– తక్షణం విధుల్లో చేరిన మన్నెం నాగేశ్వరరావు
– అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానాను సెలవుపై పంపిన ఉన్నత వర్గాలు
( న్యూస్, న్యూఢిల్లీ )
వర్గ పోరుతో పరువు కోల్పోయిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లో ప్రక్షాళన ప్రారంభమైంది. ప్రస్తుత డైరెక్టర్ అలోక్‌వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలను కేంద్రం విధుల నుంచి తప్పించింది. వారిని సెలవుపై వెళ్లాల్సిందిగా ఉన్నత వర్గాలు మౌఖిక ఆదేశాలు జారీచేశాయి. సీబీఐ నూతన డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వరరావును నియమిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. తక్షణ విధుల్లో చేరాలని ఉత్వర్వుల్లో పేర్కొనడంతో నాగేశ్వరరావు వెంటనే బాధ్యతలు చేపట్టారు.
1986 బ్యాచ్‌కు చెందిన మన్నెం నాగేశ్వరరావు ఒడిశా కేడర్ అధికారి. ఒడిశాలో డీజీ హోదాలో పనిచేశారు. ఏప్రిల్ 7, 2016 నుంచి సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మన్నెం నాగేశ్వరరావు స్వస్థలం తెలంగాణలోని వరంగల్ జిల్లా మండపేట మండలం బోర్‌నర్సాపూర్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు. గతంలో సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన విజయ రామారావు తర్వాత ఆ హోదా చేపట్టిన తెలుగు అధికారి ఈయనే కావడం విశేషం.
సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా మధ్య మొదలైన ‘వర్గ పోరు’తో ఆ సంస్థపై నీలినీడలు అలుముకున్న సంగతి తెలిసిందే. ప్రధాని సీబీఐని భ్రష్టు పట్టిస్తున్నారని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తుండటంతో కేంద్రం దీనిపై దృష్టి సారించింది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో డైరెక్టర్, ప్రత్యేక డైరెక్టర్‌ను మార్చే ఆలోచన లేదని సీబీఐ వర్గాలు మంగళవారమే స్పష్టం చేశాయి. అయితే రాత్రి చకాచకా మారిన పరిణామాల నేపథ్యంలో అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానాను సెలవుపై వెళ్లాల్సిందిగా ఉన్నత వర్గాలు ఆదేశాలు జారీచేశాయి. పీఎంవోతో పాటు కేంద్ర అధికారుల వ్యవహారాలు చూసే శాఖ నిర్ణయంతో మన్నెం నాగేశ్వరరావును సీబీఐ నూతన డైరెక్టర్‌గా నియమిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది.