భానుడి భగభగలు

0
  • నిప్పుల కుంపటిగా తెలుగు రాష్ట్రాలు
  • అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు
  • ఉదయం నుంచే భానుడు ఉగ్రరూపం
  • పలు ప్రాంతాల్లో 46 డిగ్రీలు
  • నిర్మానుష్యంగా మారిన రహదారులు
  • వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసిన ఆర్టీజీఎస్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడు తన ప్రభావాన్ని చూపుతుండటంతో ఉదయం వేళల్లోనూ బయటకు రావాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రహదారులు నిర్మాణుష్యంగా మారుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో రియల్‌టైం గవర్నెన్స్‌ ( ఆర్టీజీఎస్‌) ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వడగాల్పుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వీలైనంత వరకు చల్లని ప్రదేశాల్లోనే ఉండాలని కోరింది. మధ్యాహ్నం 11.30 గంటల వరకు వివిధ జిల్లాల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను ఆర్టీజీఎస్‌ వెల్లడించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, పశ్చిమగోదావరి, చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయిని తెలిపింది. కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల 43 నుంచి 45డిగ్రీలు రికార్టయినట్లు వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు జల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు ఆర్టీజీఎస్‌ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 170 మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైనట్లు ఆర్టీజీఎస్‌ తెలిపింది. 9 మండలాల్లో 43 డిగ్రీలు, 19 మండలాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. ఈ నెల 10వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది. అదేవిధంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం రోజు నగరంలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం కూడా ఎండలు దంచికొడుతున్నాయి. వేడిమిని తట్టుకోలేక ప్రజలు విలవిలలాడుతున్నారు. ఆదివారం 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, సోమవారం 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత, బాలానగర్‌లో 42 డిగ్రీలు, షాపూర్‌నగర్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత మూడు రోజుల నుంచి ఎండలు ఎక్కువయ్యాయని.. రాబోయే రోజుల్లో కూడా ఎండలు అధికమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో 45డిగ్రీలు దాటి ఎండలు తమ ప్రతాపాన్ని చూపుతుండటంతో బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. ఎండలకు తోడు ఉక్కపోత, వడగాల్పులు వీస్తుండటంతో చెట్లకింద ఉండే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఎండల తీవ్రతతో తెలంగాణల్లోని జిల్లా కేంద్రాల్లో రహదారులన్నీ నిర్మాణుష్యంగా మారుతున్నాయి. ఎండల తీవ్రత పరిషత్‌ ఎన్నికలపై పడింది. రెండవ, మూడవ విడతల్లో

జరిగే ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థులు ఎండలతో బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ప్రచారాలు నిర్వహించేందుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. మధ్యాహ్నం వేళల్లో హాల్‌లలో సమావేశాలకు పరిమితమవుతున్నారు. ఇదిలా ఉంటే తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా వడదెబ్బనుంచి కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. సాయంత్రం వేళలో బయటకు వెళ్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here