తెరమీద షర్మిల తెరవెనక కవిత

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల తనపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. చాలా కాలం క్రితం ఆమెకు, సినీహీరో ప్రభాస్‌కు ఎఫైర్‌లు అంటకడుతూ చాలా అసహ్యంగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పెళ్లిళ్లపై జగన్‌ వ్యాఖ్యలు చేసినప్పుడు, చరిత్ర తిరగేసి కొందరు వీరాభిమానులు చాలా అసహ్యంగా ఆమెపై ప్రచారం చేశారు. జగన్‌ కుటుంబ సభ్యుల జోలికి వెళ్లవద్దని ఆ సమయంలో పవన్‌ కల్యాణ్‌ తన అభిమానులకు సూచించారు కూడా! తాజాగా షర్మిల హైదరాబాదు పోలీసు కమిషర్‌ అంజనీ కుమార్‌కు సోమవారం ఫిర్యాదు చేయడంతో కథ మరో మలుపు తిరిగింది. ఈ మలుపు వెనక తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్లమెంట్‌ సభ్యురాలు కల్వకుంట్ల కవిత, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు సూచనలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది..తెలుగుదేశం పార్టీని చిక్కుల్లో పడేయడానికి టీఆర్‌ఎస్‌ వ్యూహంలో భాగంగానే షర్మిల పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారని అంటున్నారు. సీపీకి ఫిర్యాదు చేసిన తర్వాత షర్మిల సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడుతూ ఈ మొత్తం ఎపిసోడ్‌కు చంద్రబాబే కారకుడని నేరుగానే ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై, తెలుగుదేశం పార్టీపై షర్మిల ఆరోపణలు చేశారు. ఐదేళ్ల క్రితం ఉవ్వెత్తున సాగిన ప్రచారం మళ్లీ ప్రారంభమైందని ఆమె అన్నారు.

నాపై దుష్ప్రచారం చేయిస్తుంది చంద్రబాబే: షర్మిల

తన క్యారెక్టర్‌ పై సోషల్‌ మీడియా, వెబ్‌ సైట్లతో దుష్ప్రచారం చేస్తోంది తెలుగు దేశం పార్టీవారేనంటూ షర్మిల ఆరోపించారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఈ ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. లేకుంటే ఆడపడుచుపై ఇలా దుష్ప్రచారం జరిగితే విలువలతో కూడిన ఏ రాజకీయ నాయకుడైనా స్పందిస్తాడని…కానీ చంద్రబాబు ఒక్కసారి కూడా స్పందించలేదని షర్మిల గుర్తు చేశారు. దీన్ని బట్టే ఈ వ్యవహారం వెనుక చంద్రబాబు హస్తం వుందని స్పష్టంగా అర్థమవుతోందని షర్మిల ఆరోపించారు. తనకు హీరో ప్రభాస్‌ తో సంబంధం వుందంటూ 2014 ఎన్నికల సందర్భంలో మొదట ప్రచారం ప్రారంభించారని షర్మిల తెలిపారు. అయితే మధ్యలో ఈ ప్రచారాన్ని నిలిపివేసి తాజాగా మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరోసారి సోషల్‌ మీడియాలో ఈ ప్రచారాన్ని ఉద తం చేశారన్నారు. ప్రభాస్‌ను తానెప్పుడు కలవలేదు, ఒక్కసారి కూడా మాట్లాడలేదని అన్నారు. తన పిల్లలపై ప్రమాణం చేసి మరీ చెబుతున్నా.. ఈ ప్రచారాన్ని పుట్టిస్తున్న వారు నాలాగా ప్రమాణం చేసి చెప్పగలరా..రుజవులు, ఆధారాలు చూపించగలరా అని షర్మిల ప్రశ్నించారు. తనపై పుకార్లు పుట్టించి లేనిపోని బురదజల్లి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం దారుణమని షర్మిల అన్నారు. ఇలాంటి పుకార్లు పుట్టించిన వారికి, వారి వెనకాల వున్నవారికి సిగ్గు లేదా అని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ ఇలా ప్రవర్తించడం చాలా దారుణమని షర్మిల మండిపడ్డారు. చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లు లేరా? వారిపై మేం దుష్ప్రచారం చేయలేమా? కానీ నైతికతతో కూడిన రాజకీయాలు చేయాలనే తాము ఆ పని చేయలేమన్నారు. అలాంటి చర్యలు దిగకపోడానికి నైతికత, మంచితనమే కారణమన్నారు. తన తండ్రి దివంగత రాజశేఖర్‌ రెడ్డి నేర్పిన క్రమశిక్షణ, మానవతా విలువలకు కట్టుబడే ఆ పని చేయలేదని షర్మిల వివరించారు. ఈ ప్రచారం వెనుక చంద్రబాబు హస్తముందని అనుమానం లేకుండా చెబుతున్నానని షర్మిల అన్నారు. విలువలు, ఎథిక్స్‌, మోరల్స్‌ అన్న పదాలు, చంద్రబాబు డిక్షనరీలోనే లేవన్నారు. చంద్రబాబువి ఎప్పుడూ మోసపూరిత ఆలోచనలేనని షర్మిల ఆరోపించారు. ఇలా నీచమైన రాజకీయాలు చుసే వారెక్కడ కనిపించరని అన్నారు. ఈ పాపం ఊరికే పోదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత కొద్ది రోజుల క్రితం పోలీసుల చర్యలతో ఈ వార్తలు ఆగినా ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా మళ్లీ మొదలయ్యాయని ఆమె పేర్కొన్నారు.

కొందరు నాయకులు, పార్టీలు చెప్పే మహిళా సాధికారత, సామాజిక స్ప హ వంటి మాటలు కాగితాలకు మాత్రమే పరిమితం కావద్దన్నారు. వీటికోసం మనం గొంతెత్తాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిదన్నారు. తనపై వెబ్‌ సైట్లలో, సోషల్‌ మీడియా లో వస్తున్న వార్తలకు వ్యతిరేకంగా తాను చేసిన ఫిర్యాదును అందరూ సమర్ధించాలని కోరారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని, చేయిస్తున్న వారినీ కఠినంగా శిక్షించాలన్నారు. వారి వల్ల ప్రస్తుతం తాను దోషిగా నిలబడి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వస్తోందన్నారు. ఓ భార్యగా, ఓ తల్లిగా, ఓ చెల్లిగా తన నైతికతను నిజాయితిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కానీ బయట జరుగుతున్న ప్రచారంపై తాను మాట్లాడకుంటే అదే నిజమని భావించే ప్రమాదం వుంది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నట్లు షర్మిల వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here