కార్యకర్తలకు అండగా ఉంటా

0

జనగామ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

ఎత్తిన గులాబీ జెండా దించకుండా పోరాడిన లక్షలాది కార్యకర్తలకు అండగా ఉంటానని, ఆమేరకు పనిచేయాలని కేసీఆర్‌ తనను ఆదేశించారని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. జనగామలోని ప్రిస్టన్స్‌ గ్రౌండ్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ ఘన్‌ పూర్‌ నియోజకవర్గాల టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొన్నారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా ఇక్కడ తొలిసారిగా అడుగుపెట్టినకేటీఆర్‌కు స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ 14 ఏళ్లపాటు పోరాడి తెలంగాణ సాధించారన్నారు. ఎట్టికైనా.. మట్టికైనా మనోడే ఉండాలని జయశంకర్‌ సార్‌ నాడు చెప్పిన మాటలను కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల్లో టీఆర్‌ఎస్‌ పట్ల విశ్వాసం చెక్కు చెదరకుండా పాదుకుపోయిందని, ప్రజలంతా కేసీఆర్‌ వైపే ఉన్నారు అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. పూర్వ వరంగల్‌ జిల్లా అంటే ఉద్యమానికి గుండెకాయ.. అటువంటి జిల్లా నుంచే పర్యటన ప్రారంభించాలని సీఎం ఆదేశించారన్నారు. సీఎం ఆదేశం మేరకే ఇక్కడి నుంచి పర్యటన ప్రారంభించానని కేటీఆర్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ పుట్టుకనే ఒక చరిత్ర అని, 2001 నుంచి ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ నిలిచి గెలిచిందన్నారు. సీఎం కేసీఆర్‌ పాలన దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. ప్రజలు రాజకీయంగా బలం ఇస్తే.. కేంద్రం మెడలు వంచి తెలంగాణ తీసుకువస్తానని చెప్పి 14ఏండ్ల సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్‌ తెలంగాణ సాధించారన్నారు. కేసీఆర్‌ ధీరోదత్త నాయకులు అని గుర్తు చేస్తున్నానన్నారు. చావు నోట్లో పెట్టి తెలంగాణను కేసీఆర్‌ సాధించారని, 2001 నుంచి ఇప్పటి వరకు కార్యకర్తలు పార్టీకి ఆయువుపట్టుగా ఉన్నారన్నారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా లక్షలాది మంది కార్యకర్తలకు అండగా ఉంటానని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని నడపడానికి కేసీఆర్‌ ఉన్నారని, పార్టీని నడిపేందుకు తాను ఉన్నానన్నారు. దేశం మొత్తం నివ్వెరపోయే విధంగా తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చారని అన్నారు. సీఎం కేసీఆర్‌ పాలన అద్భుతంగా ఉందని ఇతర పార్టీల నాయకులు.. టీఆర్‌ఎస్‌ ఎంపీలను అడుగుతున్నారని తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్‌ పాలన దేశానికే దిక్సూచిగా మారిందనడంలో సందేహం లేదన్నారు. దేవాదుల ద్వారా రాబోయే తొమ్మిది నెలల్లో జనగామ జిల్లాలోని ప్రతీ చెరువును నింపుకుందామని, హైదరాబాద్‌ – వరంగల్‌ కారిడార్‌ ను ఇండస్ట్రీరియల్‌ కారిడార్‌ గా మారుస్తామన్నారు. యాదాద్రిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని, ప్రతీ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాల నిర్మాణం చేసుకుందామన్నారు కేటీఆర్‌ తెలిపారు.

ఏడు నెలలు కీలకంగా పనిచేయాలి.. వచ్చే ఏడు నెలలు మనకు కీలకమని, ఈ ఏడు నెలల్లో జరిగే పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్‌ ఎన్నికల వరకు తెరాసా సత్తాను చాటాలని కేటీఆర్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గెలుపులో పాఠాలు.. ఓటమిలో గుణపాఠం ఉంటాయన్నారు. మొన్న గెలుపున ఎవరూ తలకెక్కించుకోవద్దని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీలో వివిధ ¬దాల్లో ఉన్న నేతలు ఏడెనిమిది నెలలు శ్రమించాలన్నారు. స్థానిక ఎన్నికల ద్వారా టీఆర్‌ఎస్‌ ను దశాబ్దాల పాటు చెక్కు చెదరకుండా బలోపేతం చేసుకునే అవకాశం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలని, బూత్‌ కమిటీల నిర్మాణాన్ని పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, 16 లోక్‌ సభ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలవాలన్న లక్ష్యంతో పని చేయాలని, తెలంగాణ ప్రజలే కేంద్రంలో ఎవరు గద్దెనెక్కాల్లో నిర్ణయించాలని కేటీఆర్‌ సూచించారు. కేసీఆర్‌ నాయకత్వానికి ఈ రాష్ట్రానికి ఓ దిక్సూచి అన్నారు. గులాబీ బాస్‌ను ఆశీర్వదించడానికే ఓటింగ్‌ శాతం పెరిగిందని కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు ఎన్ని మాయమాటలు చెప్పినా తెలంగాణ ప్రజలు నమ్మలేదన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాలుకు బలపం కట్టుకొని తిరిగానా తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌కే మళ్లీ పట్టం గట్టారని ఆయన చెప్పుకొచ్చారు. లక్షలాది మంది కార్యకర్తలకు కచ్చితంగా అండగా ఉంటామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here