Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

గవర్నర్‌గా తమిళిసై – ప్రమాణం

ప్రమాణం చేయించిన స్టిస్‌ చౌహాన్‌

  • హాజరైన మంత్రులు, బీజేపీ నేతలు, విపక్ష నేతలు
  • అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా తమిళ ఇసై ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్‌ భవన్‌ లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రులు, విపక్ష నేతలు, బీజేపీ నేతలు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, దత్తాత్రేయ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం, పలువురు మంత్రులు సైతం ప్రమాణస్వీకారోత్సవానికి హాజరవడం విశేషం. గవర్నర్‌గా ప్రమాణం చేసిన తమిళిసైకి సీఎం కేసీఆర్‌ సహా పలువురు అభినందనలు తెలిపారు. గవర్నర్‌ గా ప్రమాణస్వీకారం చేశాక తమిళిసై తన తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. సెప్టెంబర్‌ 1న 5 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ.. రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందులో భాగంగా.. తెలంగాణ నూతన గవర్నర్‌గా నరసింహన్‌ స్థానంలో.. తమిళసై సౌందరరాజన్‌ను నియమించారు.

అంతకుముందు తమిళిసై సౌందర్‌ రాజన్‌ ఉదయం చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ఆమెకు తెలంగాణ సీఎం కేసీఆర్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అనంతరం తమిళిసై పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తమిళిసై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు. తమిళ ఇసై సౌందరరాజన్‌ వృత్తి రీత్యా డాక్టర్‌. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌ జన్మస్థలం. తమిళ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. మద్రాస్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. అదే సమయంలో విద్యార్థి సంఘం నాయకురాలిగానూ పనిచేశారు. ఇప్పటివరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లుగా ఎంపీగా పోటీ చేసినా.. ఒక్కసారి కూడా ఆమె విజయం సాధించలేకపోయారు.

నరసింహన్‌ స్థానంలో తమిళిసై..

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఇన్నాళ్లు రెండు రాష్ట్రాల బాధ్యతలు చూసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్‌కు నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరి చందన్‌ను నియమించడంతో నరసింహన్‌ తెలంగాణకే పరిమితమయ్యారు. తాజాగా, నరసింహన్‌ స్థానంలో నూతన గవర్నర్‌గా తమిళనాడుకే చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌ రాజన్‌ను కేంద్రం నియమించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర రెండో గవర్నర్‌గా, తొలి మహిళా గవర్నర్‌గా ఆమె బాధ్యతలు చేపట్టారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close