Featuredఅంతర్జాతీయ వార్తలు

యుద్ధం వైపు అడుగులు

  • ఇరాక్‌, అమెరికా మధ్య యుద్ధ మేఘాలు
  • అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ మెరుపు దాడి
  • ఇరాన్‌ క్షిపణి దాడుల్లో 80మంది మృతి?
  • ఇరాన్‌ తీరును తీవ్రంగా ఖండించిన ట్రంప్‌
  • సరియైన సమయంలో బదులిస్తామన్న అమెరికా రక్షణ శాఖ

బాగ్దాద్‌

అమెరికాపై ఇరాన్‌ ప్రతీకార దాడికి దిగింది. ఇరాక్‌లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ బలగాలు క్షిపణులతో దాడికి దిగాయి. ఇరాక్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌ లక్ష్యంగా ఈ దాడులు జరిపింది. పశ్చిమ ఆసియా నుంచి అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరాన్‌ హెచ్చరించింది. ఇరాక్‌లోని ఆల్‌ అసద్‌, ఇర్బిల్‌ ఎయిర్‌బేస్‌లపై డజనుకుపైగా క్షిపణులతో ఇరాన్‌ విరుచుకుపడింది. ఈ దాడిలో అమెరికా సైనికులకు జరిగిన నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎయిర్‌బేస్‌లపై దాడిని పెంటగాన్‌ ధ్రువీకరించింది. దాడిలో జరిగిన నష్టంపై అమెరికా అంచనా వేస్తోంది. ఇరాన్‌ క్షిపణి దాడులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఖండించారు. తాజా పరిస్థితులపై ట్రంప్‌ స్వయంగా సవిూక్షిస్తున్నారని, సరైన సమయంలో బదులిస్తామని అమెరికా రక్షణశాఖ ప్రకటించింది. దాడులపై పూర్తి నివేదికను ట్రంప్‌కు సమర్పించామని, ఆయన తదుపరి చర్యలు తీసుకుంటారని వైట్‌ హౌస్‌ వెల్లడించింది. ఇరాన్‌ దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర రూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది.

ఇరాన్‌ క్షిపణి దాడుల్లో 80 మంది మృతి?

ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ చేసిన క్షిపణి దాడుల్లో 80 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దాడుల్లో కనీసం 80 మంది ‘అమెరికా ఉగ్రవాదులు’ మృతిచెందారని ఇరాన్‌ అధికారిక టీవీ పేర్కొనట్లు అంతర్జాతీయ విూడియా కథనాలు వెల్లడించాయి. మిలిటరీ కమాండర్‌ ఖాసీం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్‌ ఈ క్షిపణి దాడులు చేపట్టింది. ఇరాక్‌లోని అల్‌ అసద్‌, ఇర్బిల్‌ ఎయిర్‌బేస్‌లపై క్షిపణులతో విరుచుకుపడింది. మొత్తం 15 క్షిపణులతో దాడి చేశామని, అన్ని మిసైల్స్‌ లక్ష్యాన్ని చేరుకున్నాయని ఇరాన్‌ విూడియా పేర్కొంది. అమెరికా హెలికాప్టర్లు, మిలిటరీ పరికరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయని వెల్లడించింది. ఈ సందర్భంగా వాషింగ్టన్‌కు మరోసారి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ప్రతీకార చర్యలకు దిగితే మరో 100 ప్రాంతాలను లక్ష్యాలుగా చేసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు 22 క్షిపణులతో దాడి జరిగినట్లు ఇరాక్‌ మిలిటరీ చెబుతోంది. ఈ దాడుల్లో ఇరాక్‌ పౌరులెవరూ చనిపోలేదని వెల్లడించింది.

అంతా బాగానే ఉంది – ట్రంప్‌

మరోవైపు ఇరాన్‌ క్షిపణి దాడుల తర్వాత అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని, తాజా పరిస్థితులపై కొంత సమయం తరువాత ప్రకటన చేస్తానని వెల్లడించారు. ఆల్‌ ఈజ్‌ వెల్‌.. ఇరాక్‌లోని రెండు సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు చేసింది. ఈ ఘటనల్లో ఎంతమంది చనిపోయారు..? ఎంత నష్టం జరిగిందనేది అంచనా వేస్తున్నామని ట్రంప్‌ తెలిపారు. ఇప్పటివరకు అంతా ఓకే అని, ప్రపంచవ్యాప్తంగా మాకు శక్తిమంతమైన, సమర్థమైన సైనిక బలగం ఉందని అన్నారు. బుధవారం ఉదయం(అమెరికా కాలమానం ప్రకారం) దీనిపై నేను ప్రకటన చేస్తామని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

వైట్‌హౌస్‌లో హైఅలర్ట్‌..

ఇరాన్‌ హెచ్చరికల నేపథ్యంలో అమెరికా దేశంలోని వాషింగ్టన్‌ నగరంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నివాసముంటున్న వైట్‌హౌస్‌లో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇరాన్‌ అగశ్రేణి సైనిక జనరల్‌ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చడంతో నిప్పులు చిమ్ముతున్న ఇరాన్‌… తాజాగా డొనాల్డ్‌ ట్రంప్‌ను చంపి తెస్తే 80 మిలియన్‌ డాలర్ల (రూ 575.44 కోట్లు) నజరానా ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్‌ నివాసమైన వైట్‌హౌస్‌లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అమెరికా లా ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ వెల్లడించింది. ఇరాన్‌ హెచ్చరికల దృష్ట్యా వైట్‌హౌస్‌ చుట్టుపక్కల భద్రతా బలగాలను మోహరించారు. వైట్‌హౌస్‌ సవిూపంలోని చెక్‌ పాయింట్లలో అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు, సాయుధ భద్రతా బలగాలు పహరాను పటిష్ఠం చేశారు. అమెరికాలో తాము మిస్సైల్‌ దాడులు చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో అమెరికాలోని ట్రంప్‌ నివాసమైన వైట్‌హౌస్‌లో భద్రతను పెంచారు. డొనాల్డ్‌ ట్రంప్‌ నివాసముంటున్న వైట్‌హౌస్‌లో భద్రత పెంపుపై అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close