కదిలిన అధికార గణం

0

  • మల్లన్నసాగర్‌ జాప్యంపై అసహనం
  • హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఉన్నతస్థాయి సమీక్ష
  • పునరావస ప్యాకేజీ పనులను త్వరగా పూర్తి చేయాలి
  • 11లోగా పూర్తి చేసి హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • స్మితా సబర్వాల్‌కు ప్యాకేజీ పనుల బాధ్యతలు అప్పగింత
  • ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని సిఎస్‌ ఎస్‌కె జోషికి సూచన

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితుల పునరావాస సాయం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఈనెల 11 లోపు హైకోర్టుకు నివేదిక పంపాలని అధికారులను సిఎం కేసీఆర్‌ ఆదేశించారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ కు సంబంధించిన పరిహారం పంపిణీని యుద్ధ ప్రాతిపదికన ముగించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. మల్లన్నసాగర్‌ నిర్వాసితుల పునరావాసంపై హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. కొండపోచమ్మ సాగర్‌ మాదిరిగానే మల్లన్నసాగర్‌ నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టాలన్నారు. ఆరేడు నెలల్లోనే మల్లన్న సాగర్‌ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. వచ్చే ఏడాది జూన్‌ లో రిజర్వాయర్‌ లో నీళ్లు నింపాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పునరావాసంపై సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్వాసితుల పరిహారం చెల్లింపుల విషయంలో కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితులు రావడం మంచిది కాదని, ఈ వ్యవహారాన్ని సీఎస్‌ పర్యవేక్షించాలని కేసీఆర్‌ ఆదేశించారు. పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు గ్రామాల వారీగా శిబిరాలు నిర్వహించాలని, ప్రత్యేక అధికారులను నియమించి పనులను సమీక్షించాలని కేసీఆర్‌ అధికారులను ఆదేవించారు. మరోవైపు నష్టపరిహారం పంపిణీ బాధ్యతలను సీఎం కార్యాలయ అధికారి స్మితా సభర్వాల్‌కు కేసీఆర్‌ అప్పగించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అధికార యంత్రాంగం పరిహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ గుండెకాయ లాంటిది. ఇంత పెద్ద రిజర్వాయర్‌ నిర్మించే క్రమంలో కొద్ది మంది భూములు, ఇండ్లు కోల్పోతున్నారు. వారి విషయంలో ప్రభుత్వం ఎంతో పెద్ద మనసుతో వ్యవహరిస్తున్నది. ఇప్పటికే చాలామందికి పరిహారాన్ని కూడా ప్రభుత్వం అందజేసింది. అయినప్పటకీ కొందరు పనిగట్టుకొని ప్రాజెక్టు పనులకు అడ్డుపడుతున్నారు. ఈ నేపథ్యంలో పరిహారం పంపిణీ పక్రియలో మిగిలిన కొంచెం పనిని కూడా త్వరగా పూర్తి చేయడంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ భూ నిర్వాసితుల పునరోపాధి, పునరావాస సాయం పంపిణీ కార్యక్రమాన్ని వందకు వంద శాతం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చే కార్యక్రమం చాలా వరకు పూర్తయిందన్నారు. మిగిలిన కొద్దిపాటి పక్రియను కొద్ది రోజుల్లోనే పూర్తి చేసి, ఈ నెల 11వ తేదీలోగా హైకోర్టుకు నివేదిక పంపాలని సూచించారు. పరిహారం చెల్లింపు విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే స్పందించారు. సీనియర్‌ అధికారులతో మాట్లాడారు. నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో, అత్యంత మానవత్వంతో వ్యవహరిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ కోర్టులు తరచూ జోక్యం చేసుకునే పరిస్థితులు రావడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు పరిహారం అందించే పక్రియను వెంటనే ముగించే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషికి సూచించారు. పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో నిర్వహించే బాధ్యతలను సిఎంవో

కార్యదర్శి స్మితా సభర్వాల్‌ కు ముఖ్యమంత్రి అప్పగించారు. మల్లన్న సాగర్‌ భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు గ్రామాల వారీగా శిబిరాలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణలో 40 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందివ్వడానికి అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పారు సీఎం కేసీఆర్‌. అందులో భాగంగా 50 టిఎంసిల సామర్థ్యం కలిగిన మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. మల్లన్న సాగర్‌ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిదన్నారు. 800 కోట్ల రూపాయలను మల్లన్న సాగర్‌ నిర్వాసితులకు పరిహారం, పునరావాస కార్యక్రమాల కోసమే ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని తెలిపారు. ఏనుగు ఎల్లింది, తోక మిగిలింది అనే చందంగా మొత్తం పక్రియలో కొద్ది పాటి పరిహారం ఇవ్వడమే మిగిలిందన్నారు. దీనిని అలుసుగా తీసుకుని కొంత మంది వ్యక్తులు, ప్రగతి నిరోధక శక్తులు ప్రాజెక్టునే ఆపడానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పరిహారం పంపిణీ పక్రియలో మిగిలిన కొంచెం పనిని కూడా త్వరగా పూర్తి చేసి, చిల్లర పంచాయితీని వెంటనే ముగించాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేసి, ఆరేడు నెలల్లోనే మల్లన్న సాగర్‌ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. వచ్చే ఏడాది జూన్‌ లో రిజర్వాయర్‌ లో నీళ్లు నింపాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. నీటి పారుదల శాఖను కూడా నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి తన అమెరికా పర్యటనను రద్దు చేసుకుని, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిహారం పంపిణీ పక్రియను ముగించడానికి ప్రణాళిక రూపొందించారు. సిద్దిపేట కలెక్టర్‌ కృష్ణ భాస్కర్‌, సిద్దిపేటలో గతంలో విధులు నిర్వహించిన సిరిసిల్ల కలెక్టర్‌ వెంకట్రామ్‌ రెడ్డితో సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్‌ సమావేశమయ్యారు. ఇప్పటి వరకు అందిన పరిహారం వివరాలు తెలుసుకొని.. మిగిలి వారికి పరిహారం అందించే కార్యక్రమాన్ని ఖరారు చేశారు. మల్లన్న సాగర్‌ పరిధిలోని 8 గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, నిర్వాసితులకు పరిహారం అందించాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక అధికారులను నియమించారు. రాంపూర్‌, లక్ష్మాపూర్‌, బ్రాహ్మణ బంజెరుపల్లి గ్రామాలకు డీఆర్వో బి.చంద్రశేఖర్‌, సిద్దిపేట ఆర్డీఓ ఎం.జయచంద్రారెడ్డిలను, ప్లలెపహాడ్‌ గ్రామానికి ‘గడా’ స్పెషలాఫీసర్‌ ముత్యంరెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ఎం.జయచంద్రారెడ్డి, హైదరాబాద్‌ ఆర్డీఓ శ్రీనివాస్‌ రెడ్డిలను? ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామానికి ‘గడా’ స్పెషలాఫీసర్‌ ముత్యంరెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ఎం.జయచంద్రారెడ్డి, సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్‌ రావులను స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమించారు. వేములఘాట్‌ గ్రామానికి ‘గడా’ స్పెషలాఫీసర్‌ ముత్యంరెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ఎం. జయచంద్రారెడ్డి, సికింద్రాబాద్‌ ఆర్డీఓ రాజాగౌడ్‌, హుస్నాబాద్‌ ఆర్డీఓ కె.అనంతరెడ్డిలను.. సింగారం గ్రామానికి గజ్వేల్‌ ఆర్డీఓ డి.విజయేందర్‌ రెడ్డి, మల్కాజ్‌ గిరి ఆర్డీఓ మధుసూదన్‌ లను, ఎర్రవల్లి గ్రామానికి గజ్వేల్‌ ఆర్డీఓ డి.విజయేందర్‌ రెడ్డిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. సింగారం, రాంపూర్‌ గ్రామాల్లో 800 మంది నిర్వాసితులకు చెక్కుల ద్వారా పరిహారం పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమయింది. మిగతా గ్రామాల్లో ప్రత్యేకాధికారుల సమక్షంలో శనివారం నుంచి చెక్కుల పంపిణీ జరుగుతుంది. ఎవరైనా చెక్కులు తీసుకోవడానికి విముఖత చూపితే, వారి అభిప్రాయాన్ని వీడియో తీయాలని అధికారులు నిర్ణయించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి దేశంలో కెల్లా అత్యంత మెరుగైన పునరావాస ప్యాకేజిని తెలంగాణ ప్రభుత్వం అందించింది. రైతులు కోల్పోయిన భూములకు, వ్యవసాయ కొట్టాలకు, బావులకు, బోర్‌ వెల్స్‌ కు, చెట్లకు, తోటలకు, పైపులైన్లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పరిహారం అందించింది. పునరోపాధి, పునరావాస ప్యాకేజి కింద సాయం అందిస్తున్నది. కేంద్ర చట్టం ప్రకారం ఒక్కో ఇంటికి రూ.1.25 లక్షల వ్యయమయ్యే 60 గజాల స్థలంలో ఇందిరా ఆవాస్‌ యోజన ఇల్లు మంజూరు చేయాలని చెబుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మల్లన్న సాగర్‌ నిర్వాసితులకు అంతకన్నా నాలుగు రెట్లు ఎక్కువగా, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఒక్కో ఇంటికోసం 5 లక్షల 4 వేల రూపాయల విలువైన 560 అడుగుల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు నిర్మిస్తున్నది. ఈ ఇండ్లను కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాకుండా గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఎడ్యుకేషన్‌ హబ్‌ పక్కన 460 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వమే నిర్మించి ఇస్తున్నది. ఇల్లు వద్దనుకునే వారికి 250 గజాల ఇంటి స్థలం, 5 లక్షల 4 వేల రూపాయల నగదు అందిస్తున్నది. అటు ..

ప్రస్తుతం ఉన్న ముంపు గ్రామంలోని ఇంటి స్థలానికి గజానికి రూ. 1600 చొప్పున లెక్క గట్టి పరిహారం చెల్లిస్తున్నది. ఇంటిని కోల్పోయిన వారికి కూడా శాస్త్రీయంగా లెక్కగట్టి పరిహారం చెల్లిస్తున్నది. ఒక్కో కుటుంబానికి ఏడున్నర లక్షల రూపాయల పునరావాస ప్యాకేజీ అదనంగా అందిస్తున్నది. 18 ఏళ్లు నిండిన అవివాహితులకు కూడా రూ.5 లక్షల రూపాయల పునరావాస సాయం, 250 గజాల ఇంటి స్థలం ఇస్తున్నది.

పునరావాస ప్యాకేజి కింద ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇంటికి ఆర్డీఓ సంతకంతో తహసీల్దార్‌ పట్టా జారీ చేస్తారు. అవసరమైన పక్షంలో ఈ ఇంటిని అమ్ముకోవడానికి, బహుమతిగా కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి అనుకూలంగా ఈ పట్టాలుంటాయి. మల్లన్న సాగర్‌ నిర్వాసితులకు ప్రభుత్వం అందిస్తున్న పునరోపాధి, పునరావాస కార్యక్రమం కింద గరిష్టంగా దాదాపు కోటి రూపాయల వరకు సాయం అందుతున్నది.

ఇక ఒక్కో కుటుంబానికి అందే మొత్తం ఏడున్నర లక్షల రూపాయలు కాగా.. ఇద్దరు పెద్ద పిల్లలుంటే అందే మొత్తం పది లక్షల రూపాయలు. కుటుంబానికి, పెద్ద పిల్లలకు కలిపి వచ్చేవి మూడు ఎ/-లాట్లు. అంటే 750 గజాలు స్థలం. దీని ప్రస్తుత మార్కెట్‌ విలువ 75 లక్షల రూపాయలు. మొత్తంగా కోల్పోయిన ఇంటికి, ఇంటి స్థలానికి విస్తీర్ణాన్ని బట్టి పరిహారాన్ని అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here