Featuredప్రాంతీయ వార్తలువార్తలు

సఫల రాష్ట్రంగా తెలంగాణ

  • పేదల కోసం ప్రభుత్వ ఆస్పత్రులు
  • తెలంగాణలో కరువు మాటే వినిపించదు
  • గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతాని కృషి..
  • ఎటుచూసినా పచ్చనిపైర్లే దర్శనమిస్తాయి..
  • ఐదేళ్లలో ఎన్నో విజయాలు సాధించాం
  • తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్‌

ఓ స్వప్నం సాకారమైన వేళ. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరిన వేళ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఫలించిన వేళ. దశాబ్దాల ఉద్యమం అరవై ఏళ్ల కల తీరిపోయిన ఐదేళ్లు అయింది. ఎందరో అమరుల ఆత్మ బలిదానాల తర్వాత, తెలంగాణ సాధన సాధ్యపడింది. దశబ్దాల తొలి దశ, పధ్నాలుగేళ్ల మలి దశ ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో మలుపులు మరెన్నో మైలురాళ్లు. తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా ఆవిర్భవించిన క్రమంలో ఎదురైన సంఘటనలు ఎన్నో. కాలం మదిలో నిక్షిప్తమైపోయిన ఉదంతాలెన్నో. పొడిచిన పొద్దు మీద నడిచిన కాలంలో తెలంగాణలో ఇప్పుడేం చెబుతోంది? స్వీయపాలన కోసం అహరహం శ్రమించిన తెలంగాణీయులు స్వపరిపాలనలో ఏమంటున్నారు.? ఐదేళ్ల తెలంగాణ ఆవిర్భావాన్ని, దేశంలోనే నెంబర్‌ వన్‌ అంటూ కితాబిస్తున్న సంక్షేమ ఫలాలను మరోసారి తలుచుకోవడమే ఈ ప్రత్యేక కథనం.

హైదరాబాద్‌:

తెలంగాణ అవతరణ దినోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ గన్‌పార్క్‌ లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సీఎం కేసార్‌ ప్రసంగిస్తు.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోతవ్సం శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం అవతరించి ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకుందనీ.. రాష్ట్రం సఫల రాష్ట్రంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఈ ఐదు సంవత్సారాలలో ఎన్నో అవరోధాలను అధిగమించి మరెన్నో విజయాలు సాధించామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రం అంధకారంలో ఉండేదనీ..ఇప్పుడు కరెంటు నిరంతరం సరఫరా చేయగలగటమే కాకుండా రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ నందిస్తున్న రాష్ట్రం దేశంలోనే తెలంగాణ ఒక్కటేనన్నారు. విద్యుత్‌ రంగంలో వచ్చిన గుణాత్మకమైన మార్పుతో ఇటు వ్యవసాయ రంగానికి అటు పారిశ్రామిక రంగానికి ఎంతగానో తోడ్పడుతు..రాష్ట్రానికి నూతన ఉత్తేజాన్ని కలిగించిందన్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక మిషన్‌ భగీరథ పథకంగా మంచినీటి సమస్యలను అధిగమించామనీ.. ఇటువంటి అభివృద్ది పనులు జరుగుతున్నాయంటే ప్రజలు టీఆర్‌ఎస్‌ కు పట్టటం కట్టటం వల్లనే సాధ్యపడిందన్నారు. ఇదంతా ప్రజలు మాపై పెట్టుకున్న విశ్వాసమేననీ..ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో పయనించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ సమ ప్రాధాన్యతనిస్తు ముందుకు సాగుతున్నామన్నారు. ప్రభుత్వం పనితీరును ప్రజలు మెచ్చుకుంటున్నారనీ అందుకే ప్రతీ ఎన్నికల్లోను టీఆర్‌ఎస్‌ పార్టీని ఆశ్వీరదిస్తున్నారన్నారు. గతంలో బిందెల పట్టుకుని ఆడబిడ్డలు మైళ్లకొద్దీ దూరం వెళ్లేవారనీ ఇప్పుడు బిందెల ప్రదర్శనలు బంద్‌ అయ్యాయన్నారు. మిషన్‌ భగీరథ పనులు ఇప్పటికే 97 శాతం పనులు పూర్తయ్యాయని కేసీఆర్‌ తెలిపారు.

తెలంగాణలో కరువు మాటే వినిపించదు

తెలంగాణలో కరువు అనే మాట ఇకపై వినిపించదని రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ తెలిపారు. స్వరాష్ట్రం సిద్ధించాక.. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకునేలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ క్రమంలో విద్యుత్‌ రంగంలో తీసుకొచ్చిన గుణాత్మక మార్పులతో తెలంగాణ అన్నపూర్ణగా అవతరించనుందన్నారు. మిషన్‌ భగీరథ పథకంతో సాగు, తాగునీటి కష్టాలను అధిగమించామన్నారు. రైతన్న కలలను నెరవేర్చేందుకు గోదావరిపై భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నామనీ..అతి తక్కువ సమయంలో ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టును రూపుదిద్దుకుంటోందన్నారు. ఈ ప్రాజెక్టుతో కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోవడంలో సఫలీకృతమయ్యాం. గోదావరి జలాలతో రైతుల బతుకులు బాగుపడే రోజు దగ్గరలోనేఉందన్నారు. కృష్ణా నదీ జలాలతో రైతలు బంగారు పంటల్ని పండింది రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే రోజులు అతి త్వరలోనే వస్తాయని కేసీఆర్‌ ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ రాజకీయ అవినీతి అనే మాటకు తావు లేకుండా బలమైన రాష్ట్రంగా నిలదొక్కుకుందనీ..ఈ దేళ్లలో రాష్ట్రం 16.5 శాతం వృద్ధిరేటు సాధించిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

పేదల కోసం ప్రభుత్వ ఆస్పత్రులు

పేదల కోసమే ప్రభుత్వ ఆస్పత్రులు అనేలా వైద్య ప్రమాణాలను మెరుగుపరిచామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు మెరుగుపర్చామనీ పేదలకు ప్రభుత్వ ఆస్పత్రులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని..పేదల కోసం ప్రభుత్వం ఆస్పత్తుల్లో పెను మార్పులు తీసుకొచ్చామన్నారు. కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్‌ కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసి ప్రజలు ఆరోగ్యం కోసం పాటుపడుతున్నామన్నారు. కంటి వెలుగు పథకంతో పేదల కళ్లకు వెలుగునిచ్చిందన్నినారు. ఈ పథకం పేద ప్రజలకు పెద్ద వరంగా మారిందన్న సీఎం త్వరలోనే దంత, చెవి, ముక్కు వ్యాధుల నిర్దరణకు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ తెలిపారు.

సఫల రాష్ట్రంగా తెలంగాణ

తెలంగాణ సఫల రాష్ట్రంగా పురోగమిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. శాంతిని, సామరస్యాన్ని కాపాడుకుంటూ అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలో ప్రత్యేక మ¬ద్యమాన్ని సాగించి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సఫల రాష్ట్రంగా పురోగమిస్తోంది. మొక్కవోని దీక్షతో అభ్యుదయపథంలో సాగుతోంది. ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో అవరోధాలను అధిగమించగలిగాం. అపనమ్మకాల నడుమ వచ్చిన రాష్ట్రం వాటన్నింటినీ అధిగమించింది. తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోతుంది. ప్రభుత్వం పట్టుదలతో సాధించిన విజయం ఇది. రాష్ట్రం కోసం రాజీలేని పోరాటం చేసిన వాళ్లే అభివృద్ధి చేస్తారని ప్రజలు నమ్మారు. పంచాయతీ నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు తిరుగులేని విజయం కట్టబెట్టారు. రాజకీయ అవినీతికి దూరంగా బలమైన రాష్ట్రంగా నిలదొక్కుకుంది. ఐదేళ్లలో రాష్ట్రం 16.5 శాతం వృద్ధిరేటు సాధించిందన్నారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతాని కృషి..

ఈ ఐదేళ్ల కాలంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు వేసినట్లు సీఎం తెలిపారు. కుల వృత్తులను ప్రోత్సహించడం ద్వారా వారి జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేసినట్లు చెప్పారు. ఆయా కులాల ఆత్మగౌరవ భవనాలను హైదరాబాద్‌లో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అతి తక్కువ కాలంలో విద్యుత్‌ సమస్యను అధిగమించామన్నారు. వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నామన్న సీఎం.. విద్యుత్‌ సరఫరాలో గుణాత్మక మార్పు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నూతనోత్తేజం చేకూరుస్తున్నట్లు తెలిపారు. మంచినీటి సమస్య పరిష్కారం కోసం మిషన్‌ భగీరథ సఫలం అవుతోందన్నారు. వేసవిలోనూ తాగునీటి కోసం మైళ్ల దూరం వెళ్లే బాధలు తప్పాయన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ఆసరా పింఛన్లు నేరుగా లబ్దిదారులకే అందుతున్నాయన్నారు. వృద్ధ్యాప్య పింఛన్ల వయోపరిమితిని 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించినట్లు… పెంచిన పింఛన్లు జులై నుంచి అమలు చేస్తామన్నారు. కల్యాణలక్ష్మి పథకానికి వచ్చిన ఆశీస్సులే ప్రభుత్వానికి పెట్టని కోటలు అన్నారు. మిషన్‌ కాకతీయ అంతర్జాతీయ ప్రశంసలు పొందింది. అన్ని నీటి వనరుల్లో చేపల పెంపకానికి విత్తనాలు ఇచ్చాం. చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణలో ప్రభుత్వం సఫలమైందన్నారు. బతుకమ్మ, బోనాలు, క్రిస్మస్‌, రంజాన్‌లను రాష్ట్ర పండుగలుగా గుర్తించామన్నారు. ప్రజా వైద్యంపై విశ్వాసం పెరిగేలా ఆస్పత్రుల పనితీరు మెరుగుపర్చామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంటి వెలుగు పథకం పేద ప్రజలకు పెద్ద వరంగా మారిందన్న సీఎం త్వరలోనే దంత, చెవి, ముక్కు వ్యాధుల నిర్దరణకు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎటుచూసినా పచ్చనిపైర్లే దర్శనమిస్తాయి..

పెండింగ్‌ ప్రాజెక్టులను వాయువేగంతో పూర్తిచేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. తలపెట్టిన ప్రాజెక్టులతో రాష్ట్రంలో ఇకపై ఎటుచూసినా పచ్చనిపైర్లే దర్శనమిస్తాయన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను సమర్థంగా వినియోగించుకున్నట్లు చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీరు అందించగలిగామన్నారు. ప్రపంచంలోనే వేగంగా నిర్మించే ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్రలో నిలబోతుందన్నారు. అదేవిధంగా మరోవైపు సీతారామ ఎత్తిపోతల పథకం పనులు కూడా యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులు ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజం సమకూరుస్తాయన్నారు. రాష్ట్రంలో రైతులకు మరో రూ.లక్ష రుణమాఫీ చేయబోతున్నట్లు తెలిపారు. రైతు బంధు కింద పెట్టుబడి సాయాన్ని రూ. 10 వేలకు పెంచామన్నారు. పీఎం కిసాన్‌ యోజనకు రైతు బంధు పథకమే ప్రేరణ అన్నారు. ప్రపంచంలోనే గొప్ప పథకంగా రైతు బంధుకు ఐక్యరాజ్యసమితి ప్రశంసలు దక్కాయన్నారు. రైతు మరణిస్తే రైతు బీమా కింద రూ. 5 లక్షలు అందిస్తున్నట్లు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు హరితహారం ప్రవేశపెట్టామన్నారు. మొక్కల పెంపకం, సంరక్షణతో సస్యశ్యామల సమశీతల తెలంగాణ ఆవిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల పనితీరు మెరుగుకు పంచాయతీరాజ్‌ చట్టం తెచ్చినట్లు చెప్పిన సీఎం.. స్థానిక సంస్థలకు ఏటా రూ.2 వేల కోట్లకు పైగా నిధులు అందుతాయన్నారు. గ్రామ పరిపాలనలో అవినీతికి ఆస్కారం ఉండకూడదన్నారు. పాలనలో జవాబుదారీతనం కోసం పురపాలిక చట్టాన్ని తెస్తున్నట్లు తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టం అమలులో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. అవినీతిని పారద్రోలితే పాలనా వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని సీఎం పేర్కొన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close