Featuredస్టేట్ న్యూస్

ఆగని ఆర్టీసీ సెగ

  • సమ్మె మరింత ఉధృతం
  • డిపోల వద్ద ఆందోళన
  • బస్సులను బయటకు రాకుండా అడ్డగింత
  • మద్దతుగా ప్రతిపక్ష పార్టీల నాయకులు
  • వెల్లడించిన ఆర్టీసీ యాజమాన్యం
  • ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్ష
  • బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో కోదండరాం, అశ్వత్థామ, మందకృష్ణలు భేటీ

హైదరాబాద్‌

ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. కార్మికులు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్‌ విధించిన డెడ్‌లైన్‌కు స్పందించని కార్మికులు.. బుధవారం బస్సు డిపోల వద్ద తెల్లవారు జాము నుంచే ఆందోళనలకు దిగారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది. దశల వారీగా ఆందోళనలు చేపడుతున్న కార్మికులు బుధవారం ఆర్టీసీ డిపోల ఎదుట కుటుంబసభ్యులతో ఆందోళన నిర్వహించారు. తెల్లవారుజామునుంచే నిరసనలు కొనసాగించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ముందే మోహరించిన పోలీసులు వీరిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులను అరెస్టు చేసి పీఎస్‌లకు తరలించారు. జగిత్యాల బస్‌ డిపోకు మహిళా కండక్టర్లు, అఖిలపక్షం నాయకులు చేరుకుని బస్సులను అడ్డుక్కున్నారు. డిపోల ఎదుట బైఠాయించి సీఎం కేసీఆర్‌కు వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం దుర్మార్గమైన చర్య అన్నారు. కేసీఆర్‌ డెడ్‌లైన్‌లకు కార్మికులు బెదరని తేలిందని, కనీస స్పందన కూడా లేదన్నారు. దీంతో ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేయడంతో పోలీసులకు, కార్మికులకు మధ్య తీవ్రతోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉధ్రిక్తంగా మారుతున్న క్రమంలో 12 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుండి జగిత్యాల పీఎస్‌కు తరలిస్తుండగా..లక్ష్మణ్‌ అనే కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని హుఠాహుటీన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సూర్యాపేట డిపో ఎదుట కార్మికులు చేపట్టిన ధర్నాకు రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. మంచిర్యాల, నాగర్‌ కర్నూలుతో పాటు పలు ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. కాచిగూడ ఆర్టీసీ బస్‌ డిపో ఎదుట కార్మికులకు వేకువజామునే ఆందోళనలకు దిగారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. కార్మికుల ఆందోళనకు మద్దతుగా సీపీఐ నేత నారాయణ బైఠాయించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయ సమ్మతమని పేర్కొన్నారు. నోటీస్‌ ఇచ్చిన తర్వాత కార్మికులతో చర్చలు జరపలేదన్నారు. సీఎం కేసీఆర్‌ తప్పిదం వల్లే కార్మికులు సమ్మెలోకి వెళ్లారన్నారని అన్నారు. సమ్మె విషయంలో కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని నారాయణ డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలన్నారు. కేసీఆర్‌ తలకిందులుగా తపస్సు చేసినా.. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయలేరని

నారాయణ పేర్కొన్నారు. అదేవిధంగా మేడ్చల్‌ జిల్లా కుషాయిగూడ డిపో ఎదుట ఆందోళనలు చేస్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముషీరాబాద్‌ బస్‌ డిపో వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్‌ రెడ్డి, కార్యకర్తలు, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో ముషీరాబాద్‌ బస్‌ డిపో ముట్టడి జరిగింది. ఈ సందర్భంగా నేతలు డిపో ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాగా, వామపక్షాల నిరసన నేపథ్యంలో డిపో వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కామారెడ్డి జిల్లా బాన్స్‌వాడలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉధృతంగా మారింది. ముందస్తుగా కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు, మహిళా కండక్లర్ల ఆధ్వర్యంలో బాన్సువాడ బస్టాండ్‌ ముందు రాస్తారోకో చేపట్టారు. కేసీఆర్‌కు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఓ కార్మికుడు సొమ్మసిల్లి పడిపోయాడు. అతన్ని హుటాహుటీన చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నల్గొండ, మిర్యాలగూడ, మార్కెట్‌పల్లి, యాదగిరిగుట్ట, దేవరకొండ డిపోల్లో వందలాదిమంది కార్మికులను బుధవారం తెల్లవారుజామునుంచి అరెస్టు చేశారు. అన్ని బస్సుడిపోలవద్ద నిన్నటి నుంచి 144 సెక్షన్‌ విధించారు. కార్మికులు బస్టాండ్‌ ఆవరణలోకి రాకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. బస్టాండ్‌ల వద్ద సమ్మె శిబిరాలను తొలగించారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ తన కార్యకర్తలతో కలిసి బస్టాండ్‌లోకి చొచ్చుకొచ్చారు. అడ్డుకోబోయిన పోలీసులను నెట్టివేసి ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు సుధాకర్‌తోపాటు పలువురిని అరెస్టు చేశారు. మిర్యాలగూడలో ఆర్టీసీ డిపో ముందు ధర్నా నిర్వహించడానికి వచ్చిన కార్మికుల, వామపక్షాల నాయకులను ముందుగానే పోలీసులు అరెస్టు చేశారు. అయినప్పటికీ పోలీస్‌ స్టేషన్‌ మెట్లముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన తెలిపారు. యాదగిరిగుట్ట డిపోలోనూ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. దేవరకొండ డిపోలో వామపక్షాల కార్యకర్తలను అరెస్టు చేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా సాగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల వద్ద తెల్లవారు జామునే ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఖ్మమం జిల్లా బస్సు డిపో వద్ద బస్సులు బయటకు రాకుండా కార్మికులు అడ్డుకున్నారు. సీపీఐ, సీపీఎం, తెదేపా, కాంగ్రెస్‌, వివిధ ప్రజా సంఘాల నేతలుసైతం డిపోవద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారిని పక్కకు తప్పించే క్రమంలో పోలీసులకు, ఆందోళన కారులకు తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి చేదాటుతుండటంతో పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకొని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

అర్థరాత్రి ఆర్టీసీ బస్సులో మంటలు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ బస్సులో మంటలు కలకలంరేపాయి. మణుగూరు ఆర్టీసీ డిపోలో మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత బస్సులో నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే డిపో సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. వెంటనే రంగంలోకి దిగి మంటల్ని ఆర్పేశారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం మొత్తం కాలిపోయింది. బస్సులో మంటలు చెలరేగడంపై అనుమానాలు వక్తమయ్యాయి. ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమైతే.. మణుగూరు డిపో అధికారులు మాత్రం షార్ట్‌ సర్య్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు. పోలీసులు కూడా ఇదే అంశాన్ని తేల్చి చెప్పారు. అంతేకాదు డిపోలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే బుధవారం ఉదయం సబ్‌ కలెక్టర్‌ ఘటన స్థలికి చేరుకొని బస్సుదగ్దంపై వివరాలు సేకరించారు. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న కార్మికులు సబ్‌కలెక్టర్‌ కాళ్లు పట్టుకొని బస్సులు నడపవద్దని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

సమ్మతి పత్రాలు అందజేసిన 487 మంది సిబ్బంది..

ఆర్టీసీ కార్మికులు నవంబర్‌ 5వ తేదీ అర్ధరాత్రి లోపు విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గడువు విధించిన విషయం విదితమే. సీఎం కేసీఆర్‌ విధించిన గడువు మంగళవారం రాత్రితో ముగిసింది. అయితే గడువు లోపు విధుల్లో చేరేందుకు రాష్ట్రవ్యాప్తంగా 487 మంది సిబ్బంది సమ్మతి పత్రాలు అందజేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో 111, హైదరాబాద్‌ జోన్‌లో 73, హైదరాబాద్‌ బస్‌ భవన్‌లో 216, కరీంనగర్‌ జోన్‌ పరిధిలో 87 మంది సమ్మతి పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. ఇదిలాఉంటే ఉద్యోగాల్లో తిరిగి చేరేందుకు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన గడువు మంగళవారం అర్ధరాత్రితో పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌, ఆర్టీసీ, రవాణా శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. ఆర్టీసీ సమ్మె ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు ముందుంచాల్సిన అంశాలపై సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ఖరారు చేయనున్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాజా పరిస్థితులపై నగరంలో భాజపా కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద క్రిష్ణమాదిగ కలిశారు. సమ్మె భవిష్యత్‌ కార్యాచరణ, దిల్లీ పరిణామాలు అదితర అంశాలపై వారు చర్చించారు. తదుపరి చేపట్టాల్సిన కార్యక్రమంలో చర్చించారు. సీఎం కేసీఆర్‌ వెలువరించే నిర్ణయం మేరకు తదుపరి నిర్ణయాలు తీసుకొనేందుకు నిర్ణయించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close