Featuredప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలు

కేటీఆర్‌ ఖిల్లాలో సిరిసిల్ల నేతన్నల మరణమృదంగం

ముఖ్యమంత్రి తనయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చూస్తుండగానే మరో ఆత్మ’హత్య’. బతుకమ్మ చీరల మాటున జరిగిన దయనీయ మరణం. ఇకనైనా ప్రభుత్వం మేలుకుంటుందా? ఈ చావులకు అంతం ఎప్పుడు? సమాధానం చెప్పే తెలంగాణ ప్రభువులు ఎవరు..?

(యాలాల శ్రీధర్‌) సిరిసిల్ల ఆదాబ్‌ హైదరాబాద్‌ : చేనేతకు ప్రసిద్ది చెందిన సిరిసిల్ల పట్టణంలో శుక్రవారం ఓనేతన్న తను నేతనేసే మగ్గం దగ్గరే, తాను నేసిన బట్టనే తాడుగా పేనుకుని ఉరేసుకున్నాడు. గోషికొండ రాంప్రసాద్‌(50) నలుగురు పిల్లల తండ్రి. భార్య, ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు.. మగ్గాన్నే నమ్ముకుని చేనేతతోనే ఉపాధి పొందుతూ బతుకు బండిలాగిస్తున్న రాంప్రసాద్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పుణ్యమా అని అప్పులపాలైపోయి, తీర్చలేక భార్యా పిల్లల్ని వీడి ఒంటరిగా… బతుకు భయంతో అర్థాంతరంగా తనువు చాలించుకున్నాడు. నేతన్న రాంప్రసాద్‌ సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్‌కు చెందినవాడు. ముంబై నుంచి వచ్చే కాంట్రాక్టర్‌ ఇచ్చే ఆర్డరుతో పెట్టీకోట్స్‌ తయారు చేసి ఉపాధి పొందుతూ బతుకుబండి భారంగానైనా లాగించేవాడు. తనతోపాటుగా ఐదుగురు సభ్యుల కుటుంబాన్ని నెట్టుకురాగలిగేవాడు. ఇంతలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బతుకమ్మ చీరల పథకం ప్రవేశ పెట్టడంతో ఎక్కడో ముంబై కాంట్రాక్ట్‌ కంటే బతుమ్మ చీరల నేత ద్వారా ఎక్కువ లభ్ది పొందవచ్చనీ,ఎటువంటి అంతరాయం లేకుండా స్థిరమైన ఉపాధి దొరుకుతుందని ఆశపడ్డాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమారుడే టెక్స్‌టైల్‌ మంత్రి కావడంతో ఈస్కీము సాఫీగా నడుస్తుందని,తన జీవితంలో ఒడిదుడుకులుండవనీ గట్టిగా భావించాడు. ముంబై కాంట్రాక్టును కాదని బతుకమ్మ చీరల నేతను నమ్ముకున్నాడు. సెప్టెంబరు వరకే చీరల నేత సరిపోయింది. మూడు నెలలుగా పనిలేదు. ఉపాధి లేదు. దొరికిన మేరకు అప్పులుచేశాడు. ఇక అప్పులు పుట్టవు. చేసిన అప్పు తలకు మించిన భారమై బతుకునే ముగించుకున్నాడు. భార్యా పిల్లలు బావురుమంటున్నారు. సాటి నేతన్నలు నిస్సహాయస్థితిలో కేవలం సానుభూతి చూపిస్తున్నారు.

ఇదీ సిరిసిల్ల నేతన్నల బతుకు చిత్రం దేశంలోనే చేనేత రంగానికి ప్రఖ్యాతి గాంచిన సిరిసిల్ల పట్టణంలో నేతన్నల బతుకులు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానాలతో కకావిలవుతున్నాయి. ఉపాధికి దూరమై అర్దాకలి కూడా తీర్చుకోలేని స్థితికి నేత కార్మికులు చేరుకుంటున్నారు. శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డ రాంప్రసాద్‌ మాదిరిగా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చేనేత కుటుంబాలెన్నో సిరిసిల్లలో పోగుబడినట్టున్నాయి.2014 నుంచి ఇప్పటివరకు సుమారుగా 800 మంది నేతన్నలు సిరిసిల్లలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. శాశ్వత పరిష్కారమన్నది పవర్‌లూమ్‌ రంగానికి లేదు. అయినప్పటికీ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు,టీఆర్‌ఎస్‌లో ఉండే ధనిక వర్గాలకు అనుకూలంగా వాళ్లకే టెండర్లు ఇచ్చి బట్టలు నేయించి వాళ్లే లబ్ది పొందేలా చూస్తున్నారు. రూ.300 కోట్ల విలువ చేసే బతుకమ్మ చీరలు టెండర్‌ పెట్టి రూ.165 కోట్లు ఖర్చుచేసి రూ. 115 కోట్లు వెనకేసుకున్నారు. ఆరు నెలల తర్వాత ఇవ్వాల్సిన బతుకమ్మ చీరలు మూడు నెలల ముందు ఇచ్చారు. నైలాన్‌,పాలిస్టర్‌,కాటన్‌,ఇతర రకాలు వాటిని బీములు పోసి పక్కనపెట్టి జౌళి శాఖ వారు జబర్దస్తీగా మీరు అవి నడపవద్దు, నడిపితే ప్రభుత్వ రాయితీలు ఏవైతే ఉన్నాయో అవేవీ రావు. నడిపినట్లయితే కరంట్‌ రాయితీలు కట్‌ చేస్తాం. సబ్సిడీలు రద్దు చేస్తాం. అని బెదిరించడం వల్ల మిగతాపనులు పక్కనబెట్టి బతుకమ్మ చీరలే తయారుచేశారు. ఈపరిస్థితిలో కాటన్‌ మార్కెట్‌ పక్క రాష్ట్రాలకు వెళ్లింది. నైలాన్‌,కాటన్‌ చీరలు కనుమరుగయ్యాయి. మన మార్కెట్‌ దెబ్బతిని పక్క రాష్ట్రాలకు పోయింది. ఈపరిస్థితిలో నేతన్నకు పనిలేక ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి దాపురించింది. దేశంలో ఏరాష్ట్రానికి వెళ్లినా మీ సిరిసిల్ల నేతన్నలు మంచిగున్నారంటగదా కేటీఆర్‌ సారు మీకు మస్తు చేస్తున్నాడంట కదా అంటుంటారని పలువురు చెపుతుంటారు.కానీ వాస్తవ పరిస్థితి ఇది. శాశ్వత పరిష్కారంపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా టీఆర్‌ఎస్‌ కార్యకర్తల లబ్ది కోసం ఈదుస్థితికి నెట్టేశారు. సింగరేణి,రైల్వేశాఖ, పోలీసు,మిలిటరీ,నర్సులు తదితర వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి చేనేతబట్ట సరఫరా చేయడానికి క్యాలెండర్‌ ప్రకారం నిర్ణయించారు. నాణ్యతకలిగిన బట్ట ఇస్తామని చెప్పారు. పేపర్‌ పైన మాత్రమే జరిగింది. ఆపైన ఏమీ జరగలేదని స్థానిక నేతన్నలు కొందరు చెప్పారు. అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతోకొంత మేలు చేసింది. వ్యాట్‌ రద్దుచేసింది. కరంటు సబ్సిడీ కొనసాగించింది. హైదరాబాద్‌లో కరంటు పోయినాకానీ సిరిసిల్లలో మాత్రం కరంటు పోకుండా చేసింది. ఒక్కో ఆసామికి గానీ కార్మికుడికి గానీ ప్రతీనెల రూ.3000 నుండి 3500 వరకు బిల్లులు చెల్లించేది. వారికి 35 కిలోల బియ్యం అందించేది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక సిరిసిల్ల చేనేత కార్మికులని పట్టించుకున్న పాపాన పోలేదు. సిరిసిల్లలో 4వేల మంది ఆసాములు 500 మంది గుమాస్తాలు,20వేల మంది కార్మికులు ఇలా మొత్తం ఈవృత్తిపై ఆధారపడి 18వేల కుటుంబాలు ఉన్నాయని కార్మికులు చెపుతున్నారు.

ఇది టీఆర్‌ఎస్‌ కొట్టిన చావు దెబ్బ

సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి కెకె మహేందర్‌ రెడ్డి

”స్థానిక శాసనసభ్యుడు, జౌళి శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్రజల సమస్యలు పట్టవు. సిరిసిల్ల చేనేత రంగానికి శాశ్వత పరిష్కార మార్గం కనుగొనాలని గత 3 సంవత్సరాలుగా నేను పోరాడుతునే ఉన్నాను. మెరుపుతీగలా వచ్చి రిబ్బను కటింగులు చేసిపోతుం టాడు తప్పితే ఏమీ వినిపించుకోడు. పరిస్థితి ఇలా ఉంటే చేనేత కార్మికుల బతుకులు బుగ్గిపాలు కాకుండా ఉంటాయా అని ఈ సందర్బంగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మరణించిన రాంప్రసాద్‌ కుటుంబంతో పాటు ఇంతవరకు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోయిన కుటుంబాలన్నింటిని తక్షణం ఆదుకోవాలని ఈసందర్బంగా డిమాండ్‌ చేస్తున్నాను”

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close