సినిమా వార్తలు

టాలీవుడ్‌లో సీక్వెల్స్‌ కొత్తేమీ కాదు

టాలీవుడ్‌లో సీక్వెల్స్‌ కొత్తేమీ కాదు. సినిమా హిట్‌ అవ్వగానే దర్శక-నిర్మాతలు, హీరోలు దానికి కొనసాగింపు చిత్రాల కోసం సిద్ధమైపోయేవారు. అయితే ఇదంతా చాలా రోజుల కిందటి పరిస్థితి. అయితే అలాంటి సినిమాలకు సరైన స్పందన రాకపోవడంతో మనవాళ్లు అటుగా వెళ్లడం తగ్గించారు. కానీ, ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో సీక్వెల్స్‌ సందడి మొదలైంది. స్టార్‌ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు సీక్వెల్స్‌ పనిలో పడ్డారు.

భారతీయుడు ఈజ్‌ బ్యాక్‌

కమల్‌హాసన్‌ సినిమా అంటే భాషతో సంబంధం లేదు. అలా 1996లో వచ్చిన ‘భారతీయుడు’ దేశవ్యాప్తంగా రికార్డులు బద్దలుకొట్టింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ సిద్ధమవుతోంది. తొలి సినిమాను తెరకెక్కించిన శంకర్‌ ఈ సినిమాకు సారథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ కూడా పూర్తయ్యాయి. వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నారు. అయితే సినిమా ఆగిపోయిందంటూ అప్పుడప్పుడు వార్తలొస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఒకవేళ సినిమా వస్తే ఈసారి కమల్‌… ఏ సామాజిక సమస్య మీద యుద్ధం పూర్తిస్తారో చూడాలి.

రెండో మన్మథుడు

నాగార్జున కెరీర్‌లో బెస్ట్‌ సినిమాలు ఎన్నో వచ్చాయి. కానీ, ఆయన ఫ్యాన్స్‌కు షడ్రుచుల భోజన అంటే గుర్తొచ్చే సినిమాల్లో ‘మన్మథుడు’ ఒకటి. వినోదం, రొమాన్స్‌, కథ… ఇలా అన్ని అంశాలతో అదిరిపోయిందా సినిమా. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ సిద్ధమవుతోంది. ‘చి.ల.సౌ.’తో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ రెండో ‘మన్మథుడు’ని సిద్ధం చేస్తున్నాడు. ఇందులో నాగ్‌ పక్కన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది. ఈ సినిమా ఇటీవల మొదలైన విషయం తెలిసిందే.

ఈసారి ఏ గుడి రహస్యమో

నిఖిల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ ‘కార్తికేయ’. నిఖిల్‌, స్వాతి జంటగా నటించిన ఈ సినిమా 2014లో విడుదలైంది. అప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్‌ గురించి అడపాదడపా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ విషయంలో స్పష్టత వచ్చింది. తొలి సినిమాను రూపొందించిన చందూ మొండేటి రెండో భాగం కోసం కథ సిద్ధం చేశాడు. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కుతుంది. మరి ఇందులో నిఖిల్‌ ఏ గుడి రహస్యం బద్దలు కొడతాడో చూడాలి.

మూడో ‘ఎఫ్‌’ ఏంటి?

ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ అంటూ ఈ సంక్రాంతికి వచ్చిన అల్లుళ్లు గట్టిగానే నవ్వించారు. వెంకేటష్‌, వరుణ్‌ తేజ్‌ నటించిన ‘ఎఫ్‌2’ గురించే ఇదంతా. ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని ఎండ్‌ టైటిల్స్‌లోనే చెప్పేశారు. ‘ఎఫ్‌3’ అని పేరు కూడా పెట్టేశారు. దీనికి సంబంధించి పాయింట్‌ కూడా సిద్ధం చేశారని, త్వరలో సినిమా మొదలవుతుందని వార్తలొచ్చాయి. అయితే అనిల్‌ రావిపూడి… మహేష్‌బాబుతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో ‘ఎఫ్‌3’ ఆలస్యం అవుతుందని అర్థమవుతోంది. ఇందులో వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌తోపాటు రవితేజ కూడా నటిస్తారని వార్తలు వస్తున్నాయి.

బంగార్రాజు ఏం చేస్తాడో

మూడేళ్ల క్రితం ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అంటూ నాగార్జున సంక్రాంతికి వచ్చి అదరగొట్టేశారు. నాగ్‌ ద్విపాత్రాభినయం చేసి మెప్పించాడు. బంగార్రాజు, రామ్మోహన్‌గా నాగార్జున రెండు భిన్నమైన షేడ్స్‌లో కనిపించారు. ఇందులో బంగార్రాజు పాత్రను ప్రధానంగా తీసుకొని ‘బంగార్రాజు’ పేరుతోనే ఓ సినిమా రూపొందిస్తామని ఆ చిత్ర దర్శకుడు కల్యాణ్‌ క ష్ణ ఎప్పుడో ప్రకటించేశారు. నాగార్జున దీనికి ఓకే కూడా చెప్పేశాడు. అయితే తొలి రోజుల్లో ఇది ప్రీక్వెల్‌ అని చెప్పారు. ఇప్పుడు సీక్వెల్‌ అంటున్నారు. దీనికి స్పష్టత రావాల్సి ఉంది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close