ఓటు వేయాలని మద్యం సీసాలపై స్టిక్కర్లు!

0

భోపాల్‌ : ఎన్నికల్లో ఓటర్లను చైతన్యం చేసేందుకు, ఓట్ల శాతాన్ని పెంచేందుకు మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లా అధికారులు వింత ఆలోచనతో ముందుకువచ్చారు. అయితే అది బెడిసికొట్టడంతో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సివచ్చింది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచేందుకు ఝాబువా జిల్లా యంత్రాంగం మద్యం సీసాలపై ఓటర్లను చైతన్యం చేసే నినాదాలతో స్టిక్కర్లను అతికించాలని నిర్ణయించింది.
ఇందుకు సంబంధించి స్టిక్కర్లను కొన్ని రోజుల క్రితమే స్థానిక మద్యం దుకాణదారులకు పంపిణీ చేశారు. వాటిపై ఓటు హక్కును అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలంటూ రాశారు. ఎక్సైజ్‌ శాఖ స్టిక్కర్లను పంపిణీ చేసి మద్యం సీసాలపై అతికించాల్సిందిగా దుకాణదారులను కోరింది. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల్లో మద్యాన్ని ప్రోత్సహిస్తారా? అంటూ పలువురు మండిపడ్డారు. దీంతో ఈ నిర్ణయాన్ని అధికారులు వెనక్కితీసుకున్నారు. ఓటర్లను చైతన్యపరిచే చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అన్నిఅంశాలను పరిశీలించిన అనంతరం దీన్ని వెనక్కితీసుకుంటున్నాం అని అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ కమిషనర్‌ అభిషేక్‌ తివారి వెల్లడించారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్‌ 28న ఒకే దశలో జరగనున్నాయి. డిసెంబర్‌ 11న ఫలితాలు వెల్లడికానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here