స్టాలిన్‌ కొత్త వ్యూహం 

0

★ రాహుల్ సమాచారం
★ కమల్‌, వాసన్‌ సహా 9 పార్టీలతో కూటమి
★ కాంగ్రెస్‌కు 6 నియోజకవర్గాలు
★ 40 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడంపై దళపతి వ్యూహం [పరమాత్మ]

(చెన్నై, ఆదాబ్ హైదరాబాద్): లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో కూటమి ఏర్పాట్లు జోరందుకున్నాయి.  2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన డీఎంకే మూడో స్థానానికి పరిమితమైంది. దీంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే ధీమాతో స్టాలిన్‌ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఇతర పార్టీలతో కూటమి కట్టడం, నియోజకవర్గాల కేటాయింపును త్వరగా పూర్తిచేసి ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించారు. జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని గతంలో ఫలితం సాధించిన సందర్భాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు సమాచారం. గతవారం ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడిన స్టాలిన్‌ లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా భాజపాతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. స్టాలిన్‌ నిర్ణయాన్ని రాహుల్‌ గాంధీ కూడా స్వాగతించారు. డీఎంకే నేతృత్వంలోని కూటమిలో కాంగ్రెస్‌కు కేటాయించే సీట్ల గురించి స్టాలిన్‌.. రాహుల్‌కు చెప్పినట్లు తెలిసింది. ఆ ప్రకారం శ్రీపెరంబుదూరు, సేలం, రామనాథపురం, పుదుచ్చేరి, కాంచీపురం, తిరునెల్వేలి తదితర ఆరు నియోజకవర్గాలను ఆ పార్టీకి కేటాయించనున్నట్లు ప్రచారం సాగుతోంది. 9 పార్టీలు కూటమిగా ఏర్పడితే 40 నియోజకవర్గాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నందున దానికి రాహుల్‌ కూడా అంగీకరించారని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా జీకే వాసన్‌ నేతృత్వంలోని టీఎంసీకి మయిలాడుదురై, దిండుక్కల్‌, ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌కు దక్షణ చెన్నైని కేటాయించడానికి స్టాలిన్‌ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. వైగో నేతృత్వంలోని ఎండీఎంకేకు ఈరోడు, విరుదునగర్‌, రెండు కమ్యూనిస్టు పార్టీలను తలా రెండు నియోజకవర్గాల చొప్పున తెన్కాసి, కోయంబత్తూరు, నాగపట్నం, పొల్లాచ్చిలను కేటాయించాలని డీఎంకే భావిస్తోంది. వీసీకే పార్టీకి చిదంబరం, ముస్లిం లీగ్‌కు తిరుచ్చి ఇలా మొత్తం 17 నియోజకవర్గాలను కూటమి పార్టీలకు కేటాయించి మిగిలిన 23 స్థానాల్లో డీఎంకే పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం తెరవెనుక ఈ చర్చలు నడుస్తున్నాయని, వచ్చే ఏడాది పొంగల్‌ తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని డీఎంకే వర్గాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here