Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలు

అభివృద్ధిలో తెలంగాణ నంబర్‌ వన్‌

రైతు పొలలు పచ్చగా ఉంటే తట్టుకోలేని కాంగ్రెస్‌

  • కాళేశ్వరంపై నేతల తప్పుడు ప్రచారాలు
  • ప్రజలు బుద్ది చెప్పినా మారని కాంగ్రెస్‌ నేతలు
  • టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు సమీక్షలో కేటీఆర్‌

హైదరాబాద్‌,

తెలంగాణ రైతుల పొలాలు పచ్చగా అవుతుంటే కాంగ్రెస్‌ నేతల కళ్లు ఎర్రబడుతున్నాయి అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. వారికి అభివృద్ది చెందుతున్న తెలంగాణను చూసి గిట్టలేకపోతున్నారని అన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్నదే సిఎం కెసిఆర్‌ కల అని కెటిఆర్‌ చెప్పారు. కాళేశ్వరంపై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు చెప్పారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ్‌భాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో జూబ్లీహిల్స్‌ టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు విజయోత్సవసభ నిర్వహించారు. ఈ సభలో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్‌ నేతలు విచక్షణ లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ నేతలు తుమ్మిడి హట్టిలో నాటు పడవ ఎక్కి నాటు మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పినా కాంగ్రెస్‌ నేతలు మారటం లేదని విమర్శించారు. తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతలు ఇతర పార్టీ లలో చేరుతున్నారని దుయ్యబట్టారు. ఇతర పార్టీల నాయకుల మాటలను పట్టించుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. దేశంలో ఆ పార్టీ పరిస్థితి ఏంటో కాంగ్రెస్‌ నాయకులు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్‌ పార్టీపై విశ్వాసం లేక ఎక్కడికక్కడ ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ప్రజలు సుభిక్షంగా ఉంటే కాంగ్రెస్‌ నేతలకు నిద్ర పట్టడం లేదు. ప్రజలు ఛీకొడుతున్నా కాంగ్రెస్‌ అవే ఆరోపణలు చేస్తోంది. పేదల పట్ల తాపత్రయం ఉన్న టీఆర్‌ఎస్‌ నాయకులను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. దేశంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. ఐదేళ్లలోనే సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో దేశమే అబ్బురపడే విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. కారుచీకట్ల నుంచి 24 గంటలు కరెంట్‌ ఇచ్చే రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దని గుర్తు చేశారు. అందరికీ 24 గంటల విద్యుత్‌ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. 50 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఏటా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు వెచ్చిస్తోంది. హైదరాబాద్‌లో శాంతి, భద్రతలు అద్భుతంగా ఉన్నాయి. గతంలో గణెళిష్‌ పండుగ వస్తే కర్ఫ్యూ విధించేవాళ్లు. ఇప్పుడు కర్ఫ్యూలు లేకుండా శాంతి భద్రతలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. నగరంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాం. గతంలో ఎండాకాలం వస్తే జలమండలి కార్యాలయం ముందు ప్రదర్శనలు జరిగేవి. నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. గతంలో నిజాంపేట, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాల్లో 14 రోజులకోసారి నీళ్లు వచ్చేవి. ఇప్పుడు నిజాంపేట, కుత్బుల్లాపూర్‌లో రెండు రోజులకోసారి నీళ్లిస్తున్నాం అని కేటీఆర్‌ తెలిపారు. ఇకపోతే 10 లక్షల కెమెరాలతో హైదరాబాద్‌ నగరాన్ని సేఫ్‌ సిటీగా చేయబోతున్నట్టు కెటిఆర్‌ తెలిపారు. అమెజాన్‌, గూగుల్‌ వంటి సంస్థలు హైదరాబాద్‌లో తమ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. గత గ్రేటర్‌ ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను నెరవేర్చి హైదరాబాద్‌ ప్రజల రుణం తీర్చుకుంటామని ఆయన వెల్లడించారు. సభా ప్రాంగణంలో టిఆర్‌ఎస్‌ జెండాను కెటిఆర్‌ ఆవిష్కరించారు. అభివృద్ధి, సంక్షేమ పథకంలో తెలంగాణ దూసుకెళుతుందని కెటిఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌, బిజెపిలు తట్టుకోలేక పోతున్నాయని, అందుకే ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దేశం తెలంగాణ వైపు చూసేలా అభివృద్ధి చేస్తూ, అవినీతి లేని పాలనను సీఎం కేసీఆర్‌ అందిస్తున్నారన్నారు. ఇతర పార్టీల నేతలు 20 సంవత్సరాలలో చేసే పనులను 5 సంవత్సరాల్లో సీఎం కేసీఆర్‌ చేసి చూపించారన్నారు. తెలంగాణ వచ్చాక ఏ విధంగా నడుపుతారనే సందేహం చాలా మందికి ఉండేదని, కానీ కెసిఆర్‌ సీఎం అయిన 6 నెలల్లోనే 24 గంటల కరెంట్‌ ఇచ్చారని గుర్తు చేశారు. ఎండాకాలం వచ్చిందంటే బిందెలతో జలమండలి ముందు కూర్చునే వారని, ఇపుడు ఆ సమస్య లేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌ లో రోజు తప్పి రోజు నీళ్లు వస్తున్నాయంటే అది కేసీఆర్‌ ఘనతేనన్నారు. హైదరాబాద్‌ లో మెట్రో రైల్‌ ప్రాజెక్టు తో పాటు, యువతకు కొలువులు ఇచ్చే కార్యక్రమాలను చేస్తూ ముందుకి వెళుతున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు టిఆర్‌ఎస్‌ పార్టీ పటిష్టంగా ఉంటుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 50 లక్షల మందికి 2 వేల 116 రూపాయల పెన్షన్‌ ఇస్తున్నామని, దివ్యాంగులకు 3 వేల 116 రూపాయల పెన్షన్‌ ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్ర సంక్షేమ పథకాలకు కేంద్రం ఇస్తున్న మొత్తం నామమాత్రమేనన్నారు. హైదరాబాద్‌ లో 10 లక్షల సి సి కెమెరా లు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌ కి అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయని తెలిపారు. పేదలకు త్వరలోనే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తామని అన్నారు. హైదరాబాద్‌ ప్రజలను సంతృప్తి పరిచి ఋణం తీర్చుకుంటామని తెలిపారు. ప్రత్యర్ధులు ఎక్కడ మాట్లాడినా తిప్పి కొడుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  ఇంకా ఈ సమావేశంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంఎల్‌ఎలు మాగంటి గోపినాథ్‌, కాలేరు వెంకటేశ్‌, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, కర్నె ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close