వరుస ఎన్నికలు అభివృద్దికి విఘాతం

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

వరుస ఎన్నికలతో అధికారులు బిజీ కావడంతో గ్రామస్థాయిలో ఇప్పట్లో పనులకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు. అలాగే సంక్షేమ పథకాలకు కూడా ఆటంకాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే ఇసి ఆదేశాలతో బతుకమ్మ చీరల పంపిణీ, రైతుబంధు చెక్కుల పంపిణీ ఆగిపోయింది. అలాగే సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ కూడా నిలిపివేశారు. ఇలా ఎన్నికల సమయంలో సంక్షేమ కార్యక్రమాలపై ఆంక్షలు విధించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇలాంటి సందర్బాల్లో ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. నిరంతరం జరిగే

కార్యక్రమాలకు ఆటంకం లేకుండా ఎన్నికల సంఘం ప్రతిపాదనలు రూపొందించాలి. మరోవైపు అధికారులంతా ఎన్నికల ఏర్పాట్లతో గడపాల్సి వస్తోంది. ఇకపోతే రానున్నది పరీక్షల కాలం. దీంతో విద్యార్థులకు కూడా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. పంచాయితీ ఎన్నికలు మొదలు పార్లమెంట్‌ ఎన్నికల వరకు ఈ ఐదారు నెలలు బిజీగా ఉండనుంది. ఇలాంటి వరుస ఎన్నికల విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. నిజానికి మొన్నటి అసెంబ్లీ అన్నికల నుంచే సమయమంతా గడిచిపోతున్నది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నెల రోజులకే గ్రామ పంచాయతీ పోరు జరగనుంది. అనంతరం మున్సిపాలిటీ, సహకార, సాగునీటి సంఘం ఎన్నికలకు కూడా రంగం సిద్ధమవుతోంది.. వెనువెంటనే పార్లమెంట్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలు సైతం మరో మూడు నెలల్లో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. వరుస ఎన్నికల కారణంగా పల్లెల్లో రాజకీయం వేడెక్కడంతో పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు విరామం ప్రకటించాల్సిన ఆగత్యం ఏర్పడింది. దీంతో కొత్త సంవత్సరమంతా ఎన్నికల ఏడాదిగానే ఉంటుందనడంలో సందేహం లేదు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు సైతం వీటిపైనే దృష్టి పెడుతున్నారు. ప్రజలు ఏ కార్యాలయానికి పనుల కోసం వెళ్లినా అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉన్నారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికల పక్రియ ముగిసిందనుకున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో 2019వ సంవత్సరం ఎన్నికల ఏడాది కాబోతుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు అధికారులు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. జనవరిలో పంచాయతీరాజ్‌ తర్వాత సహకార సంఘాలు, పార్లమెంట్‌, జిల్లా, మండల ప్రాదేశిక ఎన్నికలు వరుసగా రానున్నాయి. అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్ల జాబీతాను సిద్ధం చేస్తూనే మరో పక్క పంచాయతీ ఎన్నికల నిర్వహణను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమర్థ నిర్వాహణ స్ఫూర్తిగా పంచాయతీరాజ్‌, సహకార సంఘాలు, ఎమ్మెల్సీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ముందుకు సాగుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేస్తున్న వెంటనే ప్రభుత్వం ఇతర ఎన్నికల నిర్వాహణకు సన్నద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాలతో సర్పంచ్‌ ఎన్నికల నిర్వాహణను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఎన్నికల సీజన్‌ ప్రారంభం కావటంతో బరిలో సమర్థవంతమైన అభ్యర్థులను నిలిపేందుకు రాజకీయ పార్టీలు సైతం బిజీగా ఉన్నాయి. అధికార పార్టీ నేతలు కూడా ఎన్నికల హడావిడిలోనే ఉన్నారు. దీంతో సామాన్యులకు ఓటేయడం మినహా వేరే గత్యంతరం లేదు. ఇసి ఆదేశాలతో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు తలమునక లయ్యారు. /ూష్ట్ర విభజనకు ముందు 2013లో ప్రభుత్వం పంచాయతీరాజ్‌ ఎన్నికలను నిర్వహించింది. గ్రామ పంచాయితీల పాలక వర్గాల పదవీ కాలం 2018 జూలై 31తో ముగిసింది. నిర్ణీత గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ దశలోనే ఓటర్ల జాబీతాతో పాటు వార్డుల విభజనను పూర్తి చేశారు. ఎన్నికల కోసం సామగ్రిని అందుబాటులోకి తీసుకొచ్చారు. 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు సూచించిన తరవాత బీసీ రిజర్వేషన్లపై తాజాగా కోర్టుకు వెళ్లిన వారికి కూడా భంగపాటు తప్పలేదు. ఎన్నికల ప్రక్రియను ఆపేది లేదని హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. ఎన్నికలను నిర్వహిస్తామని ప్రభుత్వం కూడా కోర్టుకు నివేదించింది. ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలను ఒక వైపు తయారు చేస్తున్న అధికారులు పంచాయతీ ఎన్నికలపై కసరత్తును ముమ్మరం చేస్తున్నారు. మరో వైపు పార్లమెంట్‌ ఎన్నికలను నిర్ణీత గడువుకు ముందుగానే తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పార్లమెంట్‌ ఎన్నికలు ఏప్రిల్‌, మే నెలల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యం లోనే అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు. జూన్‌లో మండల, జిల్లా ప్రాదేశిక సభ్యుల పదవీ కాలం ముగియ నుంది. ఈ ఎన్నికలకు కూడా అన్ని అనుకూలిస్తే వచ్చే ఏడాది సుమారు 8 నెలల పాటు ఎన్నికల వాతావరణమే కనిపించబోతోంది. అన్నిరకాల ఎన్నికలను పూర్తి చేసి ప్రజలకు సుపరి పాలన అందించాలనే ఉద్దేశంలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈకొత్త సంవత్సరంలో వరుసగా వస్తున్న ఎన్నికల దృష్ట్యా అధికారులు బిజీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన జిల్లా అధికార యంత్రాంగం గ్రామ పంచాయతీలతో పాటు ఇతర ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధ మయ్యారు. దీంతో గ్రామస్థాయిలో ఎన్నికల వాతావరణం తప్ప అభివృద్ది ప్రణాళికలు ముందుకు సాగేలా లేవు. స్వాంత్య్ర దినోత్సవం వరకు ఇదే పరిస్థితి ఉంటుందనడంలో సందేహం లేదు. ఆ తరవాతనే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగే సూచనలు ఉన్నాయి. కొత్తగా కెసిఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డా అభివృద్ది కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్లడానికి అప్పటి వరకు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here