Uncategorizedప్రాంతీయ వార్తలు

ఏపీలోను తెలంగాణ స్కీములు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. అన్నదాతలపై వరాల జల్లు కురిపించారు. రైతులకు పెట్టుబడి కష్టాలను తీర్చడానికి ఏటా మే నెలలో పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించారు. దీంతో

రైతులందరికీ ప్రభుత్వ ఖర్చుతో ఇన్సూరెన్స్‌ చేయిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌.. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పాదయాత్ర సుదీర్ఘంగా 14 నెలల పాటు సాగి బుధవారం (జనవరి 9)తో ముగిసింది. ప్రజా సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరిగిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులపై వరాలు కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న తరహాలో రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రకటించారు.

ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి : జగన్‌

రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నీరుగార్చిందని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో పాల్గొన్న జగన్‌ ఆరోగ్య శ్రీ పథకం సేవలపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పేదలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే చాలా భారంగా ఉందన్నారు. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రైవేట్‌ ఆస్పత్రిలో కూడా అద్భుత వైద్యం చేయించుకునే పేదలు ఇప్పుడు ఆ సేవలు పొందలేకపోతున్నారని ఆరోపించారు. దాదాపు ఆరోశ్రీ పథకానికి సంబంధించి ఎనిమిది నెలలుగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసిన పరిస్థితి నెలకొందని జగన్‌ ఆరోపించారు. ఫలితంగా రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్‌ అయిపోయాయని తెలిపారు. నేడు రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలు పొందలేని దుస్థితి నెలకొందన్నారు. 4వేల ముందు రోగులు ఉంటే కేవలం 370 మందికి మాత్రమే పింఛన్‌ ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ పింఛన్‌ కూడా ముష్టి వేసినట్లు కేవలం రూ.2500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒకవైపు ఆపదలో ఉన్నప్పుడు సంజీవనిలా ఆదుకునే 108 నేడు మూగబోతుందని ఆరోపించారు. కుయ్‌ కుయ్‌ మంటూ వచ్చే అంబులెన్స్‌ ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఇంత అన్యాయమైన పాలన పట్ల ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారని జగన్‌ స్పష్టం చేశారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తానని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. పరిపాలన వికేంద్రీకరణ కోసం పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటించనున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటిస్తే పరిపాలన మరింత సౌలభ్యంగా ఉంటుందన్నారు. పాదయాత్రలో భాగంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో జగన్‌ ‘నవరత్నాలు’ పేరుతో కొన్ని హామీలు ప్రకటించారు. తాజాగా ఇందులో భాగంగా రైతులకు ప్రయోజనకరంగా ఉండే పలు ఆకర్షణీయ కార్యక్రమాలు, పథకాలను ప్రకటించారు. నవరత్నాలతో ప్రతి పేదవాడి ఇంట్లో, రైతన్న ఇంట్లో సంతోషం చూడాలనేది తన తపన అని జగన్‌ తెలిపారు.

రైతుల కోసం జగన్‌ ప్రకటించిన హామీలు..

ప్రతి రైతుకు ఏడాదికి ఎకరానికి రూ.12,500 పెట్టుబడి సాయం. ఏటా మే నెలలో పంటలు వేయడానికి ముందు రైతులకు ఈ మొత్తం అందేలా చూడటం. అన్నదాతలు గతంలో తీసుకున్న అప్పులతో సంబంధం లేకుండా ఈ మొత్తం అందిస్తామని హామీ. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌. ఎలాంటి అంతరాయం లేకుండా క్వాలిటీ కరెంట్‌. దీంతో రైతులకు కరెంటు ఛార్జీల భారం తగ్గుతుంది. బ్యాంకుల నుంచి రైతన్నలకు వడ్డీలేని రుణాలు. తద్వారా రైతులకు పెట్టుబడి భారం తగ్గుతుంది. సాగు విస్తీర్ణం పెరిగి వారి ఆదాయం పెరుగుతుంది. రైతులందరికీ ఉచితంగా బోర్లు. సాగు నీటి కోసం రైతులు తాహతకు మించి బోర్లు వేస్తూ కుదేలవుతున్నారు. అందువల్ల ప్రభుత్వమే ఉచితంగా బోర్లు వేయిస్తుంది. తద్వారా రైతుల ఆత్మహత్యలు కూడా నివారిస్తాం. రైతులకు రూ. 5 లక్షలతో ‘వైఎస్సార్‌ బీమా’. ప్రమాదవశాత్తూ రైతు మరణిస్తే.. అతడి కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ సొమ్ము అందేలా చర్యలు. ఇన్సూరెన్స్‌ మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.

ఆక్వా రైతులకు రూపాయికే విద్యుత్తు

రూ.3 వేల కోట్లతో ‘ధరల స్థిరీకరణ నిధి’ ఏర్పాటు చేస్తాం. రైతులు పంట వేసినప్పుడే కొనుగోలు ధర నిర్ణయిస్తాం. ప్రతి మండలంలో కోల్డ్‌ స్టోరేజీల ఏర్పాటు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు. పంటల మీద బతికే పరిస్థితి లేదు.. పాడి ఉన్న ఇంట సిరుల పంట.. వ్యవసాయంతో పాటు పాడిని ప్రోత్సహించడానికి పటిష్ట చర్యలు. ప్రతి జిల్లాకు సహకార డైరీలు. అక్కడ పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 బోనస్‌. అప్పుడు ప్రైవేట్‌ డైరీలు కూడా పోటీకి వస్తాయి కాబట్టి రైతులకు మరింత మేలు.

వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లకు రోడ్డు టాక్స్‌ రద్దు.

రూ. 4 వేల కోట్లతో ప్రక తి వైపరీత్యాల నిధి. రాష్ట్రం నుంచి రూ. 2 వేల కోట్లు, కేంద్రం నుంచి రూ. 2 కోట్లతో ఈ రిలీఫ్‌ ఫండ్‌. కరవు, తుఫాన్లు సంభవించినప్పుడు రైతులకు దీని ద్వారా పరిహారం. తుఫాన్ల కారణంగా దెబ్బతిన్న కొబ్బరిచెట్లకు ఒక్కొక్కదానికి రూ. 3 వేల పరిహారం. జీడి తోటలకు చంద్రబాబు సర్కారు ప్రకటించిన రూ. 30 వేల సాయం రూ. 50 వేలకు పెంపు. జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి. పోలవరం సహా హంద్రీనీవా, గాలేరు తదితర పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ యుద్దప్రాతిపదికన పూర్తి. రైతన్న తన కాళ్ల మీద తాను నిలబడే పరిస్థితి తీసుకొస్తానని జగన్‌ తెలిపారు. నవరత్నాల్లో జరిగే మేలును ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజలకు చేరువ చేస్తామని చెప్పారు.

అద్భుత చిహ్నం పైలాన్‌

వైసీపీ రూపొందించిన ఈ విజయ సంకల్ప స్థూపానికి ఎంతో ప్రత్యేకత ఉంది. విజయ సంకల్ప స్థూపం చుట్టూ ఉన్న గోడపై ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం వరకూ అసంఖ్యకంగా ఉన్న ప్రజలతో వైఎస్‌ జగన్‌ మమేకమైన ఫోటోలను ఏర్పాటు చేశారు. విజయ స్థూపం కింది భాగం గ్రౌండ్‌ అంతా బెంగళూరు గ్రాస్‌ తోగార్డెన్‌, 15 అడుగుల మెట్లు ఉండేలా నిర్మించారు. ఈ 15 అడుగులలో మొదటి అడుగు జగన్‌ ప్రజా సంకల్పయాత్ర మొదటి అడుగుగా చెప్పుకొస్తున్నారు. ఇడుపులపాయలో 2017 నవంబర్‌ 6న ప్రారంభించిన మ్నెదటి అడుగుగా మొదటి మెట్టును తీర్చిదిద్దారు. ఆ తర్వాత 13 మెట్లను 13 జిల్లాలకు గుర్తుగా నిర్మించారు. 15వ మెట్టు జగన్‌ చివరి అడుగు ఇచ్ఛాపురంలో పెట్టినందుకు గుర్తుగా నిర్మించినట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు. ఇకపోతే మూడు అంతస్థుల విజయ సంకల్ప స్థూపం మొదటి అంతస్థులో నవ్యాంధ్రప్రదేశ్‌ లోని 13 జిల్లాలను గుర్తుకు తెచ్చేలా మెట్లు నిర్మిస్తే ఇక రెండవ అంతస్థులో వైఎస్‌ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు గుర్తుకు ఆయన నిలువెత్తు చిత్రపటాన్ని గెలాక్సీ గ్రానైట్లతో రూపొందించారు. మూడో అంతస్థులో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి సంబంధించిన చిత్ర పటాలను నిర్మించారు. సంక్షేమ రథసారధిగా వైఎస్‌ఆర్‌ ను గుర్తుకు తెస్తూ నాలుగు వైపులా ఆకర్షణీయంగా చిత్రపటాలను ఏర్పాటుచేశారు. పై భాగంలో దేశంలో అత్యున్నత స్థానం అయిన పార్లమెంట్‌ కు చిహ్నంగా గుమ్మటాన్ని నిర్మించి దానిపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. ఈ జెండా రెపరెపలాడేలా విజయ సంకల్ప స్థూపాన్ని తీర్చిదిద్దారు. 16వ నంబర్‌ జాతీయ రహదారి పక్కన మరోవైపు హౌరా-చెన్నై రైల్వే లైనుల మధ్య ఈ పైలాన్‌ రూపుదిద్దు ్దకుంటోంది. దీంతో అటు వాహనాల్లో, ఇటు రైల్లో వెళ్లేవారి ద ష్టిని ఆకర్షించేలా ఈ కట్టడాన్ని ఏర్పాటుచేశారు. ఒడిశా రాష్ట్రం సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి సుమారు 30 కిలోమీటర్ల ముందు శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 130 కిలోమీటర్ల దూరంలో ఇచ్చాపురం టౌన్‌ కి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఈ విజయ సంకల్ప స్థూపాన్ని నిర్మించారు. వీటితోపాటు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 13 జిల్లాల మీదుగా ఏ ఏ మార్గాల్లో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేపట్టారో తెలియజేసేలా మ్యాప్‌ ను సైతం ఇందులో పొందుపరిచారు. ఈ అద్భుత కట్టడాన్ని వైఎస్‌ జగన్‌ అశేష జనవాహిని సమక్షంలో ఆవిష్కరించారు. ఈ స్థూపాన్ని తిలకించేందుకు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close