Featuredస్టేట్ న్యూస్

సమ్మె 31

  • ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు ఉధృతం
  • రాజకీయ పార్టీలతో డిపోల వద్ద దీక్షలు
  • నల్గొండ జిల్లాలో మరో కార్మికుడు మృతి
  • గుండెపోటుతో మృతిచెందిన డ్రైవర్‌ జైపాల్‌ రెడ్డి
  • అధైర్యపడవద్దు.. సమ్మెతో హక్కులను సాధించుకుందాం
  • పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులు

హైదరాబాద్‌

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 31వ రోజుకు చేరింది. సోమవారం రాజకీయ పార్టీల నేతలతో కలిసి కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. డిపోల ఎదుట బస్సులు రాకుండా అడ్డుకున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5లోగా విధుల్లో చేరాలని, లేకపోతే ఆ తర్వాత ఎవ్వరినీ చేర్చుకోబోమని సీఎం కేసీఆర్‌ మంత్రి మండలి సమావేశానంతరం మీడియాతో చెప్పిన విషయం తెలిసిందే. దీంతో పలువురు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరుతామని డిపోల వద్ద లేఖలు ఇస్తున్నారు. ఇప్పటికే 12మంది విధుల్లో చేరగా.. సోమవారం పలువురు ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. సోమవారం జగిత్యాల జిల్లా మెట్‌పల్లి డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎండీ ఖదీర్‌ స్టాఫ్‌ నెంబర్‌. 322544.. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు డ్యూటీలో చేరుతున్నట్లు ప్రకటించారు. డీవీఎం నాగేశ్వర్‌ రావుకు ఇచ్చిన దరఖాస్తులో ఆయన పేర్కొన్నారు. రిక్వెస్ట్‌ లెటర్‌ ను ఉన్నతాధికారులకు పంపించినట్లు డీవీఎం తెలిపారు. మరోవైపు కోరుట్ల ఆర్టీసీ డిపోలో యం. సంధ్యారాణి 322902 మెకానికల్‌ ఫోర్‌ మెన్‌ డ్యూటీలో జాయిన్‌ అయ్యారు. సీఎం కేసీఆర్‌ పిలుపుతో ఆమె విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. సమ్మె విరమించుకొని బేషరతుగా ఉద్యోగంలో చేరుతున్నట్లు తమపై అధికారులకు రాసిన లేఖలో సంధ్యారాణి పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు రాజకీయ పక్షాల నేతలతో కలిసి ఆందోళన ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, న్యాయమైన డిమాండ్‌లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కార్మికుల పట్ల కక్షపూరిత విధానంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ బెదిరింపులకు ఆర్టీసీ కార్మికులు భయపడవద్దని, మన హక్కులను సాధించుకొనే వరకు పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచుదామని పిలుపునిచ్చారు.

మరో ఆర్టీసీ డ్రైవర్‌ మృతి..

ఆర్టీసీ కార్మికులకు మూడు రోజులు గడువు ఇస్తున్నాన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌... అప్పటికీ విధుల్లో చేరకపోతే... ఇక వారిని తొలగించినట్లేనని సంకేతాలు ఇచ్చేయడంతో... ఆర్టీసీ కార్మికులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. తమ ఉద్యోగాలు పోతాయేమోనని తీవ్ర ఆవేదన, ఆందోళనా చెందుతున్నారు. ఇప్పటికే 18 మంది ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు విడిచారు. తాజాగా నల్గొండ జిల్లా... దేవరకొండ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జైపాల్‌ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతితో 

ఆగ్రహావేశాలకు లోనైన ఆర్టీసీ కార్మికులు మృతదేహంతో దీక్షా శిబిరం దగ్గర ధర్నాకు దిగారు. ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ప్రభుత్వం ఆటాడుకుంటోందని మండిపడ్డారు. మరో ఆరు నెలల్లో జైపాల్‌ రెడ్డి రిటైర్‌ కావాల్సి ఉంది. రిటైర్‌మెంట్‌ తర్వాత ఏం చెయ్యాలనే అంశంపై కూడా ఆయనకు కొన్ని ప్లాన్లు ఉన్నాయి. ఐతే సీఎం కేసీఆర్‌ ప్రకటనతో ఆయన తీవ్ర ఆవేదన చెందారనీ, రిటైర్మెంట్‌కి ముందే తన ఉద్యోగం పోతుందేమోనని అదే విషయాన్ని అదే పనిగా ఆలోచించి మానసిక ఆవేదన చెందడం వల్లే ఆయనకు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్నారు. ఆయన్ని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయారనీ ప్రభుత్వం తీరుతో తమ జీవితాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఆర్టీసీ జేఏసీ, యూనియన్లు సోమవారం వేర్వేరుగా సమావేశాలు నిర్వహించుకోనున్నాయి. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నాయి. అలాగే మంగళవారం తలపెట్టిన రహదారుల నిర్బంధాన్ని వాయిదా వేశారు. విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే వాయిదా వేశారు. ప్రభుత్వ మంత్రులు మాత్రం,. ఆర్టీసీ జేఏసీ నాయకుల మాటలు వినకుండా సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉంచాలని కోరుతున్నారు.

డ్యూటీ నుంచి మళ్లీ సమ్మెలోకి..

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. సోమవారానికి 31వ రోజుకు చేరుకుంది. సీఎం డెడ్‌ లైన్‌తో పలువురు కార్మికులు జాబ్‌లోకి చేరుతున్నారు. తాను డ్యూటీలో చేరుతున్నట్లు..సమ్మతిపత్రం ఇచ్చిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఎండీ ముబీన్‌ యూ టర్న్‌ తీసుకున్నారు. తాను సమ్మెలోకి వెళుతున్నట్లు సోమవారం ప్రకటించారు. సీఎం వ్యాఖ్యలకు భయపడి ఉద్యోగంలో చేరుతున్నట్లు రిపోర్టు ఇచ్చినట్లు, కానీ తనకు చనిపోయిన, సమ్మె చేస్తున్న కార్మికులు గుర్తుకు వచ్చారని వెల్లడించారు. డ్యూటీలో చేరడం సరికాదని భావించినట్లు తెలిపారు. అందుకే తాను సమ్మెలోకి వచ్చానన్నారు.

తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల ధర్నా..

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల ధర్నా నిర్వహించారు. మహేశ్వరం డిపోలో సోమవారం ఉదయం నుండి ఒక్క బస్సుకూడా బయటకు వెళ్ళకుండా వారు ఆందోళనకు దిగారు. డీఎం వేధిస్తున్నారని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు తెలిపారు. రూ. 1750లు ఇస్తామని చెప్పి ఆదాయం రాకుంటే 900 రూపాయలే ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికంగా డీజీల్‌ ఖర్చు అవుతోందని?అది ఎక్కడ పోతుందని అనటంతో పాటు.. లీటరు డీజిల్‌ కు రెండు కీలోమీటర్ల లెక్క మైలేజ్‌ వస్తుందని డీఎం అంటున్నారని నిరసన తెలిపారు. రోజుకు 2లక్షల రూపాయల ఖర్చు వస్తుందని, అదాయం మాత్రం50 వేల రూపాయలే వస్తుందంటున్నారని చెబుతున్నారు. ఇలాగే వేధిస్తే తాము డ్యూటీలకు రాబోమని తేల్చిచెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో? డీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తాత్కాలిక డ్రైవర్లు నిరసన విరమించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close