Featuredస్టేట్ న్యూస్

సమ్మె సమాప్తం.. కండీషన్స్‌ అప్లై

  • షరతులు లేకుండా ఆహ్వానిస్తే విధుల్లోకి
  • ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం..
  • సంచలన నిర్ణయం ప్రకటించిన జేఏసీ

రాష్ట్రంలో 48 రోజులుగా కొనసాగిన ఆర్టీసీ సమ్మెకు ముగింపు పడింది. విధుల్లో చేరడానికి సిద్ధమంటూ ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం ప్రకటించింది. జేఏసీ నిర్ణయంతో రాష్ట్రంలో ఇక బస్సులు యథేచ్ఛగా తిరిగే అవకాశం ఏర్పడింది. కార్మికులు విధుల్లో చేరడానికి.. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సానుకూల వాతావరణ కల్పించాలని జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి కోరారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నట్లు ఆయన తెలిపారు. బేషరతుగా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని.. విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆయన కోరారు. లేబర్‌ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కార్మికులు ఎలాంటి పత్రాలపై సంతకాలు చేయరని.. విధుల్లోకి వెళితే డ్యూటీ చార్టులపై మాత్రమే సంతకాలు చేస్తారని అశ్వత్థామ రెడ్డి తెలిపారు. జేఏసీ నాయకులు, విపక్ష నేతలతో సుదీర్ఘ చర్చల అనంతరం బుధవారం సాయంత్రం ఆర్టీసీ సమ్మెపై ఆయన కీలక నిర్ణయం ప్రకటించారు. ప్రభుత్వం, యాజమాన్యం స్పందన తర్వాతే సమ్మెపై తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. సమ్మె విరమిస్తున్నట్లు నేరుగా ప్రకటన చేయకున్నా.. విధుల్లో చేరడానికి సిద్ధమంటూ అదే అర్థం వచ్చేలా మాట్లాడారు. 48 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, కోర్టుల్లోనూ చుక్కెదురవడంతో కార్మికులు ఆందోళనకు గురయ్యారు. రెండు నెలలుగా జీతాలు లేకపోవడం కార్మికుల జీవితాలను ఆగమాగం చేసింది. గతంలో కూడబెట్టిన అరకొర సొమ్ములు కూడా సమ్మె కాలంలో కరిగిపోయాయి. నిత్యావసరాలు, పిల్లల చదువులు, వృద్ధ తల్లిదండ్రుల బాధ్యత, ఆస్పత్రి తదితర ఖర్చులు భారమై కార్మికులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొంత మంది కార్మికులు రోజువారీ కూలీలుగా అవతారమెత్తారు. మరి కొంత మంది కులవృత్తులను నమ్ముకున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెను కొనసాగించాలా వద్దా అనే అంశంపై కార్మిక సంఘాల నేతలు తీవ్ర మల్లగుల్లాలు పడ్డారు. హైకోర్టు తీర్పు అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాలు మంగళవారం విడివిడిగా కార్మికుల అభిప్రాయాలు సేకరించాయి. బుధవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమైన ఆర్టీసీ జేఏసీ.. సమ్మె విరమణపై చర్చించి ఆ వెంటనే నిర్ణయం ప్రకటించింది. వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన నేపథ్యంలో సమ్మెను విరమించి విధుల్లో చేరడం ఉత్తమమని ఎక్కువ మంది కార్మికులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులుగా సమ్మె చేసి, ఒక్క డిమాండ్‌కు కూడా ప్రభుత్వం అంగీకరించకపోయినా విధుల్లో చేరితే భవిష్యత్తులో కనీసం ఉద్యోగ భద్రత కూడా ఉండదని.. తాడోపేడో తేలేంత వరకు సమ్మె కొనసాగించాల్సిందేనని మరి కొంత మంది కార్మికులు అభిప్రాయపడినట్లు సమాచారం. మొత్తం మీద ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణకే సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో నెలన్నరగా రాష్ట్రంలో నెలకొన్న సందిగ్ధత తొలగిపోవడానికి అవకాశం ఏర్పడింది. ఇక ప్రభుత్వ నిర్ణయమే తరువాయి…..

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close