పేదరికంపై సర్జికల్‌ దాడులు

0
  • లాలూ కుటుంబాన్ని మోడీ వేధించారని ఆరోపణ
  • సమిస్తిపూర్‌ సభలో రాహుల్‌ ప్రకటన
  • విమానం అత్యవసర ల్యాండింగ్‌
  • ఇంజిన్‌లో సాంకేతిక సమస్య

పాట్నా : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదరికంపై లక్షిత దాడులు జరుపుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. తాము ప్రకటించిన న్యాయ్‌ పథకంతో పేదల ఖాతాల్లో 72 వేలు వేయబోతున్నామని అన్నారు. బీహార్‌లోని సమష్టిపూర్‌లో శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, వచ్చే ఐదేళ్లలో పేదరికంపై సర్జికల్‌ దాడులు, న్యాయ్‌ స్కీమ్‌ అమలు తమ ఆయుధాలని చెప్పారు. ప్రధాని మోడీ గత ఐదేళ్లలో గబ్బర్‌ సింగ్‌ టాక్స్‌ (జీఎస్‌టీ), పెద్ద నోట్ల రద్దుతో పేదలపై దాడులు జరిపారని, ఇందుకు భిన్నంగా పేదరిక నిర్మూలనపై తమ పోరు ఉంటుందని తెలిపారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో కలిసి రాహుల్‌ వేదిక పంచుకున్నారు. ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుటుంబాన్ని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకోవడాన్ని రాహుల్‌ తన ప్రసంగంలో తప్పుపట్టారు. ‘లాలూపై మోడీ కక్ష సాధింపులకు పాల్పడ్డారు. తన తండ్రిని ఆసుపత్రిలో కలుసుకునేందుకు కూడా తేజస్వి యాదవ్‌ను అనుమతించలేదు. ఈ విషయాన్ని బీహార్‌ ప్రజలు ఎప్పటికీ మరచిపోరు. ఎన్నటికీ మోడీని ప్రజలు క్షమించరని రాహుల్‌ విరుచుకుపడ్డారు. కాగా, రాహుల్‌ ఎన్నికల ర్యాలీ ఆలస్యంగా ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి పాట్నాకు ఆయన బయలుదేరిన విమానం ఇంజన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆయన ఢిల్లీకి వెనుదిరిగి వెళ్లారు. అక్కడ్నించి మరో విమానంలో ఆయన పాట్నాకు వచ్చారు. ఇంతవరకూ బీహార్‌లో మూడు విడతల ఎన్నికలు జరుగగా, తక్కిన నాలుగు విడతల ఎన్నికలు ఈనెల 29, మే 6,12,19 తేదీల్లో జరుగనున్నాయి.

ఇంజిన్‌లో సాంకేతిక సమస్య

కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో శుక్రవారం సాంకేతిక సమస్య తలెత్తింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్‌ గాంధీ పట్నాకు బయల్దేరారు. అయితే, మార్గం మధ్యలో విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో దిల్లీకి తిరుగు పయనమవ్వాల్సి వచ్చింది. సమస్యను అధికారులకు వివరించిన పైలట్లు.. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ఈ విషయాన్ని రాహుల్‌ గాంధీ స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా ఆయన పోస్ట్‌ చేశారు. విమానంలో పైలట్లతో సహా మొత్తం 12 మంది ఉన్నట్లు సమాచారం. బీహార్‌లోని సమస్తిపూర్‌, ఒడిశాలోని బాలాసోర్‌, మహారాష్ట్రలోని సంగంనేర్‌లో జరగనున్న ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌ పాల్గొనాల్సి ఉంది. తాజా ఘటనతో సభలు ఆలస్యంగా ప్రారంభమవుతాయని, అసౌకర్యానికి క్షమించాలని రాహుల్‌ ట్విటర్‌ ద్వారా కోరారు. మరోవైపు విమానంలో అకస్మాత్తుగా సమస్య తలెత్తడంపై డీజీసీఏ విచారణ ప్రారంభించింది. గతంలో కర్ణాటక ఎన్నికల సందర్భంలోనూ రాహుల్‌కి ఇలాంటి ఘటనే ఎదురైంది. దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని అప్పట్లో కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. దీంట్లో ఏదో కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించారు. కానీ అలాంటిదేవిూ లేదని.. ప్రమాదం చాలా చిన్నదేనని డీజీసీఏ స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here