అయ్యప్ప సన్నిధిలో అనుక్షణం టెన్షన్‌

0

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నేటి నుంచి ఆలయ ద్వారాలు తెరుచుకోనుండటంతో మహిళల రాక మొదలైంది. ఆలయం వైపు వెళ్తున్న మహిళలను అయ్యప్ప భక్తులు అడ్డుకుంటున్నారు. ఆలయంలోకి మహిళలను అడుగు పెట్టనీయబోమని.. అవసరమైతే దాడులకు వెనుకాడమని హెచ్చరిస్తున్నారు. కేరళ ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని.. ఆలయ సందర్శనకు వచ్చే భక్తులకు తగిన భద్రత కల్పిస్తామని అంటోంది. బుధవారం ఆలయం తెరవాల్సి ఉండగా.. అయ్యప్ప భక్తులు, ఆందోళనకారులు శబరిమలలోకి ప్రవేశించే బస్సులు, ఇతర వాహనాల్లో మహిళల కోసం గాలిస్తున్నారు. మహిళలను వాహనాల నుంచి కిందకు దించేస్తున్నారు. ఆలయానికి వెళ్లే మార్గంలో తొలి క్యాంప్‌ అయిన నీలక్కాల్‌ వద్దే మహిళలను అడ్డుకుంటున్నారు. ఇక్కడి నుంచి పంబా ప్రాంతానికి వెళ్తారు. గతంలో మహిళల్ని పంబా వరకు అనుమతించేవారు. అయితే ఇప్పుడు ఆందోళనకారులు నీలక్కాల్‌ వద్దే మహిళల్ని ఆపేస్తున్నారు.

పంబ : మళయాల క్యాలెండర్‌ ప్రకారం మాసపూజల కోసం శబరిమల అయ్యప్ప దేవాలయ ద్వారాలు బుధవారం తెరచుకోనున్నాయి. రుతుసంబంధమైన అంశాలతో సంబంధం లేకుండా అన్ని వయసుల ఆడవారూ శబరిమల ఆలయంలోకి వెళ్లవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత తొలిసారి అయ్యప్ప ఆలయం తలుపులు భక్తుల సందర్శన కోసం తెరుచుకుంటోంది. నైష్ఠిక బ్రహ్మచర్యం ఆలయ ఆచారంగా, సంప్రదాయంగా ఉన్న అయ్యప్ప ఆలయంలోకి ఎలాపడితే అలా ఎవ్వరూ రావడానికి వీల్లేదు. మరీ ముఖ్యంగా అత్యంత పవిత్రమైనవి, స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనవి అయిన 18 మెట్లు ఎక్కడానికి అయ్యప్ప మండల దీక్ష తీసుకున్న వారికే అర్హత ఉంది. అయ్యప్ప దీక్ష అంటే కేవలం బ్రహ్మచర్యమే! 41 రోజుల పాటు పెళ్ళియిన వారైనా సరే బ్రహ్మచర్యాన్ని ఆచరించే ఆలయానికి రావాలి. 41రోజులు నిరాటంకంగా దీక్షచేసే పరిస్థితి రుతుక్రమం మొదలైన మహిళలకు ఉండదు కనుక పెద్దమనిషికాని ఆడపిల్లలు, ముట్లుడిగిన అమ్మలు రావచ్చు. దేవస్థానంలో తరతరాలుగా అమలులో ఉన్న ఈ నియమాన్ని తోసిరాజని సుప్రీంకోర్టు అన్నివయసుల ఆడవారికి ఆలయప్రవేశానికి అనుమతినివ్వడం, అందుకు రాష్ట్రప్రభుత్వం అంగీకరించడంతో చిచ్చురేగింది. ఈ తీర్పు వచ్చింది మొదలు అయ్యప్పకొండ అగ్నిగుండంగా మారింది. పరమప్రశాంతమూర్తి అయ్యప్ప పరంజ్యోతిగా కనిపించేచోట ధర్మాగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. తరతరాల సంప్రదాయం తమ కళ్ళెదుటే నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోలేక అయ్యప్ప భక్తులు పొగిలిపోతుంటే నైష్టికులైన గురుస్వాములు రగిలిపోతున్నారు.

కాలుపెడితే ఖబడ్దార్‌

సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సంప్రదాయం అనుమతించని మహిళలు ఎవరు ఆలయంలోకి ప్రవేశించడానికి సాహసించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భారతీయ ధర్మ జనసేన, శబరిమల భక్త సంఘాలు హెచ్చరిస్తున్నాయి. శబరిమలకు వచ్చే వాహనాలను నిలిపి ఉంచే నీలక్కల్‌కు ఇప్పటికే వేలాదిగా మహిళలు చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఒక్క మహిళను కూడా శబరిమల వైపు వెళ్లనిచ్చేది లేదని సంఘాల ప్రతినిథులు తేల్చి చెబుతున్నారు. ఎవరైనా వస్తే, తాము రోడ్డుపై పడుకుని అడ్డుకుంటామని, అప్పటికీ వెనుదిరగకపోతే వారిని రెండు ముక్కలు చేస్తామని ఘాటుగా హెచ్చరిస్తున్నారు. మరోవైపు కోజికోడ్‌ జిల్లాకు చెందిన బిందు అనే మహిళ 30 మందితో కలసి శబరిమలకు వెళ్తున్నానంటూ సోషల్‌ మీడియాలో ఒక ప్రకటన చేసింది. ఆమెను ఇంటి దగ్గరే అడ్డుకుని బయటకే రానివ్వబోమని అయ్యప్ప భక్త సంఘాలు హెచ్చరించాయి. అలాగే అయ్యప్ప ఆలయంలోకి తాను వెళ్తానని కేరళకు చెందిన రేష్మా నిశాంత్‌ తన ఫేస్‌బుక్‌లో చేసిన కామెంట్స్‌ ఉద్రిక్తతకు దారితీశాయి. 18 మెట్లెక్కి స్వామిని దర్శించుకొంటానని చెప్పారు. రేష్మా డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. హిందూ సంస్థల కార్యకర్తలు ఆమె ఇంటిని చుట్టుముట్టారు. అయ్యప్ప ఆలయంలోకి వెళ్లకుండా ఆమెను అడ్డుకొంటామని హెచ్చరించారు.

ప్రత్యేకచర్యలు చేపట్టని దేవస్వం

ఇదిలాఉండగా ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డు కీలక సమావేశం నిర్వహించింది. ‘సేవ్‌ శబరిమల’ పేరిట జరుగుతున్న నిరసనలు, మహిళలు ఎవరైనా వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సవిూక్షించింది. కానీ, మహిళా భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు, భద్రత పేరిట ఇంతవరకూ ఎటువంటి ఏర్పాట్లూ చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. కాగా సుప్రింకోర్టు తీర్పునుకు అనుగుణంగా ఆలయానికి వచ్చే మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేరళలోని పలు ప్రాంతాలతో పాటు శబరిమల పరిసరాలలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మహిళా భక్తులు ఎలాంటి ఆందోళనా చెందవద్దని, కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని స్పష్టం చేసింది.

మహిళలు వస్తే.. హింస తప్పదు – ప్రధాన పూజారి తంత్రీ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు ఎవరైనా స్వామి దర్శనానికి వస్తే హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయని శబరిమల ఆలయ ప్రధాన పూజారి, తంత్రి కందరారు మహేశ్వరారు హెచ్చరించారు. ముంబైలోని గోరేగావ్‌ అయ్యప్ప ఆలయంలో వారాంతపు పూజకోసం వచ్చిన ఆయన విూడియాతో మాట్లాడుతూ… తీర్పుపై వేసిన రివ్యూ పిటిషన్‌ దసరా సెలవుల అనంతరం విచారణకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. చట్టపరంగా చూస్తే అనుకూలంగా లేకపోయినా తీర్పునకు వ్యతిరేకంగా నిర్వహిస్తోన్న ఆందోళనలు, నిరసనలు వల్ల న్యాయస్థానం పునరాలోచించక తప్పదని ఆయన పేర్కొన్నారు. సుప్రీం తీర్పునకు వ్యతిరేకంగా కేరళ మొత్తం ఏకమైంది.. జల్లికట్టుపై తమిళనాడులో ఏం జరిగిందో చూశారు కదా.. అలాగే ప్రస్తుతం కూడా పెద్ద సంఖ్యలో మహిళలతోపాటు లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.. అనేక హిందూ సంస్థలు సేవ శబరిమల పేరుతో ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.. ఈ సమయంలో మహిళలు ఆలయంలోకి ప్రవేశించడానికి సాహసిస్తే తప్పకుండా హింసకు దారితీస్తుంద’ని తంత్రి హెచ్చరికలు పంపారు. అయ్యప్ప భక్తుల ఆందోళనలకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. శబరిమలకు మహిళలు వస్తే ఆత్మహత్య చేసుకుంటామని శివసేన కార్యకర్తలు బెదిరిస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీ కేరళ రాజధానికి చేరుకుంది.

పంబకు వెళ్తున్న మహిళల్ని బస్సు నుంచి దింపేశారు..

మహిళా జర్నలిస్టుల లాగివేత

కొట్టాయం నుంచి పంబాకు బస్సులో వెళ్తున్న ఇద్దరు మహిళల్ని అర్ధాంతరంగా లాగేశారు. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించరాదు అని బీజేపీ కార్యకర్తలు కేరళలో ధర్నా చేశారు. అయితే ఆ ఇద్దరూ మహిళా జర్నలిస్టులు అని తేలింది. పంబ వద్ద పరిస్థితిని అంచనా వేసేందుకు తాము అక్కడకు వెళ్తున్నట్లు వారు చెప్పారు. నిలక్కల్‌ వద్ద ఈ ఘటన జరిగింది. పంబకు వెళ్లే ప్రతి బస్సును ఓ గ్యాంగ్‌ ఎప్పటికప్పుడూ చెక్‌ చేస్తోంది. కాగా మహిళలను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం విజయన్‌ అన్నారు.

తిరగబడుతున్న సంప్రదాయం

విరగబడుతున్న ప్రగతిశీలం

మహిళలలోనే భిన్నస్వరాలు

అన్ని వయసుల మహిళలను శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేరళ అట్టుడు కుతోంది. సుప్రీం తీర్పుపై ప్రగతీశీల శక్తులు హర్షం వ్యక్తం చేస్తుండగా.. సంప్రదాయవాదులు మండిపడుతున్నారు. మహి ళలే అత్యున్నత న్యాయస్థానం తీర్పును వ్యతిరేకిస్తూ.. ”రెడీ టూ వెయిట్‌” అంటూ క్యాంపెయిన్‌ మొదలుపెట్టారు. తమిళనాడుకు చెందిన కొంతమంది హిందూ మహిళలైతే తాము 50 ఏళ్ల తర్వాతే అయ్యప్ప ఆలయంలోకి వెళ్తామని.. న్యాయస్థానం తీర్పుల కన్నా సనాతన ధర్మానికి, సాంప్రదాయాలకే తాము కట్టుబడి ఉంటామని చెబుతున్నారు.

మరోవైపు కేరళలోని పందలంలో ఉన్న అయ్యప్ప ధర్మ సంరక్షణ సమితి సైతం సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టనున్నామని తెలిపింది. అయ్యప్ప స్వామి కంటే ఎవరూ గొప్పకాదంటూ.. స్వామియే శరణం అయ్యప్ప అనే నినాదాలు చేస్తూ కేరళలోని వివిధ ప్రాంతాల్లో.. రాష్ట్ర, జాతీయ రహదారులను

దిగ్బంధం చేశారు.

అయ్యప్ప మంత్రాన్ని పఠిస్తూ.. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల దాకా కిల్లిపాలెం రోడ్డుపై బైఠాయించారు. ఈ సమయంలో ఇడుక్కికి చెందిన అంబిలి అనే మహిళా కార్యకర్త ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఇతర కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు.

తిరువాభరణాలు ఇచ్చేదిలేదు

సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ప్రతి ఏటా మకరవిలక్కులో భాగంగా జరిగే ” తిరువాభరణం” కార్యక్రమానికి అయ్యప్ప ఆభరణాలను అందివ్వమని పందలం ప్యాలెస్‌ నిర్వాహక సంఘం హెచ్చరించింది. దీనితో పాటు సుప్రీం తీర్పును వ్యతిరేకించే వారి నుంచి సంతకాలు సేకరిస్తున్నారు ఉద్యమకారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here