మీ పనితీరు భేష్‌

0

  • వ్యవస్థలు బలోపేతంగా పనిచేయాలి
  • ఎన్నికల సంఘానికి ప్రణబ్‌ ముఖర్జీ ప్రశంస

న్యూఢిల్లీ : భారత ఎన్నికల సంఘం(ఈసీ)పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రశంసలు కురిపించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలోని విపక్ష పార్టీలంతా ఎన్నికల కవిూషన్‌ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇసిపై ప్రశంసలు జల్లు కురిపిస్తూ? ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారని కితాబిచ్చారు. మన దేశంలో ప్రజాస్వామ్యం తీరు బాగుందంటే దానికి ఎన్నికలను సక్రమంగా నిర్వహిస్తున్న ఎలక్షన్‌ కమిషన్‌ ముఖ్య కారణమన్నారు. భారత ప్రజాస్వామ్య పరిరక్షణలో తొలి ఎన్నికల కమిషనర్‌ సుకుమార్‌ సేన్‌ నుంచి ప్రస్తుత కమిషనర్ల వరకు ప్రతిఒక్కరూ కీలక పాత్ర పోషించారన్నారు. ఈసీ పనితీరు పట్ల ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రణబ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దిల్లీలో సోమవారం జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన ఎన్నికల సంఘం పనితీరుతో పాటు పలు సంస్కరణలపై మాట్లాడారు. సుకుమార్‌ సేన్‌ నుంచి ఇప్పటి చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ వరకు అందరు తమ విధులను గొప్పగా నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘాన్ని నిందించడం సరికాదన్నారు. దేశంలోని వ్యవస్థలన్నీ ఎన్నో సంవత్సరాలుగా బలంగా నిర్మించబడుతూ వస్తున్నాయన్న ఆయన.. అన్ని కీలక వ్యవస్థలు అద్భుతంగా పని చేస్తున్నాయని కితాబిచ్చారు. దేశంలోని సంస్థలన్నింటినీ మరింత బలోపేతం చేయాలంటే అవన్నీ సక్రమంగా పనిచేసే అవకాశం కల్పించాలి. మన దేశంలో ప్రజాస్వామ్యం విలసిల్లుతోందంటే.. సుకుమార్‌ సేన్‌ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల కమిషనర్లనంతా బాధ్యతాయుతంగా పనిచేయడం వల్లే అది సాధ్యమయింది. వారి పనితీరును మనం విమర్శించలేం. ఎన్నికలు నిర్వహణ సక్రమంగా జరిగిందని ప్రణబ్‌ అభిప్రాయపడ్డారు. అనేక ఏళ్ల కృషితో నిర్మించుకున్న వ్యవస్థలు, సంస్థలు సక్రమంగానే పనిచేస్తున్నాయన్నాయన్నారు. వాటిని ఉపయోగించుకోవడంలోనే మన సమర్థత దాగి ఉందని హితవు పలికారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగ్‌లో పాల్గొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణ పక్రియంతా పూర్తయి కేవలం ఫలితాల ప్రకటనే మిగిలి ఉన్న తరుణంలో విపక్షాలన్నీ ఎన్నికల సంఘంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈసీ అధికార పక్షానికి అనుకూలంగా పనిచేసిందని.. మోదీ నియమావళి ఉల్లంఘనలపై మెతక వైఖరి ప్రదర్శించిందని పలువురు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మోదీకి ఈసీ లొంగిపోయిందని ఒకప్పుడు సంస్థపై గౌరవం, భయం ఉండేవని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేసిన మరుసటి రోజే ప్రణబ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో పనిచేసిన ప్రణబ్‌ ముఖర్జీ దేశ 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయనకు భారత్‌ అత్యున్నత భారతరత్న దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here