తెలంగాణ పిసిసి ప్రక్షాళన

0

(రమ్యాచౌదరి, న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

తెలంగాణ ఎన్నికలపై ఏఐసీసీ సీరియస్‌ గా ఉంది. అది ఏస్థాయిలో అంటే టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఇతర ప్రముఖులు, సీట్లు అమ్ముకున్న వారని, సీట్ల పరంగా తప్పు దారి పట్టించిన వారిని పదవుల నుంచి తప్పించాలని ఏఐసీసీ నిర్ణయించింది. శుక్రవారం అర్థరాత్రి వరకు చత్తీస్‌ గఢ్‌ ముఖ్యమంత్రి విషయంపై నిర్ణయం తీసుకొంటుంది. అనంతరం సమయానుకూలంగా శని, ఆదివారాలలో ‘వార్‌’ రూం చర్చలు జరుగుతాయని తెలిసింది.

కార్యకర్తల ఆగ్రహం: ఎన్నికల సీట్ల వ్యవహారంలో ఏఐసీసీ రూపొందించిన నిబంధనలు పాటించ లేదని కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. 17 మంది ‘పారాచూట్‌’ అభ్యర్థులకు సీట్లు ఇవ్వడం, ప్రచారంలో కీలకం. బాధ్యతలు చూసే ఓ అభ్యర్థి తన నియోజకవర్గానికే ఇతర ప్రముఖులను ఖమ్మం రప్పించుకున్నారని ఆరోపఢలు ఉన్నాయి. కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరూ ఎదురు ఉండకూడదని ఖమ్మం స్థానం తెలుగుదేశం పార్టీకి పట్టు ‘భట్టి’ కేటాయించిన విషయంపై కూడా ఏఐసీసీకి ప్రత్యేక ఫిర్యాదు అందింది. దీనికి తోడు తెరాస పార్టీ 6గురు కమ్మ సామాజిక వర్గానికి కేటాయించగా.. కాంగ్రెస్‌ కనీసం ఒక్క సీటు కేటాయించలేదు. దీంతో ఆ సామాజిక వర్గానికి ప్రతి నియోజకవర్గంలో కనీసం ఐదువేల ఓటు బ్యాంక్‌ కలిగో ఉంది. వీరంతా తెరాస వైపు మొగ్గు చూపారని ఏఐసీసీ అధిష్టానం భావిస్తోంది.

ఇది మరో దెబ్బ: స్నేహపూర్వక పోటీ పేరుతో ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో చేసిన ప్రయోగం వికటించింది. కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన ‘శక్తి’ ఆప్‌ సందేశాలపై విశ్లేషణలను తప్పుదారి పట్టించడం, కుల ప్రాతిపదికన రాజకీయం చేసి లబ్ధి పొందాలని భావించిన ఓ కీలక నేతను అంచెలంచెలుగా పక్కన పెట్టాలని ఏఐసీసీ భావిస్తోంది.

కార్లు ఎక్కడివి..? డబ్బు ఇక్కడిదే..!: ఓ గ్రానైట్‌ వ్యాపారికి, మరో ఎస్టీ నాయకునికి సీటు ఇవ్వడానికి కార్లు, నగదును బహుమతులుగా తీసుకున్న వైనాలు, రంగారెడ్డి జిల్లాలో ప్రత్యర్థి పార్టీ దగ్గర లక్షలాది రూపాయలను తీసుకొని బలహీన కాంగ్రెస్‌ అభ్యర్ధికి సీట్లు ఇచ్చారనే ఆధారాలను వీడియో రూపంలో ఏఐసీసీకి అందాయి. దీంతో టికెట్ల కేటాయింపులో భారీగా నగదు చేతులు మారిందని, 28 సీట్లలో నేరుగా ప్రభావం పడిందని ఏఐసీసీ గుర్తించింది. కార్య కర్తలను వచ్చే ఐదేళ్ళు ఎవరు బాగా చూసుకుంటారనే విషయంలో కసరత్తులు జరుగుతున్నాయి. గతంలో ఇక్కడి నాయకులు ప్రభుత్వాన్ని ఎక్కడా నిలదీయలేదని, ధర్నా చౌక్‌, ఇతర భూ కేటాయింపులపై సిపిఎం మాట్లాడిన తరువాత కాంగ్రెస్‌ హడావుడి చేసిందని, శాసనసభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేస్తే కనీసం నిరసనలకు పిలుపు ఇవ్వలేదు. ఏ రోజూ ప్రభుత్వ వైఫల్యాలపై కనీసం ఓక్క ‘బంద్‌’కు పిలుపు ఇవ్వలేదని ఏఐసీసీ భావిస్తోంది. అందుకే తిరిగి ఆ నాయకులకే పగ్గాలు ఇస్తే…మరో పాతికేళ్ళు అయినా కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదని, ఈ సారి యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ఏఐసీసీ సభ్యులు ఒకరు శుక్రవారం రాత్రి ‘ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రతినిధి’కి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here