు మే 27వ తేదీ తుది గడువు ఉంటుందన్నారు. ఇటీవల ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో పదో తరగతి ఫలితాల విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందని జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే పాఠశాలలు, విద్యార్థులు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు టీఎస్‌ఎస్‌ఎస్‌సీ బోర్డు యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ యాప్‌ను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బిఎస్‌ఈ.తెలంగాణ.జీఓవి.ఇన్‌ అనే వెబ్‌సైట్‌ నుంచి డౌన్లోడ్‌ చేసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది. మొబైల్‌ ప్లే స్టోర్‌ నుంచి కూడా టీఎస్‌ఎస్‌ఎస్‌సీ బోర్డు అని టైప్‌ చేసి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించింది. డౌన్‌లోడ్‌ చేసుకున్న తరువాత విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ నమోదు చేసి లాగిన్‌ కావాల్సి ఉంటుంది. లాగిన్‌ అయ్యాక అందులో పేరు, పాఠశాల విద్యార్థుల హాల్‌టికెట్‌ నంబర్‌ వస్తాయి. అలాగే విద్యార్థులు తమ మొబైల్‌ నంబర్‌ను రెండుసార్లు నమోదు చేయాల్సి ఉంటుంది. మెయిల్‌ ఐడీని నమోదుచేసి సేవ్‌ చేయాలి. విద్యార్థులు ఫలితాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే గ్రీవెన్సెస్‌లోకి వెళ్లి దానిని సెలెక్ట్‌ చేసి, టెక్ట్స్‌ బాక్స్‌లో ఫిర్యాదురాసి సబ్మిట్‌ చేయాలి. ఆ తరువాత కన్‌ఫర్మేషన్‌ మేసేజ్‌ విద్యార్థుల మొబైల్‌ నంబర్‌కు వస్తుంది. అయితే ఇందులో ఒక్కసారే ఫిర్యాదు చేయడానికి వీలు ఉంటుందని విద్యాశఖ అధికారులు తెలిపారు.

సప్లిమెంటరీ షెడ్యూలు విడుదల

తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. మే 13న ఉదయం 11.30 గంటలకు పదోతరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసిన వెంటనే సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా ప్రకటించారు. మే 13న విడుదలైన పదోతరగతి ఫలితాల్లో మొత్తం 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలు 93.68 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 91.18 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 3 వరకు నిర్వహించిన పదోతరగతి పరీక్షలకు మొత్తం 5.46 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. షెడ్యూలు ప్రకారం జూన్‌ 10న సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమై.. జూన్‌ 24తో పూర్తి కానున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు కొన్ని పరీక్షలు, మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొన్ని పరీక్షలు జరగనున్నాయి.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close