గుడి స్థలం ఒకరు.. గుట్ట మరొకరు

0
  • భూ మాయలో కొత్త కోణం
  • కబ్జాలో అటవీభూమి.?
  • విజిలెన్స్‌ ఆరా.!
  • పత్రాలు తీసుకున్న ఏసీబీ
  • ‘వి’నాయకుల జాబితా రెడీ

హైదరాబాద్‌ : ఎట్టకేలకు ఓ తేనెతుట్టె కదిలింది. రెవెన్యూశాఖ లీలలు ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ గురువారం ప్రచురించిన విషయం తెలిసిందే. ఓ మాజీ ఎమ్మెల్యే అటవీశాఖ భూమి సుమారు 30 ఎకరాలు ఆక్రమించినట్లు తెలిసింది. ఇదే అదనుగా భావించిన మరో వ్యాపారవేత్త ఏకంగా గుడి స్థలాన్ని ఆక్రమించి రోడ్డు నిర్మించిన విషయం కొత్తగా వెలుగులోకి వచ్చింది. కొనుగోలు పత్రాలు ఎక్కడ: అవకాశం దొరికితే అందరూ సిద్దిహస్తులే.! ఓ మాజీ శాసన సభ్యుడు ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, వందనం గ్రామంలో ఏ సర్వే నెంబరు నుంచి ఏవిధంగా కొనుగోలు చేశారనే కోణంలో విజిలెన్స్‌ రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా అటవీశాఖకు చెందిన సుమారు30 ఎకరాల భూమి కూడా కబ్జాకు గురైందని తెలిసింది. అంతేకాకుండా అసలు పట్టేదారులు విక్రయించకుండా ఈ మాజీ శాసన సభ్యుడు ఎలా రెవెన్యూశాఖ రికార్డులకు ఎక్కాడనే కోణంలో విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించారు. ఈ 125 ఎకరాలు మాత్రమే ఈ విధంగా రికార్డులకు ఎక్కిందా..? ఇతర ప్రాంతాల్లో కూడా ఏమైనా జరిగాయా అనే కోణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దస్త్రాలను పరిశీలించడానికి రంగం చేసుకుంది. అయితే పట్టేదారులు రిజిస్టర్‌ చేయకుండా వేరెవరైనా తప్పుడు పత్రాలను తయారు చేశారా అనే విషయాలపై ఆరా తీయాలని అధికారులు భావిస్తున్నారు.

రామలింగేశ్వరా..: సుమారు 300 ఏళ్ళ చరిత్ర కలిగిన రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి చెందిన భూమిలోని కొంత భాగం ఓ వ్యాపార ప్రముఖుడు తన సొంత ఎస్టేట్‌ కోసం ఆక్రమించాడు. దానిని రహదారిగా మార్చి తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఈ విషయాలన్నీ నాటి పాలక మండలిలో చక్రం తిప్పిన ఓ ‘రెడ్డి’పై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. హఠాత్తుగా ఆయన ఆస్తులు పెరగటంతో పలు అక్రమాలను అధికారులు ఇప్పటికే గుర్తించారు.

ఏం జరగనున్నది: ‘అనకొండలు’ కథనంతో రెవిన్యూశాఖ, ఇతర నిఘా సంస్థలు దృష్టి సారించగా ఈ వ్యవహారం ఒక్కసారిగా గుప్పుమనడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతోపాటు అత్యధిక సంఖ్యలో ఉన్న బాధితులు కోర్టును ఆశ్రయించి న్యాయం పొందాలని భావిస్తున్నారు.

ప్రభుత్వం కన్ను: గతంలో తెరాసతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన మాజీ ఎమ్మెల్యే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరో పార్టీలోకి ‘జంప్‌’ అయ్యారు. ఇది నాడు తెరాస నాయకత్వానికి మింగుడు పడలేదు సరికదా..! స్థానిక శాసనసభ్యుడికి పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేశారు. దీంతో ఈ మాజీ ఎమ్మెల్యే భూ విషయంపై కట్టుదిట్టంగా విచారణ జరిగే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here