సర్వేల పేరుతో… స్వాహాపర్వం

0

అనంచిన్ని వెంకటేశ్వరరావు (న్యూఢిల్లీ, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఇప్పటికే సీట్లు ఖరారైన అభ్యర్థులకు తమ ప్రత్యర్థి ఎవరనేది ఖరారు కాకపోవడంతో ఎలా ప్రచారం చేయాలనే కొత్త బెంగ పట్టుకుంది. గతానికి భిన్నంగా రాజకీయ పరిస్థితులు మారటం.. సవిూకరణల్లోనూ తేడాలు కనిపిస్తుండటంతో ఎవరికి వారు విజయం కోసం నిశ్శబ్ద యుద్ధమే చేస్తున్నా మంటూ ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి వివరించారు. పార్టీను చూసి ఓటేస్తారా.. అభ్యర్థిని బట్టి గెలుపు గుర్రం ఎక్కిస్తారా! అనే అనుమానం అన్ని పార్టీల అభ్యర్థులనూ వెంటాడుతుంది. గెలుపుకోసం మల్లగుల్లాలు పడుతున్న అభ్యర్థుల బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు సర్వేలు చేసేవారు రంగంలోకి దిగారు. శాస్త్రీయంగా తాము జరిపే సర్వే ద్వారా వందశాతం విజయం ఎవరిని వరిస్తుందనేది అంచనా వేస్తున్నామంటూ ఊదరగొడు తున్నారు. పైగా జాతీయ రాజకీయాల్లో కీలకమైన నేతల పేర్లు, వారు పోటీచేసి నెగ్గిన నియోజకవర్గాల పరిస్థితిని వివరించి నమ్మకం కలిగించే పనిలో పడ్డారు. రాజకీయంగా కాస్తో కూస్తో పరిజ్ఞానం ఉన్నవారు సర్వే సంస్థలను నెలకొల్పుతున్నారు. నగర శివార్లలోని ఇద్దరు నేతలు ఇప్పటికే రెండు పర్యాయాలు సర్వేలు చేయించి.. గెలుపు తమదే అనే దీమాకు వచ్చినట్లు సమాచారం. నగరంలోని ఓ మాజీమంత్రి తన బలాలు, బలహీనతలను తెలుసుకునేందుకు దాదాపు రూ.10లక్షలు కుమ్మరించి సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల సీజన్ను సాధ్యమైనంత వరకూ సద్వినియోగం చేసుకునేందుకు సర్వే సంస్థలు ప్రధాన పార్టీల అభ్యర్థుల వద్దకు క్యూ కడుతున్నాయి.

కోవర్టులెవరో కనుక్కోండి సారూ: తెలంగాణలో ఓ కీలక నేత. పార్టీ మళ్లీ సీటిచ్చింది. కానీ ఏ మూలనో భయం. గత ఎన్నికల్లో నెగ్గినంత తేలికగా మెజార్టీ సాధించగలనా! అనే ఆందోళన. పైగా ఈ మధ్యనే కొందరు కోవర్టులుగా మారి తమ రహస్యాలు ప్రత్యర్థికి చేరవేస్తున్నారనే బెంగపట్టుకుంది. గతంలో తన వల్ల ఇబ్బందిపడిన గల్లీ నాయకులు తనను ఓడించేందుకు సిద్ధమైనట్లు ఓ చోటానేత ఉప్పందించాడు. దీంతో తనకు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమైన కోవర్టులను గుర్తించమంటూ నమ్మకస్తులకు బాధ్యత అప్పగించినట్లు సమాచారం. నగర పరిధిలో దాదాపు నలుగురు నేతలు.. ఇలా కోవర్టులతో ఇబ్బంది.

సెంటిమెంట్‌ మరి: గతంలో ఫలానా నాయకుడు.. ఆ స్వావిూజి వద్దకెళ్లి ఆశీర్వాదం తీసుకున్నాడు. అందరూ అతడు ఓడిపోతాడని భావిస్తే భారీ మెజార్టీతో గెలి చాడు. ఎట్టాగైనా మనం కూడా ఆయన ఆశీస్సులు తీసుకుందాం. ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరుడి ఉచితసలహా ఇది.. ఎన్నికల వేళ సెంటిమెంటు ఇచ్చే గౌరవమే వేరు. ఎవరికి వారు తాము గతంలో ఆచరించిన పద్ధతులను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. తమ పరిస్థితిని అంచనా వేసేందుకు.. ఏమైనా తేడాలుంటే సరిదిద్దుకునేందుకు స్వావిూజీలను ఆశ్రయిస్తున్నవారూ ఉన్నారు. ఎన్నికల సమయంలో తాము వారి వద్దకెళ్లినా.. ఇంటికి పిలిపించినా అభాసుపాలవుతామనే ఉద్దేశంతో రహస్య ప్రదేశాల్లో మంతనాలు సాగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here