టెంపుల్‌ టౌన్స్‌లో టెన్షన్‌ టెన్షన్‌..

0

– అయోధ్యలో తీవ్ర ఉద్రిక్తత

– అయ్యప్ప సన్నిధిలో అరెస్టులు, ఆందోళనలు

– ప్రశాంతత కొరవడుతున్న ప్రధాన ఆలయాలు

– హిందూమత పెద్దల మండిపాటు

– భక్తుల్లో తీవ్ర అసంతృప్తి

మనశ్శాంతి కోసం తీర్థయాత్రలు తిరిగే మన దేశంలో ఇటీవల కాలంలో పెద్దఎత్తున భక్తులను ఆకర్షించే ప్రధాన ఆలయాలు ఆందోళనలకు, ఉద్రిక్తతలకు నిలయాలుగా మారుతున్నాయి. రాజకీయ పార్టీల దుర్మార్గపు ఆందోళనలు, వ్యూహాల వల్ల, ప్రజల సెంటిమెంట్‌ పట్టని న్యాయస్థానాల తీర్పుల వల్ల ఆధ్యాత్మిక ప్రపంచం తీవ్ర కలవరపాటుకు లోనవుతుంది. ఆలయాలలో తరతరాలుగా సాగుతున్న ఆచారవ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాల విషయంలో హేతువాదులు, నాస్తికవాదులు సెక్యూలర్‌ సిద్ధాంతాల పేరుతో మతవ్యవహారాల్లో జొరబడే నేతలు, కార్యకర్తల వల్ల ప్రశాంత సుందర ఆలయాలు యుద్ధరంగాన్ని తలపిస్తున్నాయి. అయోధ్యలో శ్రీరాముని భవ్యమందిర నిర్మాణం ఇప్పటికి మొదలుకాకపోవడం పట్ల హిందూమత సంస్థలు ఆగ్రహావేశాలతో అయోధ్య నగరాన్ని రణరంగంగా మార్చివేశాయి. కాగా ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల తిరుపతి, బెజవాడ కనకదుర్గ ఆలయాలు కూడ తరుచూ వివాదగ్రస్తాలవుతూ భక్తులను కలవరపరుస్తున్నాయి. అధికారుల అవినీతి, కుంభకోణాలు రోజుకొకటిగా భయట పడుతూ ఆస్తికలోక విశ్వాసానికి విఘాతం కలిగిస్తున్నాయి.

రామాలయ నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ శివసేన, విశ్వహిందూ పరిషత్‌లు వేర్వేరు కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో అయోధ్యలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. అయోధ్యలో ధర్మసంసద్‌ పేరుతో వీహెచ్‌పీ ఆదివారం ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. మరోవైపు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాక్రే కూడా అయోధ్యలో ప్రార్థనలు నిర్వహించేందుకు ఆదివారం రానున్నారు. రెండు రోజుల పాటు ఆయోధ్యలో బసచేయనున్న ఉద్ధవ్‌ థాక్రే, సరయూ నది ఒడ్డున నిర్వహించే హారతి కార్యక్రమంలో పాల్గొని, సాధువులు, స్థానికులను కలుసుకుంటారు. పుణేలోని శివనేర్‌ కోట నుంచి మట్టిని ఓ కుండలో నింపి తనతోపాటు తీసుకొస్తున్న ఉద్ధవ్‌, దానిని ఆయోధ్యలోని మహంత్‌కు అందజేయనున్నారు. వివాదాస్పద బాబ్రీ మసీదు స్థలంలో రామమందిరం నిర్మించాలన్న డిమాండ్‌ రోజురోజుకీ పెరుగుతోంది. విశ్వహిందూ పరిషత్‌ ధర్మ సభ నిర్వహిస్తుండడం, ఈ సభకు లక్షలాది మంది తరలి వస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. వీహెచ్‌పీ సభకు దాదాపు ఐదు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వీహెచ్‌పీతోపాటు శివసేన కలిసి ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించనున్నాయి. ఈ కార్యకమ్రానికి శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ థాకరే కూడా హాజరవుతున్నారు. సరయూ నదిలో జరిగే హారతి కార్యక్రమంలో ఉద్దవ్‌ పాల్గొంటారు.ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అయోధ్యలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. వందలాది మంది పోలీసులను మోహరించి, 144 సెక్షన్‌ విధించారు. ఆదివారం జరిగే ధర్మ సంసద్‌లో దాదాపు 2 లక్షల మంది పాల్గొంటారని, 1992 నుంచి రామమందిర నిర్మాణం కోసం పోరాడుతున్న సాధువులు, మద్దతుదారులు హాజరవుతారని వీహెచ్‌పీ తెలిపింది. ఈ సభలోనే రామాలయ నిర్మాణంపై చర్చిస్తామని వెల్లడించింది. అయితే, తాము నిర్వహించే ధర్మ సంసద్‌కు క్రమశిక్షణ కలిగిన వీహెచ్‌పీ కార్యకర్తలు హాజరవుతారని, ఎలాంటి సమస్య ఉండబోదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో, మందిర నిర్మాణం కోసం కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకురావాలని శివసేన డిమాండ్‌ చేస్తోంది. న్యాయస్థానం తీర్పుకు కోసం ఎదురుచూడకుండా ఆర్డినెన్స్‌ తెచ్చి, ఆలయ నిర్మాణం వేగవంతం చేయాలని కోరింది. నాడు యూపీలో బీజేపీ అధికారంలో ఉండగా బాబ్రీ మసీదు కూల్చివేత కార్యక్రమంలో శివసైనికులు పాల్గొవడం తమకు ఎంతో గర్వకారణమని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం తక్షణమే చేపట్టాలంటూ గత కొద్ది రోజులుగా శివసేన డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘బాబ్రీమసీదును కూల్చడానికి రామభక్తులకు 17 నిమిషాలు మాత్రమే పట్టింది.. మందిర నిర్మాణం కోసం చట్టం చేయడానికి ప్రభుత్వానికి ఎంత కాలం పడుతుంది?’ అని శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ ప్రశ్నించారు. పూర్తి మెజారిటీ ఉన్నా, మందిరాన్ని కట్టలేకపోయామని, 2019 ఎన్నికల్లో మళ్లీ అదే నినాదంతో ప్రజల వద్దకు వెళ్లడం తమ నేత ఉద్ధవ్‌కు ఆమోదనీయం కాదన్నారు. మందిర నిర్మాణానికి బిల్లు తెస్తే పార్టీలకు అతీతంగా 400 మంది ఎంపీలు మద్దతు ఇస్తారని వెల్లడించారు. రామ మందిరం నిర్మించే తేదీని వెల్లడించాలని శివసేన డిమాండ్‌ చేసింది.

శబరిమలలో ఉద్రిక్తత

తిరువనంతపురం: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెక్యూరిటీ జోన్‌ ‘వావరునాథ’ వద్ద నిరసన చేస్తున్న 82మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిషేధాజ్ఞలు విధించినప్పటికీ శరణాలు చేస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి కాస్త సద్దుమణిగిన తర్వాత వారిని విడిచిపెట్టారు. కొందరు నిరసనకారులను వావరునాథ నుంచే వెనక్కి పంపేశారు. అంతేకాకుండా అక్కడ 144 సెక్షన్‌ కూడా విధించారు. అయితే శనివారం రాత్రి 11గంటలు దాటిన తర్వాత కూడా కొందరు అయ్యప్ప శరణాలతో నిరసనలు కొనసాగించారు. దీంతో భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి కేజీ కన్నన్‌తో పాటు అక్కడున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని పంబ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కొంత సేపటికి వారిని విడిచిపెట్టారు. శబరిమల ఆలయ ద్వారాలు ఈనెల 17న తెరుచుకున్న విషయం తెలిసిందే. అయితే శబరిమలలోకి అన్నివయసుల మహిళల ప్రవేశానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మహిళా భక్తులు కూడా అక్కడకు చేరుకుంటున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్న హిందూ ధర్మపరిషత్‌, భక్తులు, రాజకీయ పార్టీలు నిరసన బాటపట్టాయి.

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం స్వాహా కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసుశాఖ వెల్లడించింది. ఈ కేసులో ఇంకా పలువురు పాత్ర ఉన్నట్లు తెలిపింది. మిగిలిన వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని స్పష్టం చేసింది. కేసు పరిశోధనలో ఉన్నందున పూర్తి వివరాలు వెల్లడించలేకపోతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు స్థానిక ఒకటో పట్టణ పోలీసులు శుక్రవారం ఓ ప్రకటన జారీ చేశారు. నవరాత్రి బ్రహ్మూెత్సవాల్లో గరుడసేవ పర్వదినాన లడ్డూ ప్రసాద వితరణ కేంద్రంలో పని చేస్తున్న పొరుగుసేవల సిబ్బంది 30 మంది వరకు కుమ్మక్కై 26 వేల లడ్డూలను పక్కదారి పట్టించారు. ఒకట్రెండు రోజుల్లోనే భారీ అక్రమానికి పాల్పడగా తితిదే విజిలెన్స్‌ గుర్తించి వెలుగులోకి తెచ్చింది. ఈ అక్రమంపై తితిదే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ అనంతరం ప్రధాన పాత్రధారులుగా తేల్చుతూ.. ఇండియన్‌ బ్యాంకు తరఫున పర్యవేక్షకులుగా ఉన్న తిరుపతిలోని పద్మావతిపురానికి చెందిన కె.శివ, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు కౌంటరు ఉద్యోగి చౌడేపల్లె మండలం వినాయకనగర్‌కు చెందిన డి.నవీన్‌కుమార్‌, శాంతిపురం మండలం కార్లగట్ట గ్రామానికి చెందిన కె.వై.సంపంగి, రామచంద్రాపురం మండలం నూతనగుంటపల్లె గ్రామానికి చెందిన వై.యుగంధర్‌, గుంటూరు జిల్లా అరవపల్లె వాసి ఎల్‌.శ్రీనుబాబుపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. వీరు ప్రొటెక్టివ్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌, మాక్స్‌ ప్రొటెక్టివ్‌ సర్వీసెస్‌ కింద పని చేస్తున్నారు. నిందితులను గురువారం అరెస్టు చేసి తిరుపతి న్యాయస్థానంలో హాజరుపర్చగా.. కోర్టు 15 రోజుల రిమాండ్‌ విధించింది.

ఇంకా మరింత మంది పాత్ర ఉంది: లడ్డూ ప్రసాదం స్వాహా కేసులో మరికొంత మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రాథమిక అంచనా మేరకు 30 మంది హస్తం ఉన్నట్లు తేలింది. పక్కా ఆధారాలు సేకరించి తొలుత ఐదుగురిని అరెస్టు చేయగా మిగిలిన వారిపై ద ష్టి సారించారు. అనుమానితులను విచారిస్తున్నారు. త్వరలోనే మరికొందరు అరెస్టు అయ్యే అవకాశం ఉంది. కేసుపై తితిదేతో పాటు పోలీసుశాఖ ప్రత్యేక దష్టి సారించి ప్రత్యేక బ ందంతో విచారణ చేపట్టింది.

దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిర్వహించిన సాంస్క తిక కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులకు ఇచ్చే జ్ఞాపికల వ్యవహారంలో దేవస్థానాన్ని మోసం చేసిన కేసులో ఇద్దరు ఉద్యోగులను వన్‌టౌన్‌ పోలీసులు శనివారం విచారించారు. జ్ఞాపికల వ్యవహారంలో దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ దేవస్థానానికి చెందిన ఏఈవో అచ్యుతరామయ్య, సూపరింటెండెంట్‌ గోపిచంద్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ సునీతలను సస్పెండ్‌ చేయగా… తాత్కాలిక ఉద్యోగి సైదాను విధుల నుంచి తొలగించారు. సస్పెన్షను వ్యవహారంపై ఏఈవో అచ్యుతరామయ్యకు, ఈవో కోటేశ్వరమ్మకు మధ్య వాగ్వివాదం చూడా చోటుచేసుకుంది. ఏఈవో నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఈవో వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాల సేకరణ నిమిత్తం సీఐ కాశీవిశ్వనాథ్‌ నిందితులతో పాటు సాక్షులకు కూడా నోటీసులు జారీ చేశారు. సాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు సీనియరు అసిస్టెంట్‌ సునీత, తాత్కాలిక ఉద్యోగ సైదాల నుంచి సీఐ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. జ్ఞాపికలు ఎన్ని ఆర్డరు ఇచ్చారు. కళాకారులకు ఎన్ని అందజేశారు. వాటికి సంబంధించి వివరాలను నమోదు చేశారా? దేవస్థానానికి ఎన్ని జ్ఞాపికలు ఇచ్చినట్లు బిల్లులు పెట్టారు అన్న విషయాలను వారి నుంచి సేకరించినట్లు తెలిసింది. వారి నుంచి వాంగ్మూలాలు పూర్తిగా సేకరించిన తరువాత ఈ కేసుతో సంబంధం ఉన్న సూపరింటెండెంట్‌, ఏఈవోల నుంచి కూడా వాంగ్మూలాలను నమోదు చేస్తామని, తరువాత దేవస్థానం ఈవో సమర్పించే సాక్ష్యాధారాల అనుగుణంగా నిందితులపై చర్యలు ఉంటాయని సీఐ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here