Featuredస్టేట్ న్యూస్

శ్రీశైలం..’నకిలీ’ నైజం

తెలంగాణ ప్రజారోగ్యశాఖలో రాబందు

  • నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం
  • ఎస్టీగా సర్టిఫికెట్ల సృష్టి
  • మూడు దశాబ్దాల మోసం
  • వెలికి తీసిన ‘ఆదాబ్‌’

(రమ్యాచౌదరి, ఆదాబ్‌ హైదరాబాద్‌)

శ్రీశైలంలో మల్లన్న భోళాశంకరుడై కొలువై ఉన్నాడని అందరికీ తెలుసు. హైదరాబాద్‌ లో మరో శ్రీశైలం ఉన్నాడు. శ్రీశైల మల్లన్న సైతం హైదరాబాద్‌ లోని మల్లబోయిన శ్రీశైలాన్ని చూసి ఆశ్చర్య పోతాడు. అంతే కాదు ఊసరవెల్లులు కూడా ఈ శ్రీశైలాన్ని చూసి భయపడుతూ పక్కకు జరుగుతాయి. ఎందుకంటే తమ జాతిలోకి వస్తే… వాటికి పుట్టగతులుండవని. వాటికీ అంత భయం ఎందుకంటే… ‘యాదవ’ కులాన్ని ‘యానాది’గా… పుట్టిన జిల్లాను సైతం రికార్డులలో మార్చిన ఘనాపాఠి మల్లబోయిన శ్రీశైలం. కులం మార్చుకొని ఓ దళితుడి కొలువు కొట్టేశాడు. కోట్లు కూడబెట్టుకున్నాడు. విచారణలు జరిగాయి. అదీ మనోడి ఘనత. తప్పు జరిగిందని దశాబ్దం కిందటే అధికారులు సాక్ష్యాధారాలతో తేల్చారు. అయినా సదరు దొరగారిని అంగుళం కదల్చలేకపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా నన్ను ఏం చేయలేడని సదరు ఉద్యోగి ధీమాగా చెప్పటం విడ్డూరం.

అసలేం జరిగింది:

”అతని పేరు శ్రీశైలం. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆ అధికారి.. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కులమతాల వారీగా కల్పించిన రిజర్వేషన్లను ఎలా తనకు అనుకూలంగా మలచుకున్నాడో చూద్దాం. తనది కాని కులాన్ని తనదిగా పేర్కొంటూ నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం సాధించి మూడు దశబ్దాల పాటు ఎంచక్కా నెట్టుకొచ్చాడు. ఆయన పాపం ఏసీబీ దాడుల సందర్భంగా బయటపడింది. ఏసీబీకి పట్టుబడిన తర్వాత కొద్దికాలం జైలు జీవితం గడిపిన ఆ అధికారిని.. అదే సమయంలో ప్రభుత్వాన్ని మోసం చేసి ఉద్యోగం పొందినందుకు విధుల్లో నుంచి డిస్మిస్‌ కూడా అయ్యాడు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని యథావిధిగా విధుల్లో చేరిన ఆ అధికారి… ఇప్పుడు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నాడు. తన తోటి ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ.. ఓ రకంగా చెప్పాలంటే ఆర్థిక అరాచక శక్తిగా మారాడు.

ఇదీ విషయం:హైదరాబాద్లోని తెలంగాణ ప్రజారోగ్యశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కార్యాలయంలో ఎన్టీపీఏ (నాన్‌ టెక్నికల్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌)గా పనిచేస్తున్న మల్లబోయిన శ్రీశైలం 4 జూలై 1988లో ఉద్యోగంలో చేరాడు. వాస్తవంగా యాదవ (బీసీ) కులానికి చెందినప్పటికీ యానాది (ఎస్టీ) కులానికి చెందినట్లు సర్టిఫికెట్‌ పుట్టించి ఆ రిజర్వేషన్తోనే జూనియర్‌ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరాడు. నవంబర్‌ 2వ తేదీ 1992లో సీనియర్‌ అసిస్టెంట్గా.. 2003 జూలై 18న సూపరింటెండెంట్గా అదే రిజర్వేషన్తో వేగంగా ఉద్యోగోన్నతులు పొందాడు. ప్రజారోగ్యశాఖలో ఆయన అవినీతి, అరాచకాలకు విసిగి వేసారిన వారంతా ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా లాభం లేకపోయింది. తనకున్న ఆర్థికబలం, యూనియన్తో ఉన్న సాన్నిహిత్యంతో తన ‘హవా’ నడిపించాడు. 2008, ఆగష్టు 12న శ్రీశైలం నివాసంపై ఏసీబీ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ ఆయన్ను అరెస్ట్‌ చేసింది. అనంతరం జరిపిన విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి వరకు ఎస్టీ రిజర్వేషన్తో చెలామణి అయిన మల్లబోయిన శ్రీశైలం తప్పడు సర్టిఫికెట్లతో ప్రభుత్వాన్ని మోసగించి ఉద్యోగం సంపాదించినట్లు వెల్లడైంది. దీనిపై క్షేత్రస్థాయి విచారణ జరపాల్సిందిగా అప్పటి ప్రభుత్వం ప్రకాశం జిల్లా కలెక్టర్ను ఆదేశించింది.

నేను మొనార్క్‌..విచారణ అయితే నాకేంటి..?:

ఈ మేరకు కలెక్టర్‌ విచారణ జరిపి 2011 ఏప్రిల్‌ 25న నాటి ప్రకాశం జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్దండే తన నివేదిక (ఆర్సీ సీ4/238/2009) ను ప్రభుత్వానికి సమర్పించారు. ఆ విచారణలో శ్రీశైలం అసలు ‘యానాది’ కులానికి చెందిన వాడు కాదని తేల్చారు. మల్లబోయిన అనే ఇంటిపేరు యానాది కులంలో లేనేలేదని పేర్కొన్నారు. శ్రీశైలం ధ్రువీకరణ పత్రాల్లో పేర్కొన్నట్లు ఆయనది ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కుకట్లపల్లి కాదని.. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం మంద్రా గ్రామంగా తేల్చారు. 1963లో మంద్రాలో జన్మించిన శ్రీశైలం 1985 వరకు అదే గ్రామంలో ఉన్నట్టు అనంతరం హైదరాబాద్కు మకాం మార్చాడు. 1971-75 వరకు డీఎస్‌ మంద్రాలో ప్రాథమిక విద్యాభ్యాసం, 1975-77 వరకు యూపీఎస్‌ ఉత్తటూర్లో ఆరు, ఏడు తరగతులు పూర్తిచేశాడు. అనంతరం నల్లగొండ రామగిరి హైస్కూల్లో పదో తరగతి వరకు, నల్లగొండ జూనియర్‌ కళాశాల, ఎన్జీ కాలేజీలో డిగ్రీ చదివాడు. ఆ తర్వాత ప్రకాశం జిల్లా నుంచి నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఉద్యోగం పొందిన శ్రీశైలం ప్రజారోగ్యశాఖలో ఆర్థిక దోపిడీ దాడిగా మారాడు. నిత్యం ఉద్యోగులను పీడిస్తూ ఇష్టానుసారంగా దండుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో శ్రీశైలం పట్టుబడ్డాడు. 2010 ఏప్రిల్‌ 10వ తేదీన ప్రకాశం డిస్ట్రిక్ట్‌ లెవల్‌ కమిటీ విచారణకు హాజరైన శ్రీశైలం తాను యానాది కులానికి చెందిన వాడిని కాదని.. యాదవ కులానికి చెందినవాడినని అంగీకరించాడు. తాను ఎన్నడూ ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కుకట్లపల్లిలో నివాసం ఉండలేదని, తాను పుట్టిపెరిగింది నల్లగొండ జిల్లా, నార్కట్‌ పల్లి మండలం, మంద్రా గ్రామమని తెలిపారు. దీని ఆధారంగా ఆయన తప్పడు మార్గంలో గతంలో పొందిన నకిలీ సర్టిఫికెట్ను రద్దు చేస్తూ ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా మరోమారు విచారణ జరిపింది. ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదికను ధ్రువీకరిస్తూ మల్లబోయిన శ్రీశైలం ఎస్టీ కాదని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పేరిట 2018 ఫిబ్రవరి 7న జీవోఎంఎస్‌ నంబర్‌ 11ను జారీ చేసింది. శ్రీశైలం నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందాడని ఏసీబీ నిర్ధారించి 11 ఏళ్లయినా.. ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ధ్రువీకరించి 8 ఏళ్లయినా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో జారీ చేసి ఏడాది పూర్తయినా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నిర్లక్ష్యాన్ని ఆసరా చేసుకున్న శ్రీశైలం మరింత రెచ్చిపోయి తన దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆయన బాధితులంతా ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్న చేష్టలుడిగి చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close