రాజకీయాల్లో సేవ కనుమరుగే..

0

ఎన్నికల్లో వరదలా లక్షల కోట్లు..

పెట్టిందీ తినడానికే సమయమంతా..

ఇక ప్రజల సమస్యలపై స్పందనెక్కడ…

ముందు నీ దగ్గర ఎంత ఉందో చెప్పు.. ఎంత ఖర్చు పెట్టగలవో రుజువులు చూపించు.. అర్హత, విద్యా, తెలివి ఇక్కడ పనిచెయ్యవు… రాజకీయాల్లో సేవ మాట ఎప్పుడో మరిచిపోయారు.. అందుకే నువ్వు గెలవాలి, నీకు సీటు రావాలి.. వచ్చాక నాలుగు పైసలు సంపాదిస్తావో, అధికారాన్ని అనుభవిస్తావో అది తర్వాత విషయం.. ముందు డబ్బు కావాలి.. వరదలా కోట్ల రూపాయలను పారించాలి.. అప్పుడే గెలుపు వస్తుందీ, అధికారం వస్తుందీ అన్నట్లుగా రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారు.. ముందు పెట్టుబడి పెట్టు తర్వాత నిధానంగా సంపాదించుకో అన్నట్లుగా మారిపోయాయి మన పార్టీల విధానాలు.. నీతిగా, నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చి సేవచేద్దామనే ఆలోచన ఉన్నవారందరూ వెనుకబడిపోతున్నారు అనడం కంటే కిందికి తొక్కిపెడుతున్నారనే చెప్పవచ్చు.. డబ్బు, డబ్బు, డబ్బే రాజకీయమైపోయింది. డబ్బులేకుండా చిన్న ఎన్నికలు కూడా జరగడం లేదంటే మన పార్టీలు రాజకీయాలను ఎంత కల్మశంగా మార్చేసారో తెలిసిపోతుంది. మొన్నటి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్టీ అధినాయకుడిని ఓడించడానికి మరొ పార్టీ అధినాయకులంతా కలిసి ఒక్క లోక్‌సభ సీటు కోసం ఖర్చుపెట్టింది ఎంతో తెలుసా ఆరు వందల యాభై కోట్లు… ఒక్క నియోజకవర్గానికే అంత ఖర్చు చేస్తే దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఎన్ని కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయో, అవి ఎక్కడి నుంచి తెచ్చారో మాత్రం ఎన్నటికి సమాధానం లేని ప్రశ్నలే… ఇన్ని కోట్లు ఇంత డబ్బు ఎలా సంపాదిస్తున్నారో, ఎక్కడి నుంచి తెస్తున్నారో మాత్రం ఒక్కరికంటే ఒక్కరికి తెలియదు.. ఇచ్చేవారు ఉన్నారు కాబట్టి తీసుకుంటున్నామంటున్నారు. తీసుకుంటున్నారు కాబట్టే ఇస్తున్నామంటున్నారు.. రెండు వర్గాలు కలిసి రాజకీయ రూపురేఖలనే మార్చివేశారు…

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మనిషి మంచితనం, అర్హత కంటే డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. నీకు సీటు ఇప్పిస్తే, ఇస్తే నాకెంత ఇస్తావో చెప్పు.. తర్వాత ఎన్నికల్లో పోరాటంలో నీ సత్తా నీ బలం, నీ బలగం ఎంతైనా పెట్టుకో, తర్వాత ఎంతైనా సంపాదించుకో అన్నట్టుగానే మారిపోయాయి రాజకీయాలు.. నిజంగా సేవ చేద్దామనే ఆలోచన ఉన్నవారెవరినీ అటు వైపు అడుగుపడనివ్వడం లేదు.. సేవ, ప్రజల సమస్యలు వదిలేసి సంవత్సరాలు పడుతోంది.. పెట్టిన ఖర్చుకు సంపాదించుకునే పనిలోనే నాయకులంతా బిజిబిజీగా మారిపోతున్నారు. అందుకే ప్రతి పనిలో కమిషన్‌, చిన్న ఉద్యోగానికి సైతం మామూళ్లు మామూలుగా మారిపోతుంటే ఇంక గ్రామం, దేశం ఎందుకు అభివృద్ది పథంలోకి పోతుంది. ఇప్పటికి మనదేశంలో బస్సులు నడవని గ్రామాలు ఉన్నాయి. విద్యుత్‌ బల్బులు వెలగని తండాలున్నాయి. చిన్న రోగం వస్తే ప్రాణాలు గాలిలో కలిసే పరిస్థితులకు ఇంకా కొదువనే లేదు. ప్రజల సమస్యలు, గ్రామాల సమస్యలు ఒక్కరికంటే ఒక్కరికి కనబడవు. ఎన్నికల్లో ఏలాగైనా గెలవాలి, తన ప్రత్యర్థిని ఓడించుటకు ఎన్ని కోట్లు ఖర్చైనా ఫర్వాలేదనే స్థాయికి దిగజారిపోతున్నారు. గ్రామాలు బాగుపడాలంటే స్థానిక సంస్థలను బలోపేతం చెయ్యాలి. అందుకు అవసరమైన నిధులు అందిస్తూ గ్రామాలను అందంగా, సమస్యలు లేకుండా సృష్టించాలి. కాని పాలకులు ఆ విధానాన్నే మరిచిపోతున్నారు. తమ అధికారం. తమ హోదాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వచ్చమైన పాలనతో, స్వచ్చరాజకీయాలు నడిపేవారే కరువైపోయారు.

సార్వత్రిక ఎన్నికల్లో డబ్బుదే హవా..

ఎన్నికలంటే ఏలా ఉండాలి.. గెలిచాక ఏం చేస్తాము. ఇంతకు ముందు ఏం చేశాము అనేదే నాయకులు వివరించాలి. ప్రజలకు అర్థమయ్యే బాషలో చెప్పాలి. కాని మన దేశంలో అన్ని రివర్స్‌నే. ప్రజల మెప్పు పొందడం కంటే ముందు ప్రత్యర్థిని ఏలా చిత్తుచేయాలనే దానిపైనే ఎక్కువ ఆలోచిస్తున్నారు. అందుకోసం అందుబాటులో ఉన్న అన్నిదారులను వాడుతున్నారు. అది న్యాయమా, అన్యాయమా అనేదే వదిలేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి వారుగా గుట్టు చప్పుడు కాకుండా కోట్లాది రూపాయలనే ఏరులై పారించారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఒక్క రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికలకు ఏకంగా రెండు వేల కోట్లు ఖర్చు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే ఒక ఇంటిలో ఐదు ఓట్లు ఉంటే యాభై వేలు, పది ఓట్లు ఉంటే లక్షరూపాయలు ఖర్చుపెట్టారని తెలుస్తోంది. వాటితో పాటు కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలకు ఎంత కోరితే అంత అప్పుజెపుతూ అధికారాన్ని అభిమానంతో కొనేవారే కరువయ్యారు. ఓటును నోటుతో కొంటూ అధికారాన్ని లాక్కుంటున్నారని చెప్పవచ్చు. ఒక రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీనే ఇంత ఖర్చుపెడుతే ఇంకా జాతీయ పార్టీలు ఖర్చులకు లెక్కపత్రమేమి ఉండదు. వారికి నచ్చినంత, వారికి విసుగు వచ్చేవరకు డబ్బు పారుతూనే ఉంటుంది. ఇన్ని పార్టీలకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనేది మాత్రం ఎవ్వరికి అర్థమే కాదు. నిజంగా ప్రజలకు సేవ చేసే వారే ఐతే డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి. నిజాయితీగా పోటి చేసి, నిజాయితీగా సేవచేద్దామనే ఆలోచన ఒక్కరికంటే ఒక్కరికి కూడా లేదనే చెప్పవచ్చు… రాజకీయాలను మన పార్టీలు, నాయకులు డబ్బు ఉంటేనే సేవ అనే మాదిరిగా మార్చివేశారు..

ఒక్కో నియోజకవర్గంలో వందకోట్లకు పైగానే…

ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ అనే సంస్థ అధ్యయనం ప్రకారం తాజాగా ముగిసిన ఎన్నికల ఖర్చు అత్యంత ఖరీదైనదిగా చెప్పింది. ఈ సంస్థ వేసిన ప్రాథమిక అంచనా ప్రకారం లోక్‌సభ ఎన్నికల ఖర్చు ఏకంగా ఆరవై వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పెట్టిన ఖర్చుకు డబుల్‌గా పెట్టారని లెక్కలతో సహా చూపించారు. ఈ ఖర్చులో పదిహేను నుంచి ఇరవై శాతం ఎన్నికల కమిషన్‌ చేసిన వ్యయంగా చెబుతున్నారు. సగటున ఒక్కో నియోజకవర్గంలో దాదాపుగా వంద కోట్లు కన్నా ఎక్కువగానే ఖర్చు జరిగినట్లుగా వెల్లడించారు. సగటున ఒక్కొ ఓటరకు మన నాయకులు పెట్టిన ఖర్చు వెయ్యి రూపాయలకు పైగానే ఉందని తెలుస్తోంది. ఐతే వీరి దృష్టికి రాని అంచనా వేయలేని కొన్ని ఖర్చుల్ని కూడా కలుపుకుంటే ఈ ఖర్చు మరింత ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు. ఐదేళ్ల వ్యవధిలో నేతలు సంపాదించాల్సిన టార్గెట్‌ మొత్తం కనీసం అరవై వేల కోట్లకు తగ్గకూడదు. ఖర్చు చేసిన ప్రతి రూపాయికి రెండు రూపాయలు సంపాదించే దోరణి ప్రతి రాజకీయ నాయకుడికి ఉంటుంది. అలాంటప్పుడు ఓట్ల కోసం ఖర్చు చేసిన మొత్తాన్ని ప్రజల ముక్కుపిండి మరీ వసూలు చేసేయటం ఖాయంగానే కనిపిస్తోంది. రానున్న ఐదేళ్లలో ఈ భారీ మొత్తాన్ని ప్రజాధనం నుంచి వెనక్కి తీసుకునే దిశగా నేతలు సిద్దమైపోతున్నట్లు తెలుస్తోంది. అందులో వారు ఒక్కపైసా కూడా వదలిపెట్టేది లేదని వారి ఆలోచనల్లోనే తెలిసిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here