ఎన్నికలపై స్టే అధికారం హైకోర్టుదే: సుప్రీం

0

★ అభ్యంతరాలు కింద కోర్టులోనే తేల్చుకోవాలి.
★ న్యాయస్థానంలో
నేడు అత్యవసర విచారణ
( అనంచిన్ని వెంకటేశ్వరరావు,న్యూఢిల్లీ, ఆదాబ్ హైదరాబాద్): తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై స్టే విధించే అధికారం హైకోర్టుకు ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ ముందస్తు ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. ఎన్నికలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లు అన్నింటిపై రేపు విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది.
తెలంగాణలో బోగస్‌ ఓట్లు ఎక్కవగా ఉన్నాయని.. వాటిని సరిచేయకుండా ఎన్నికలకు వెళ్లడం సరికాదంటూ కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ సిక్రి ధర్మాసనం విచారణ జరిపింది. మర్రి తరపున అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఓటర్ల జాబితా షెడ్యూల్‌ కుదించారని, తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేశారని కోర్టుకు నివేదించారు. ఓటర్ల జాబితాలో 68 లక్షల ఓటర్ల విషయంలో అవకతవకలు జరిగాయని, 30 లక్షల బోగస్‌ ఓట్లున్నాయని చెప్పారు. ఓటర్ల జాబితా నుంచి 18 లక్షల ఓట్లను తొలగించారని సర్వోన్నత న్యాయస్ధానం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పిటిషన్‌ విచారణ జరిపిన ధర్మాసనం దీనిపై హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.
మరోవైపు తెలంగాణలో జరిగే ఎన్నికల్లో 2018, జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన వారే ఓటుహక్కు వినియోగించుకోవాలని ఈసీ చేసిన ప్రకటనపై శశాంక్‌రెడ్డి అనే వ్యక్తి సుప్రీంలో పిటిషన్‌ వేశారు. కటాఫ్‌ తేదీని ఈ ఏడాది జనవరి 1గా నిర్ణయించడం వల్ల 20 లక్షల మంది తమ ఓటు హక్కు కోల్పోతున్నారని, 2000 సంవత్సరంలో పుట్టిన వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు 2024 వరకూ వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

దీనిపైనా వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఇదే అంశంపై నాలుగు పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున వీటినీ వాటితో పాటు విచారించాలని హైకోర్టును ఆదేశించింది.

నేడే విచారణ:
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలు, ఇతర అభ్యంతరాలను హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం అదేశాల మేరకు శుక్రవారం ఈకేసులో వాదనలు జరిగే అవకాశం ఉంది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here