మారుమూల ప్రాంతాలకూ నల్లానీళ్ళు

0

– మార్చి31 నాటికి ప్రతీ ఇంటికి భగీరథ జలాలు

– అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మిషన్‌ భగీరథ నీరు అందించాలని, ఏప్రిల్‌ 1 నుంచి తాగునీటికోసం రాష్ట్రంలో ఏ ఒక్కరూ బిందె పట్టుకొని రోడ్లపై కనిపించొద్దని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికా రులకు సూచించారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథపై ప్రగతి భవవన్‌లో మంత్రి కేసీఆర్‌ అధికారులతో సోమవారం సవిూక్ష నిర్వహిం చారు. సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని కేసీఆర్‌ అధికా రులను అడిగి తెలుసుకున్నారు. 23,968 ఆవాసాలకు గానూ 23,947 ఆవాసాలకు నీరు అందుతోందని అధికారులు సీఎంకు తెలిపారు. మరో 21 గ్రామాలకు మాత్రమే నీరు అందాల్సి ఉందని అధికారులు చెప్పారు. గ్రావిూణ ప్రాంతాల్లోని 95శాతం నివాసాలకు నల్లాలు బిగించినట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 10లోపు అన్ని ఆవాసాలకు మంచి నీళ్లు చేరాలని అధికారులకు సీఎం గడువు విధించారు. మార్చి 31 నాటికి మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రతీ ఇంటికి నీరందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా మంచి నీళ్ల కోసం బిందె పట్టుకొని రోడ్ల విూద కనిపించొద్దని సూచించారు. కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలనే తేడా లేకుండా రాష్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు అందివ్వాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఎంత ఖర్చుకైనా వెనకాడకుండా మిషన్‌ భగీరథ పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. దళిత వాడలు, ఆదివాసీ గూడేలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలకు శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కేసీఆర్‌ ఉద్ఘాటించారు. అచ్చంపేట, సిర్పూర్‌ నియోజకవర్గాలు, ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, కొత్తగూడెం జిల్లాల్లోని మారుమూల పల్లెలకు, ఎత్తున ప్రాంతాల్లో ఉన్న ఆవాస ప్రాంతాలకు కూడా కష్టమైన సరే, ఆర్థికంగా భారమైనా మిషన్‌ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ ఊరికి నీళ్లు పంపి, ప్రతీ ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదు. ఆ తర్వాత కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరగాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here