Featuredప్రాంతీయ వార్తలు

తీవ్ర రూపం దాల్చిన రాజధాని ఆందోళనలు

రైతులను అడ్డుకున్న పోలీసులు

టిడిపి నేతలు గృహనిర్బంధం

అమరావతి

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజకీయ పార్టీలు, రైతులు చేస్తున్న ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. సోమవారం మంత్రిమండలి సమావేశం, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఉండటంతో సచివాలయ ముట్టడికి తెలుగుదేశం పార్టీ, రైతుల జెఎసి పిలుపునివ్వడంతో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజధాని గ్రామాల్లో పోలీసులు మొహరించారు. వెలగపూడిలో స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. రాజధానిపై ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అమరావతి విద్యార్థి యువజన జెఎసి నల్ల బుడగలను ఎగురవేసి నిరసన తెలిపింది. ¬టళ్లు సహా అన్ని దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న నేతలను పోలీసులు అరెస్టు చేసి రైల్వే కల్యాణ మండపానికి తరలించారు. రాష్ట్ర నీటిసంఘాల నేత ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావును పోలీసులు గృహ నిర్బంధించారు. బాపులపాడు మండలం రంగన్న గూడెంలో వీరవల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని గొల్లపూడి సెంటర్‌లో మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఆయనకు పోలీసులు అడ్డుపడ్డారు. దీంతో స్థానికులు వాగ్వాదానికి దిగారు.ఈ దశలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు గుంటూరులో టిడిపి నేత జీవి అంజనేయులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. అమరావతి జెఎసి, విపక్షాలు చలో అసెంబ్లీ పిలుపునిచ్చిన దృష్ట్యా సచివాలయం పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉద్యోగులు వెళ్లే గేట్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. గుర్తింపు కార్డు పరిశీలించి, క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మందడం వెళ్లే మార్గంలో పోలీసులు వలలు సిద్ధం చేసి ఉంచారు. చలో అసెంబ్లీ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. 70 మంది పోలీసులతో పహారా కాసారు. ఉదయపు నడకకు వెళ్లేవారినీ అనుమతించకపోవడంతో వాకర్స్‌ వారితో వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మందడంలో పోలీసులు భారీగా మోహరించారు. భద్రత పర్యవేక్షణలో భాగంగా పోలీసులు స్థానికుల ఇళ్లపై డ్రోన్‌లను ఎగురవేశారు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రోన్‌లను వ్యతిరేకిస్తూ నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఇళ్లపై నల్ల జెండాలు ఎగురవేశారు. అంతేకాకుండా’ సేవ్‌ అమరావతి..సేవ్‌ ఆంధప్రదేశ్‌’ అంటూ నినాదాలు ఉన్న బోర్డులను ఇంటి గోడలకు పెట్టారు. రాజధాని వికేంద్రీకరణపై మంత్రివర్గ నిర్ణయం, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తుళ్లూరు నుంచి భారీ ఎత్తున ప్రజలు అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరారు. అసెంబ్లీ వైపునకు వెళ్లేందుకు యత్నించిన రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకున్నారు.వారిని నెట్టుకుంటూ వెళ్లేందుకు ప్రజలు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొంతమంది మాత్రం పోలీసులను దాటుకుంటూ అసెంబ్లీవైపు పరుగులు తీశారు. మందడం నుంచి పొలాల మీదుగా చిన్నా పెద్దా తరలివచ్చారు. దారివెంబడి ఉన్న ముళ్ల చెట్లను దాటుకొని భారీగా తరలివచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. జాతీయ జెండాను చేతబట్టిన రైతులు, మహిళలు పోలీసుల చర్యను నిరసిస్తూ పంట కాల్వలో దిగి నిరసన చేపట్టారు. ప్రాణ సమానమైన భూములను రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేస్తే.. ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ మండిపడ్డారు. రాజధాని తరలింపుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రామవరం వద్ద అమరావతి జెఎసి నేతలు ఆందోళనకు దిగారు. జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ జ్యోతుల నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై టైర్లు కాల్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో దాదాపు 3 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం జగ్గంపేట పోలీసులు జ్యోతుల నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి ఐకాస, విపక్షాలు చలో అసెంబ్లీ నేపథ్యంలో గుంటూరులోని ¬ం మంత్రి సుచరిత ఇంటిని టిడిపి శ్రేణులు ముట్టడించాయి. మంత్రి ఇంటి ఎదుట మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఆ పార్టీ నేతలు డేగల ప్రభాకర్‌, నజీర్‌, గోళ్ళ ప్రభాకర్‌ తదితరులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబును గుంటూరులో పోలీసులు అరెస్టు చేశారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close