సమ్మర్‌ శక్తిమాన్‌!

0

ఇంట్లో తయారు ఒంట్లో హుషారు చూస్తుండగానే ఎండలు ముదిరిపోతున్నాయ్‌. నీడపట్టున కూర్చుందామంటే వీలుకాదాయె! ఓపక్క పిల్లలకు పరీక్షలు, ఆఫీసులకెళ్లాలి.. బోలెడు వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని బయట అడుగుపెట్టినా మిస్టర్‌ సూర్య స్ట్రా వేసుకుని వంట్లో నీరంతా తాగేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ ఎండాకాలంలో ఉండే బాధలే! అందుకే బయటకు వెళ్లే ముందు కేవలం మంచినీళ్ల బాటిల్‌ మోసుకుని వెళ్లడం కాకుండా ఇంట్లో తయారుచేసిన ఈ ఎలక్ట్రోలైట్‌ వాటర్‌ని వెంట బెట్టుకుని వెళ్లండి. ఎండా, చెమట కారణంగా లవణాలని కోల్పోయిన శరీరం తిరిగి శక్తిని పుంజుకుంటుంది….

జీలకర్రతో..

కావాల్సినవి: వేయించిన జీలకర్ర- రెండు చెంచాలు, ఆమ్‌చూర్‌ పొడి- చెంచా, తాజా పుదీనా ఆకులు- రెండు చెంచాలు, కొత్తిమీర- అరచెంచా, నిమ్మరసం- రెండు చెంచాలు, సోడా లేదా చల్లని నీళ్లు- అరలీటరు, నల్లఉప్పు- చిటికెడు

తయారీ: దోరగా వేయించిన జీలకర్రని నల్ల ఉప్పు, ఆమ్‌చూర్‌పొడితో కలిపి మెత్తగా దంచుకోవాలి. కాసిని నీళ్లు వేసుకుని పుదీనా, కొత్తిమీరలని మిక్సీలో పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఇందులో నిమ్మరసం, ముందుగా దంచిపెట్టుకున్న మసాలా వేసి తగినన్ని చల్లని నీళ్లు కలుపుకొంటే జల్‌జీరా తయారయినట్టే.

శరీరంలో పేరుకొన్న వ్యర్థాలను బయటకు నెట్టేసే పనిని జల్‌జీరా సమర్థంగా చేస్తుంది. విటమిన్‌ సిని పుష్కలంగా అందించడంతోపాటు, కడుపులో తిప్పడం, వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

దానిమ్మతో…

కావాల్సినవి: నీళ్లు లేదా గ్రీన్‌టీ డికాషన్‌ లేదా కొబ్బరినీళ్లు- మూడున్నర కప్పులు, దానిమ్మరసం- అరకప్పు, తేనె- పావుకప్పు, ఉప్పు- పావుచెంచా

తయారీ: పైన చెప్పిన పదార్థాలన్నింటిని జార్‌లో వేసి బాగా కలపాలి. ఎండ నుంచి ఉపశమనం కలిగించే చక్కని ఎలక్ట్రోలైట్‌ డ్రింక్‌ ఇది.

పుచ్చకాయతో..

కావాల్సినవి: కొబ్బరినీళ్లు- రెండు కప్పులు, పుచ్చకాయ ముక్కలు- కప్పు, నిమ్మకాయ-అరచెక్క, ఉప్పు- చిటికెడు, నీళ్లు- తగినన్ని

తయారీ: జార్‌లో కొబ్బరినీళ్లు, పుచ్చకాయ ముక్కలు, నిమ్మరసం, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాలి. అవసరాన్ని బట్టి నీళ్లు కలుపుకొని ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయిన తర్వాత తాగండి.

ఎండ, చెమటకారణంగా శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లని ఈ కొబ్బరినీళ్లు, పుచ్చకాయ తిరిగి అందిస్తాయి. రోజువారీ అవసరాలకు కావాల్సిన విటమిన్‌ సి కూడా ఈ పానీయంతో లభిస్తుంది.

బార్లీ గింజలతో..

కావాల్సినవి: బార్లీ గింజలు- పావుకప్పు, నీళ్లు- నాలుగు కప్పులు, ఉప్పు- చిటికెడు, తేనె- తగినంత, నిమ్మకాయ- ఒకటి

తయారీ: బార్లీ గింజలని శుభ్రం చేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. తెల్లారాక ఆ నీళ్లు తీసేసి తాజా నీళ్లు పోసుకొని బార్లీలను మరిగించుకోవాలి. తర్వాత బార్లీ గింజలను వడకట్టుకుని ఉప్పు, తేనె, నిమ్మకాయ కలుపుకొని ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి. ఈ చల్లని నీళ్లని ఆఫీసుకు వెళ్లేవారు సీసాల్లో తీసుకెళ్తే ఎండ నుంచి ఉపశమనం అందడంతో పాటు పోషక లోపాలుంటే తగ్గుతాయి.

కాల్షియంతోసహా ఇతర ఖనిజాలు, లవణాలని తేలిగ్గా అందించే పానీయం ఇది. సాధారణంగా వేసవిలో ఆడపిల్లలు ఎదుర్కొనే యూరినరీ ట్రాక్‌ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.

స్పోర్ట్స్‌ డ్రింక్‌ ఇంట్లోనే

కావాల్సినవి: కొబ్బరినీళ్లు- నాలుగు కప్పులు, కమలాపండ్ల రసం- అరకప్పు, ఉప్పు- పావుచెంచా, తేనె- రెండు చెంచాలు

తయారీ: అన్నింటిని కలిపి ఒక బాటిల్‌లో వేసి బాగా గిలక్కొట్టి ఫ్రిజ్‌లో కాసేపు ఉంచి తీసి వాడుకోవచ్చు. ఎండ నుంచి ఉపశమనం అందడంతోపాటు ఎండ, చెమట కారణంగా శరీరం కోల్పోయిన లవణాలని తిరిగి అందిస్తుంది. నిస్సత్తువ నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. చర్మానికి మేలు చేస్తుంది. శరీరంలో తరిగిపోయిన సోడియం నిల్వలని తిరిగి అందిస్తుంది.

ఇంట్లోనే ఎలక్ట్రోలైట్‌

కావాల్సినవి: నీళ్లు- కప్పు, నిమ్మచెక్క- సగం, ఉప్పు- తగినంత, తేనె- రెండు పెద్ద చెంచాలు (రుచికోసం మరికొంచెం కలుపుకోవచ్చు).

తయారీ: పైన చెప్పిన అన్నింటిని కలిపి తగినన్ని నీళ్లు కలుపుకొంటే ఎలక్ట్రోలైట్‌ డ్రింక్‌ తయారయినట్టే. ఈ నీళ్లు శరీరంలో నీటి నిల్వలని కాపాడటంతోపాటు వడదెబ్బ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. స్కూల్‌, కాలేజీకెళ్లే పిల్లలకు వాటర్‌బాటిల్‌లో నింపి ఇస్తే మరీ మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here