కూటమి కుట్రలను తిప్పికొట్టండి

0

కేసీఆర్‌ ద్వారానే బంగారు తెలంగాణ

జగిత్యాల (ఆదాబ్‌ హైదరాబాద్‌): కూటమి పేరుతో మరోసారి తెలంగాణపై పెత్తనం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, కూటమి కుట్రలను తిప్పికొట్టి మరోసారి ప్రజల మనిషి కేసీఆర్‌ను గద్దెనెక్కించాలని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ అన్నారు. వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో బుధవారం కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే మేడిపల్లి, కత్లాపూర్‌ మరో కోనసీమగా మారుతుందన్నారు. కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పరుగులు పెడుతోందని మంత్రి చెప్పారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌

ప్రధానమైన అంశాలపై దృష్టి సారించారని పేర్కొన్నారు. పేదలు సంతోషంగా ఉండాలన్నదే కేసీఆర్‌ లక్ష్యమని తేల్చిచెప్పారు. మహాకూటమి పేరుతో మరోసారి మనపై పెత్తనం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును ఆపేందుకు చంద్రబాబు కేంద్రానికి అనేక ఉత్తరాలు రాశారని కేటీఆర్‌ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు జరిగితే విద్యుత్‌ ఉండదని, చీకట్లు కమ్ముకుంటాయని, రైతులకు కరెంట్‌ సమస్య తీవ్రంగా ఉంటుందని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారని అన్నారు. కానీ తెలంగాణ ఏర్పాటు తరువాత దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని, నిమిషంకూడా కరెంట్‌ పోకుండా చేశామన్నారు. మనకు నిరంతరాయ విద్యుత్‌ను ఇవ్వటమే కాకుండా పక్క రాష్ట్రాలకు విక్రయించే స్థాయికి ఎదిగామని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఇదంతా కేసీఆర్‌ విజన్‌తోనే సాధ్యమైందని, ఆయన ముందుకు చూపుతోనే తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్‌ అండగా ఉంటున్నారని అన్నారు. ఆడ పిల్లలకు కుటుంబాలకు మేనమామలా ఉంటూ వారి కుటుంబానికి అండగా నిలుస్తున్నారని అన్నారు. అదేవిధంగా రైతుబంధు, రైతుబీమాలతో రైతులకు అండగా నిలిచిన ఏకైక సీఎం కేసీఆర్‌ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని, తెరాస తరుపున నిలిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నేతలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here