కొనసా…గిన బుజ్జగింపులు

0

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కాంగ్రెస్‌ ఆశావాహుల బుజ్జగింపుల పర్వం గురువారం కొనసాగింది. జిల్లాల వారిగా కాంగ్రెస్‌ పార్టీలోని ఆశావహులతో ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ వార్‌రూంలో స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు భేటీ అయ్యిచర్చలు జరిపారు. జిల్లాల వారీగా కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, ఆశావహలుతో చర్చలు నిర్వహించి టికెట్లు రానివారిని బుజ్జగించారు. కూటమి అధికారంలోకి రాగానే తగిన న్యాయంచేస్తామని హావిూ ఇచ్చారు. బుధవారం కాంగ్రెస్‌ అగ్రనేతలు డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డిలకు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గురువారం కూడా ఢిల్లీ వేదికగా కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక పక్రియ జరిగింది. స్క్నీనింగ్‌ కమిటీలో ఖరారు కాని 15స్థానాలకు చెందిన అభ్యర్థులను ఢిల్లీకి రావాల్సిందిగా హైకమాండ్‌ నుంచి పిలుపు నిచ్చింది. దీంతో సూర్యాపేట, ములుగు, ఇబ్రహీంపట్నం, ధర్మపురి, స్టేషన్‌ ఘన్‌పూర్‌, తుంగతుర్తి, రాజేంద్రనగర్‌, దుబ్బాక, మెదక్‌, పెద్దపల్లి, కోరుట్ల, వరంగల్‌ ఈస్ట్‌, కొత్తగూడెం, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, మేడ్చల్‌, పటాన్‌చెరువు, జుక్కల్‌ స్థానాలకు చెందిన ఆశావహులతో గురువారం కాంగ్రెస్‌ వార్‌ రూంలో చర్చలు జరిపారు. ఒక్కొక్క జిల్లాకు గంట సమయం కేటాయిస్తున్నట్లు సమాచారం.

ఏఐసీసీ కార్యాలయం ఎదుట బీసీ నేతల ఆందోళన..

ఏఐసీసీ కార్యాలయం ఎదుట పలువురు బీసీ నేతలు ఆందోళనకు దిగారు. జనాభా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించాలంటూ నిరసనకు దిగారు. టిక్కెట్‌ ఇవ్వకపోతే రెబల్‌గా పోటీకి దిగుతామంటూ బీసీ నేతలు హెచ్చరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఓబీసీ కమిటీ కన్వీనర్‌ అశోక్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. 4.2 శాతం ఉన్న ఓ సామాజికవర్గం కాంగ్రెస్‌ పార్టీని హైజాక్‌ చేసిందని ఆరోపించారు. బీసీలకు సరైన విధంగా సీట్లు కేటాయించకపోతే ఓట్లు అడగవద్దని అన్నారు. బీసీలు ఇంతకుముందులా లేరని వ్యాఖ్యానించారు. 4.2 శాతం ఉన్న ఓ సామాజికవర్గం వారికి 42 సీట్లు కేటాయిస్తే 50శాతం పైగా ఉన్న బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించాలని సూటిగా ప్రశ్నించారు. ఆ సామాజిక వర్గం అభ్యర్థులపై ఎన్ని కేసులున్నా సీట్లు కేటాయిస్తారు కానీ.. క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న బీసీలకు సీట్లు ఎందుకు కేటాయించరని అడిగారు. స్క్రీనింగ్‌ కమిటీలో ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారని, కమిటీతో బీసీలకు ఒరిగేదేవిూ లేదని వ్యాఖ్యానించారు. బీసీలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌లో ముందే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని రాహుల్‌ గాంధీని కోరుతున్నామని ప్రకటించారు. బీసీలకు కాంగ్రెస్‌ పార్టీలో అన్యాయం జరుగుతోందని, మాకు సరైన విధంగా సీట్లు కేటాయించకపోతే తమ కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. మమ్మల్ని రాహుల్‌ గాంధీ దగ్గరికి తీసుకెళ్లాలని లేకపోతే న్యాయం జరిగే వరకు ఏఐసీసీ ఆఫీసు ఎదుటే కూర్చుని దీక్ష చేస్తామని, అవసరమైతే ఆత్మహత్యకు ప్రయత్నిస్తామని బీసీ నేతలు హెచ్చరించారు.

సీనియర్లు టికెట్లు త్యాగం చేయాలి – రేణుకాచౌదరి

తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్ల పాటు సాగిన తెరాస దుష్టపాలనను అంతమొందించాలంటే సీట్ల విషయంలో కాంగ్రెస్‌ నేతలు త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లు ఆమేరకు ముందుకు రావాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రేణుకాచౌదరి పేర్కొన్నారు. గురువారం

ఖమ్మం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నేతలు సంభాని చంద్రశేఖర్‌, గాయత్రి రవి, మానుకొండ రాధాకిషోర్‌ తదితరులతో కలిసి ఢిల్లీలోని స్కన్రింగ్‌ కమిటీతో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి విజయం ఖాయమన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈమేరకు సామాజిక వర్గాల వారిగా సీట్లు కేటాయించేలా అధిష్టానం కసరత్తు చేస్తుందన్నారు. అన్ని వర్గాల వారికి సీట్ల కేటాయింపులో సమన్యాయం జరుగుతుందన్నారు. తెరాస నాలుగేళ్ల దుష్ట పాలనను తరిమికొట్టేదుకు ప్రజలంతా సిద్ధంగాఉన్నారని, కాంగ్రెస్‌తో సమా కూటమి పార్టీల్లోని నేతలు అందుకు సన్నద్ధం కావాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ నేతలు అవసరమైతే టికెట్లు త్యాగం చేయాలని ఆమె కోరారు. తాను బరిలో నిలవడం లేదని రేణుకాచౌదరి స్పష్టం చేశారు.

నేడు కాంగ్రెస్‌ అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తాం – ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా అంశాలపై సంప్రదింపులు, చర్చలు కొనసాగుతున్నాయని, జాబితాపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం కాలేదని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. టీవీ న్యూస్‌ ఛానల్స్‌, సామాజిక మాధ్యమాల్లో, పత్రికల్లో వస్తోన్న జాబితాలు నిజం కాదని, ఇంకా ఎటువంటి జాబితా సిద్ధం కాలేదని ఉత్తమ్‌ వెల్లడించారు. ప్రచారంలో ఉన్న జాబితాలు నిజం కాదని, అవి ఊహాజనీతం, కల్పితం మాత్రమేనని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు వాటిని నమ్మవద్దని సూచించారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా శుక్రవారం విడుదల చేస్తామని వివరించారు. అధికారికంగా జాబితా విడుదల అయ్యే వరకు ఎలాంటి జాబితాలు నమ్మవద్దని, ఆందోళన చెందవద్దని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల వారికి టికెట్ల కేటాయింపులో సమన్యాయం జరుగుతుందని అన్నారు.

మహాకూటమి ఏర్పాటులో..

సీపీఐది కీలక పాత్ర

– మా ప్రతిపాదనను తిరస్కరిస్తే ప్రత్యామ్నాయం చూసుకుంటాం

– నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్సే

– సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి

హైదరాబాద్‌ : హాకూటమితో పొత్తులో భాగంగా, తాము ఎంతగా దిగివచ్చినా, కాంగ్రెస్‌ ఇంకా మెలికలు పెడుతోందని సీపీఐ నేత చాడ వెంకట్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. మహాకూటమి ఏర్పాటు విషయంలో తాను ఎంతో చొరవ తీసుకున్నానని తెలిపారు. తాము తొమ్మిది స్థానాలను అడిగామని, చివరకు ఐదు స్థానాలు ఇచ్చినా కూటమిలో కలిసుంటామని చెప్పామని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్‌ మాత్రం మూడు ఎమ్మెల్యే స్థానాలను, రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఆఫర్‌ చేస్తోందని, దీనికి తాము అంగీకరించబోవడం లేదని చెప్పారు. చివరి ఆప్షన్‌ గా నాలుగు ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎమ్మెల్సీని తాము కోరుతున్నామని, అందుకు కూడా అంగీకరించకుంటే, కూటమికి దూరం కావడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు. కూటమిని స్థిరంగా ఉంచాలన్నదే సీపీఐ అభిమతమని, అందుకోసం పలు ప్రతిపాదనలను సిద్ధం చేశామని, ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్‌ పార్టీ పెద్దలేనని చాడ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించిన తరువాత ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here