కొనసాగిన (శ)రణఘోష…

0

పంబ : కేరళలోని సుప్రసిద్ధ ఆలయం శబరిమలలో.. సెంటిమెంట్‌ గెలిచింది. పది నుంచి 50 సంవత్సరాల వయసున్న మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే సుప్రీం ఆదేశాలను పోలీసులు పాటించలేకపోయారు. వంద మంది పోలీసులు నిలబడినా.. భారీ స్థాయిలో భక్తులు నిలవడంతో, స్వామి దర్శనం కోసం వచ్చిన ఇద్దరు మహిళలు వెనుదిరగక తప్పలేదు. అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని హైదరాబాద్‌ మోజో టీవీ జర్నలిస్టు కవిత, ఎర్నాకులంకు చెందిన రేహ్నా ఫాతిమాలు పోలీసుల సాయంతో ఆలయం వరకూ మాత్రమే చేరుకోగలిగారు. అయితే అక్కడున్న భక్తులు వారిని సముద్రంలా అడ్డుపడ్డారు. దీంతో వారిని పోలీసు కార్యాలయానికి తీసుకెళ్లిన ఐజీ శ్రీజిత్‌, వారికి పరిస్థితిని చెప్పి, వెనుదిరగాలని కోరడంతో అందుకు వారు అంగీకరించారు. ఈ సందర్భంగా పాత్రికేయురాలు కవిత మాట్లాడుతూ.. అయ్యప్ప కొండపైకి రావడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపారు. ఈ రోజు ఎంతో ప్రమాదకర పరిస్థితి ఎదుర్కొన్నానని, ఆలయానికి 100 మీటర్ల దూరంలోనే ఆగిపోయామన్నారు. వ ద్ధులు, చిన్న పిల్లలు అడ్డుకోవడం వల్ల వెనక్కి వచ్చేశానన్నారు. కొండపైకి వెళ్లి విజయం సాధించానని తాను గర్వంగా చెప్పగలనని తెలిపారు. మరికొద్ది రోజుల్లో మళ్లీ శబరిమలకు వస్తానన్నారు.

మోజోటివీపై విరగబడ్డ అయ్యప్పలు

హైదరాబాద్‌లోని మోజో టీవీ ఆఫీసు ఎదుట అయప్ప భక్తులు ఆందోళన చేపట్టారు. ‘శబరిమలను కాపాడండి’ అంటూ నినాదాలు చేశారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం ద్వారా రిపోర్టర్‌ కవిత తమ మనోభావాలను దెబ్బతీసిందని వారు ఆరోపించారు. లైవ్‌ డిబేట్‌లోనూ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆమె భర్త మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. దీంతో టీవీ ఛానెల్‌ డైరెక్టర్‌కు లిఖిత పూర్వకంగా లేఖ అందించాలని పోలీసులు వారికి సర్ది చెప్పారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చెందిన టీవీ రిపోర్టర్‌ జక్కల్‌ కవిత, కొచ్చికి చెందిన రెహానా ఫాతిమా శబరిమల వేర్వేరుగా శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పంబ నుంచి శబరిమల కాలినడక బయల్దేరిన వీరు.. పోలీసుల పటిష్ట భద్రత నడుమ ఆలయానికి చేరువగా వెళ్లారు. మరో అర కి.మీ. వెళ్తే వీరు గుడిలోకి ప్రవేశించేవారే. కానీ నిషేధిత వయసులోని మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే.. పూజాధికాలు నిలిపేసి, గుడిని మూసివేస్తామని పూజారులు హెచ్చరించారు. దీంతో పోలీసుల సర్ది చెప్పడంతో.. దర్శనం చేసుకోకుండానే కవిత, ఫాతిమా శబరిమల నుంచి వెనక్కి మళ్లారు.

రహనా ఇల్లుగుల్లా.. శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళల హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమా ఇంటిని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. హైదరాబాద్‌కు చెందిన మహిళా జర్నలిస్ట్‌ కవిత, కొచ్చికి చెందిన రెహానాలు అయ్యప్ప దర్శనం కోసం పంబ నుంచి కాలినడకన శబరిమల కొండ మీదకు వెళ్లారు. పోలీసుల బందోబస్తు మధ్య వీరు ఆలయానికి అర కి.మీ. దూరం వరకు వెళ్లారు. కానీ వీరిని గుడి లోపలికి రానీయకుండా పూజారులు, భక్తులు అడ్డుకున్నారు. నిషేధిత వయసున్న మహిళలు గుళ్లోకి వస్తే.. ఆలయాన్ని మూసేస్తామని పూజారులు హెచ్చరించారు. ఐజీతో సంప్రదింపులు జరిపిన తర్వాత రెహానా వెనక్కి మళ్లింది. రెహానా ఫాతిమా శబరిమల ఆలయ ప్రవేశం కోసం వెళ్లిన సమయంలోనే.. ఆందోళనకారులు కొచ్చిలోని ఆమె ఇంటిపై దాడి చేశారు. సామాగ్రిని ధ్వంసం చేశారు. ఈ ఘటన పట్ల ఫాతిమా ఆందోళన వ్యక్తం చేసింది. ‘నా పిల్లలకు ఏమైందో తెలీదు. నా ప్రాణానికి కూడా ముప్పు ఉంది. కానీ భద్రత కల్పిస్తామని పోలీసులు చెప్పారు. దీంతో దర్శనం చేసుకోకుండానే నేను తిరిగి వెళ్తున్నా’నని ఫాతిమా ఏఎన్‌ఐకి తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here