జీవనశైలి

తెలంగాణ ఊటీ..అనంతగిరి

ఎక్కడైనా పద్మనాభుడు శేషతల్పంపై శయనిస్తూ దర్శనమిస్తాడు.. ఇక్కడ మాత్రం సాలగ్రామ విగ్రహమూర్తిగా కనిపిస్తాడు.. ప్రక తి రమణీయత నడుమ వెలిసి భక్త సులభుడిగా, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిచెందితే, పక్కనే కొలువుదీరిన బుగ్గ రామలింగేశ్వర క్షేత్రం రాముడు పాదం మోపిన క్షేత్రంగా కీర్తికెక్కింది. పచ్చని ప్రక తిలో తేలియాడే ఆ ప్రాంతపు గాలి పీల్చితే చాలు సర్వరోగాలు నయమవుతాయి. అక్కడ వినిపించే పక్షుల కిలకిల రావాలు.. సెలయేటి గలగలలు మనసుకు ఆహ్లాదాన్ని పంచుతాయి. అందుకే అనంతగిరి ప్రాంతం తెలంగాణ ఊటీగా పేరుగాంచింది. స్వయంభువుడిగా వెలిసిన పద్మనాభుడు ఒకవైపు, తెలంగాణ మహానందిగా పిలువబడే బుగ్గ రామలింగేశ్వరుడు మరో వైపు… వెరసి భక్తజనులకు హరిహరులను ఒకేచోట దర్శించుకున్న అమోఘఫలం. అందుకే అనంతగిరులు ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగానూ విలసిల్లుతున్నాయి. అటు ఆధ్యాత్మికతను, ఇటు పర్యాటకశోభను సొంతం చేసుకొన్న వికారాబాద్‌ జిల్లా అనంతగిరుల విశేషాల సమాహారమే ఈవారం విహారం.

అనంతగిరి హవా.. లాకో మరీజోంకా దవా. అనంతగిరి గాలి.. లక్ష రోగాలకు మందు అని దీనర్థం. ఈ ప్రాంతానికి ఉన్న ప్రాశస్త్యం ఇది. పెద్దలు చెప్పిన ఈ మాట నిజమేనని అక్కడికెళ్లిన ఎవరైనా ఒప్పుకొని తీరుతారు. ఎందుకంటే అక్కడి ప్రకతి రమణీయత, వేల రకాల ఔషధ మొక్కలు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. వికారాబాద్‌ జిల్లాలో కొలువై ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతం ఔషధగనిగా పేరొందింది. అందుకే అంతుచిక్కని వ్యాధులతో బాధపడేవారు.. ఈ గాలిని పీల్చేందుకు ఇక్కడికొస్తుంటారు. దీనికితోడు ఇక్కడ వెలిసిన అనంత పద్మనాభస్వామి.. భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్నాడు.

మూసీ నది పుట్టిందిక్కడే

ముచుకుందుడనే రాజర్షి అసురులతో అనేక సంవత్సరాలు యుద్ధం చేసి విజేయుడై దేవేంద్రుడి దగ్గరకు వెళుతాడు. తాను అలసట తీర్చుకోవడానికి ప్రశాంతస్థలం కావాలని, తనకు నిద్రాభంగము కలిగిన వారు తక్షణమే తన తీక్షణ చూపులకు భస్మం అయ్యేలా వరాన్ని కోరుతాడు. అలాగేనని వరమిచ్చి .. అలసట తీర్చుకొనేందుకు అనంతగిరి కొండలకు వెళ్లమని చెబుతాడు దేవేంద్రుడు. అలా ఒక గుహలో నిద్రకు ఉపక్రమిస్తాడు ముచుకుందుడు. ద్వాపర యుగంలో శ్రీక ష్ణుడిగా అవతరించిన శ్రీహరి.. ద్వారకను పాలిస్తుంటాడు. ద్వారకపై దండెత్తిన కాలయవ్వనుడనే రాక్షసుడికి భయపడినట్టు నటించి అన్న బలరామక ష్ణుడితో కలిసి ముచుకుందుడు నిద్రిస్తున్న గుహలోకి వస్తాడు. తమ ఒంటిపై ఉన్న వస్త్రాలను ఆ రాజర్షిపై కప్పి పక్కకు తప్పుకొంటారు. వారిని వెంబడిస్తూ వచ్చిన కాలయవ్వనుడు.. గుహలో వస్త్రాలను చూసి బలరామక ష్ణులుగా భావించి నిద్రిస్తున్న ముచుకుందుడిని నిద్రలేపుతాడు. కోపోద్రిక్తుడైన ముచుకుందుడి తీక్షణ చూపుల్లో దహనమవుతాడు.

తదనంతరం బలరామక ష్ణులు ముచుచుకుందుడికి దర్శనమిస్తాడు. రాజర్షి ఆనందంతో వారి పాదాలను కడిగి సాక్షాత్కారం పొందుతాడు. స్వామివారి పాదాలను కడిగిన నీరే ముచుకుంద నదిగా మారిందట. దాన్నే నేడు మూసీనదిగా పిలుస్తున్నారు. క ష్ణానదికి ఉపనది అయిన మూసీ.. శంకర్‌పల్లి, హైదరాబాద్‌, నల్గొండ జిల్లాల మీదుగా ప్రవహిస్తుంది.

రెండుసార్లు జాతర

స్వామివారికి ఏటా రెండు సార్లు జాతర మహోత్సవాలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో పదిహేను రోజుల పాటు పెద్ద జాతర ఉత్సవాలు, ఆషాఢమాసంలో ఐదు రోజుల పాటు చిన్నజాతర ఉత్సవాలు దేవాదాయశాఖ ఆధ్వర్యంలో జరుగుతాయి.

భవనాశిని ఇక్కడి కోనేరు

పద్మనాభుడి ఆలయ ప్రాంగణంలో వెలిసిన కోనేరు భవనాశినిగా పేరు పొందింది. ఇందులో స్నానమాచరిస్తే చేసిన పాపాలు తొలగుతాయని, సన్మార్గంలో పయనించేలా స్వామి అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. కోనేటితో ఇక్కడ ఏడు నీటి గుండాలు ఉన్నాయి. కాలక్రమేణా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి.

రాళ్ల కుచ్చలు పేర్చితే..

ఇక్కడ కోనేటి పక్కనే ఒకదానిపై ఒకటి పేర్చిన బోలెడు రాళ్ల కుచ్చలు దర్శనమిస్తాయి. అవన్నీ ఇక్కడికొచ్చిన భక్తులు పేర్చినవే. ఇలా రాళ్లను పేర్చితే ఇల్లు కట్టే భాగ్యం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎన్ని రాళ్లను నిలుపగలిగితే అన్ని మేడలు కట్టేలా స్వామివారు అనుగ్రహిస్తారని భక్తులు నమ్ముతారు.

ఆలయ చరిత్ర

భక్త సులభుడిగా ఇక్కడ వెలిసిన అనంత పద్మనాభుడి వల్లే.. ఈ అటవీ ప్రాంతం అనంతగిరి క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. విష్ణు పురాణంలో ఈ ఆలయ ప్రస్తావన ఉంటుంది. పూర్వకాలంలో మార్కండేయుడు ఈ ప్రాంతంలోనే తపస్సు చేశాడట. ఆయన కోరిక మేరకే అనంత పద్మనాభుడు.. స్వయం భువుడిగా ఇక్కడ వెలిసినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. సాధారణంగా పద్మనాభస్వామి అనగానే శేషతల్పంపై పవళించే రూపం స్పురణకు వస్తుంది. ఇక్కడ మాత్రం సాలగ్రామ విగ్రహ రూపంలో స్వామివారు దర్శనమిస్తుండడం విశేషం. ఈ శిల సముద్ర గర్భంలో ఒక ఫీట్‌ సైజులో మాత్రమే లభిస్తుంది. కానీ ఇక్కడ స్వామివారి విగ్రహం మూడుఫీట్లకు పైగా ఉంటుంది. మార్కండేయుడు తపస్సు చేసిన గుహ ఇప్పటికీ చరిత్రకు ఆనవాలుగా ఇక్కడ దర్శనమిస్తున్నది. ఎందరో రుషులు, మునులు ఇక్కడ తపస్సునాచరించినట్టు చరిత్ర చెబుతున్నది.

తెలంగాణ మహానంది

పద్మనాభ స్వామి ఆలయానికి చేరువలోనే కింది ఘాట్‌ రోడ్డులో శ్రీ బుగ్గ రామలింగేశ్వరాలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని తెలంగాణ మహానంది అని పిలుస్తుంటారు. పద్మనాభ స్వామిని దర్శించుకున్న వారు శ్రీ బుగ్గరామలింగే శ్వరాలయం దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. పట్టణం నుంచి నేరుగా బుగ్గరామలింగేశ్వరాలయానికి వెళ్ళాలంటే రామయ్యగూడ రోడ్డు గుండా వెళ్ళితే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. అనంతగిరి వచ్చిన వారికి ఈ రెండు ఆలయాలను దర్శించుకుంటే.. శివకేశవులను దర్శించుకున్న భాగ్యం కలుగుతుంది.

రాముడు ప్రతిష్టించిన లింగం ఈ ఆలయానికి ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది. రావణ సంహారం తర్వాత.. శ్రీరాముడు బ్రాహ్మణ హత్య దోష నివారణార్థం పలు చోట్ల శివలింగాలను ప్రతిష్టించడం జరుగుతుంది. అందులో భాగంగానే అనంతగిరి అటవీ ప్రాంతానికి వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించినట్టు చరిత్ర చెబుతున్నది. ప్రతిష్టించిన లింగాన్ని అభిషేకించేందుకు రాముడు భూమిలోకి భాణం వేసి పాతాళ గంగతో బయటకు తీస్తాడు. భూమిలోంచి వచ్చిన పాతాల గంగ బుడగలు బుడగులుగా వచ్చినందున బుగ్గ అని, లింగాన్ని రాముడు ప్రతిష్టించినందున రామలింగేశ్వరుడనీ..పిలుస్తారు. అలా అనాదిగా బుగ్గ రామలింగేశ్వరుడిగా స్వామివారు భక్తులతో పూజలందుకొంటున్నాడు. నంది నోట నీటిధార ఆలయ ప్రాంగణంలో నంది నోట్లో నుంచి కోనేటిలో జాలువారే జలధార ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మండు వేసవిలో సైతం ఈ జలధార నిర్విరామంగా కోనేటిలో పడుతుంది. వేసవిలో సైతం భక్తులకు ఇక్కడి వాతావరణం ఎంతో అహ్లాదాన్నిస్తుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు భక్తులు కోనేటిలో స్నానమాచరించి స్వామిని దర్శించుకొంటారు. మహా శివరాత్రి పర్వదినాన భక్తులు భక్తి శ్రద్దలతో ఉపవాస దీక్ష బూని రామలింగేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారు. అందుకే హరిహరుల సన్నిధిగా అనంతగిరి అటవీ ప్రాంతం శివకేశవుల నామస్మరణతో మారుమ్రోగుతున్నది.

ఎక్కడ ఉంది… వికారాబాద్‌ జిల్లాలోని వికారాబాద్‌ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో అనంతగిరి కొండలు ఉంటాయి. అక్కడికి కొద్ది దూరంలోనే ఘాట్‌ రోడ్డులో శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. మొత్తంగా హైదరాబాద్‌ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎలా వెళ్లాలి…. హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌కు ట్రైన్‌, బస్సు సౌకర్యం ఉన్నది. అక్కణ్నుంచి లోకల్‌ బస్సుల్లో, ఆటోల్లో అనంతగిరి కొండలను చేరుకోవచ్చు. డైరెక్టుగా హైదరాబాద్‌ నుంచి తాండూరు వెళ్లే బస్సుల్లోనూ నేరుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close