మొదలైన చిన్న మేడారం జాతర

0
  • ఘనంగా మండమెలిగే పండగ
  • దాదాపు రెండు వందల మంది భక్తుల రాక
  • అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, (ఆదాబ్‌ హైదరాబాద్‌):

గిరిజనుల ఆరాధ్య వన దేవతలై సమ్మక్క సారలమ్మల మినీ మేడారం జాతర అత్యంత వైభవంగా మండమెలిగే పండుగతో ప్రారంభమైంది. ఈ పండుగ నాలుగు రోజుల పాటు సాగుతుంది. ప్రతీ రెండు సంవత్సరాలు ఒక సారి జరిగే మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సుమారుగా రూ. 120 కోట్ల రూపాయలను వెచ్చించి జాతరలో శాశ్వత పనులను ఏర్పాటు చేయింది. అయితే గిరిపుత్రుల వన దేవతలైన సమ్మక్క సారలమ్మలను ఏడాది కొక సారి కొలుసుకునే ఆచారం ఉండడంతో మేడారం చుట్టు పక్కల గ్రామాల గిరిజనులు ప్రతీ ఏడాది మండ మెలిగే పండుతో వన దేవతలను కొలుసుకుంటారు. అందులో భాగంగానే బుధవారం ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో మండ మెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు. అయితే ఈ మినీ మేడారం జాతరకు ములుగు, వరంగల్‌, భూపాలపల్లి, కరీంనగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల నుండే కాకుండా ఛత్తీష్‌గడ్‌, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. మినీ మేడారం జాతర సంధర్బంగా భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు గాను అన్ని ఏర్పాట్లు చేశారు. జాతర సందర్బంగా భుక్తులకు సౌకర్యవంతగా ఉండేందుకు గాను తాగునీటి చేతిపంపులు సుమారుగా 80 వరకు ఏర్పాటు చేశారు. అలాగే జంపన్న వాగులో స్నాన ఘట్టాల వద్ద 20 షవర్లను ఏర్పాటు చేశారు. విద్యుత్‌ శాఖ అధికారులు 15 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయగా 100 మందికి పైగా పారుశుద్ద కార్మికులను అధికారులు ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సుమారుగా 300 మంది పోలీసులను పర్యవేక్షణలో పెట్టారు. అయితే ఆయా ప్రాంతాల నుండి వస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ములుగు, ఏటూరునాగారం ఉన్నతాధికాకులు ఎప్పటికప్పుడు జాతర ప్రాంగణంలో పర్యవేక్షిస్తున్నారు. వరంగల్‌ నుండి మేడారం వెళ్ళే భక్తులు వయా ములుగు నుండి పస్రా మీదుగా మేడారం చేరుకుంటారు. అలాగే చత్తీష్‌గడ్‌, ఖమ్మం నుండి వచ్చే భక్తులు వయా ఏటూరునాగారం మీదుగా తాడ్వాయి నుండి మేడారం చేరుకుంటారు. అలాగే కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ నుండి వచ్చే భక్తులు వయా భూపాలపల్లి నుండి మేడారం చేరుకుంటారని జాతర నిర్వాహకులు తెలిపారు. జాతరకు చేరుకున్న భక్తులు జంపన్న వాగులో స్నానాలు చేసేందుకు గాను పంపుల ద్వారా నీటిని సరఫరా చేసి షవర్ల నుంచి పోయిస్తున్నారు. నాలుగు రోజుల పాటు జరగనున్న మేడారం మినీ జాతర సందర్బంగా జాతర ప్రాంగణంలో భక్తుల కోసం వివిధ రకాల దుకాణాలు వెలిశాయి. జాతరకు చేరుకున్న భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకుని మొక్కులు తీర్చుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here