Featuredరాజకీయ వార్తలు

సీనియర్లకంత సీన్‌లేదా..!

పార్టీని నమ్ముకున్నారు.. పార్టీకోసం ఆహర్నిశలు పనిచేశారు.. మంత్రులుగా, పార్టీలోని వివిధ పదవులుగా చేపట్టారు.. రేపోమాపో జాబితా విడుదలవుతుందని, అందులో తమకు తప్పకుండా అవకాశం ఉంటుందని ఆశగా ఎదురుచూసినా ఆశావాహులకు నిరాశ ఎదురైంది. అధిష్టానం విడుదల చేసిన జాబితాను చూస్తే అందులో కొంతమంది సీనియర్ల పేర్లే లేవు.. ఏం చెయ్యాలో తెలియక తికమకపడుతూ పరుగో పరుగంటూ డిల్లీ అధిష్టానం దగ్గర పడిగాపులు కాస్తున్నారు.. కూటమి అధికారంలోకి వస్తే సిఎం రేసులో నేనంటే నేనని చెప్పుకుంటున్న నాయకులకు మొదటి జాబితాలో పేరే కనిపించలేదు… సిఎం మాట దేవుడెరుగు కనీసం బరిలో దిగే అవకాశాన్ని కల్పించాలని, పార్టీ కోసం ఇన్ని రోజులు పనిచేస్తే మొదటి జాబితాలో పేరు లేదని వారంతా ఆవేదన చెందుతున్నారు..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మహకూటమిలో సీట్ల పంపకం పూర్తి అవుతుంది.. తాత్సారం జరుగుతుందని ప్రజల్లో ప్రచారానికి సమయమే లేదని ఆలోచించినా అధిష్టానం ఢిల్లీ నుంచి 65 మంది కాంగ్రెస్‌ అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసింది. జాబితాలో పేర్లు ఉన్నాయని సంతోషపడే వారు కొందరైతే, సీనియర్లని చెప్పుకున్న నేతలకు అందులో అవకాశమే లేకుండా పోయింది. గత కొన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వివిధ పదవులు అలంకరించిన వారికి కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టిలో పెట్టుకొలేదని వాపోతున్నారు. కూటమి ఏర్పడడం ఏమో కాని కాంగ్రెస్‌లో ఆశావాహులకు ఆన్యాయం జరుగుతుందని, గెలిచి స్థానాలు కూడా ఓడిపోయేలా చేస్తున్నారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. జాబితా రావడం లేదని ఎదురుచూసిన వారికి జాబితా విడుదలైన ఆనందమే లేకుండా పోయింది. తొలి జాబితాలో పేర్లు ఉన్నవారు ఇంతవరకు గట్టెక్కామని అనందంతో అనుకుంటుండగా, టిక్కెట్‌ దక్కని వారు మరో జాబితాలో పేరు ఉంటుందో, లేదో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. నా స్థానానికి ఢోకా లేదని చెప్పిన కొంతమంది సీనియర్ల పేరు కూడా అందులో లేదు. అన్ని పార్టీలు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించాయి. నామినేషన్లకు ఇంకా మిగిలి ఉంది ఐదారు రోజులు మాత్రమే. అరవై ఐదు మందితో తొలి జాబితా విడుదల చేసిన ఇంకా 29 మందిని నిర్ణాయించాల్సి ఉంది. 119 మంది స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ 94 సీట్లకు పోటీ చేస్తుంది. విడుదల కాని రెండో జాబితాలో అవకాశాలు రాని ప్రముఖుల భవిష్యత్తు ముడిపడి ఉండటంతో, ఎవరికి అవకాశం వస్తుందో, ఎవరిని పక్కన పెడుతారో అర్థంకాని అయోమయంలో ఉన్నారు కాంగ్రెస్‌ నాయకులు. రెండో జాబితాలోనైనా తమ పేర్లు ఉంటాయేమోనని ఆశ ఉందంటున్నారు.

ఆశగా ఎదురుచూస్తున్న సీనియర్లు…

తెలంగాణ రాష్ట్ర సమితికి రాష్ట్రం మొత్తంగా వ్యతిరేక పవనాలు ఉన్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఎక్కడ అవకాశం వచ్చినా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికార పార్టీ అవినీతి, అమలు కాని పథకాలు, కుటుంబపాలన ప్రధానంగా నడిచిన తీరు అన్ని వెరసి తెరాసకు గెలుపు నల్లేరుపై మీద నడకగానే మారిపోయేలా ఉంది. ఆ పార్టీ వ్యతిరేకతను అవకాశంగా తీసుకొని కాంగ్రెస్‌ నుంచి సీటు వచ్చేలా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఎన్నికలు గడువు రోజురోజుకు దగ్గర పడుతున్న కొద్ది జాబితాను తాత్సారమే చేశారు. నామినేషన్‌ ప్రక్రియ మొదలైన రోజు మొదటి జాబితా విడుదల చేశారు. అవకాశం ఉంటుందనుకున్న నాయకులకు అందులో పేర్లే కనిపించకపోయేసరికి ఎవ్వరిక చెప్పుకొని బాధపడాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి టిక్కెట్లు ఆశిస్తున్న పిజెఆర్‌ తనయుడు విష్ణువర్దన్‌రెడ్డి, సనత్‌నగర్‌ నుంచి టిక్కెట్టు కావాలంటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి, మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు కోసం మిర్యాలగూడ నియోజకవర్గాల సీట్ల విషయంలో అధిష్టానం ఇంకా ఏలాంటి స్పష్టత తీసుకోనే లేదు. వీటితో పాటు మరికొన్ని సీట్లను పెండింగ్‌లో పెట్టారు. నామినేషన్లకు రోజురోజుకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో అవకాశం రాని ఆశావాహుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.

పట్టుపట్టి సాధించుకున్న వారు

సొంత నియోజకవర్గాల్లో అవకాశం రాని వారు కొందరైతే మరికొంతమంది సీనియర్లు మరీ పట్టుబట్టి సీట్లు సాధించుకున్నారని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారు. నల్గండ జిల్లాలో కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరుంది. కొమటిరెడ్డి సోదరులు గెలిచే అవకాశాలు ఉన్న దగ్గర తమకు సీటు కావాలని మరీ పట్టుబట్టి సంపాదించుకున్నారు. కోమటిరెడ్డి సోదరులు చెరోసీటుతో పాటు వారి నన్నిహితులు చిరుమర్తి లింగయ్యకు కూడా బెర్త్‌ సంపాదించుకున్నారు. ఒకవేళ లింగయ్యకు సీటు ఇవ్వకపోతే కాంగ్రెస్‌ తరపు నుంచి పోటీ చేయమని కోమటిరెడ్డి సోదరులు గట్టిగా హెచ్చరించారు. దీంతో అధిష్టానం దిగివచ్చి వారికి మూడు సీట్లు ఇచ్చిందని సమాచారం. రంగారెడ్డి జిల్లాలో కూడా మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి తన వాళ్లకు సీటు ఇప్పించుకునేలా చక్రం తిప్పుతున్నారని, గెలిచే అవకాశం ఉన్నదగ్గర తప్పగకుండా సీటు కేటాయించాలంటూ ఆవిడ హెచ్చరిలు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రస్‌లో అదిరించి, బెదిరించిన వారికి సీట్లు వచ్చాయని, అవకాశం వస్తుందనుకునే వారికి జాబితాలో సీటు లేదని అంటున్నారు. రెండోజాబితా రేపోమాపో అని చెబుతున్న నాయకులు అందులోనైనా అవకాశం రావాలని ఢిల్లీకి పరుగులు పెట్టారు.

ఎన్నో సంవత్సరాలుగా పార్టీని నడిపించినా మాకే మొదటి జాబితాలో పేరేందుకు లేదో అర్థం కావడం లేదన్నారు. గెలిచే అవకాశం ఉన్న స్థానాలను కాంగ్రెస్‌ వదిలిపెట్టుకునే ప్రసక్తే లేదని తమకు సీటు కావాలని ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు కాంగ్రెస్‌ అధిష్టానం సర్థిచెప్పే పనిలో ఉంది. సీనియరు నాయకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండవ జాబితాలో తప్పకుండా అవకాశం కల్పిస్తామంటుందని చెపుతున్నారు. రెండవ జాబితా ఢిల్లీ నుంచి ఏ అర్థరాత్రి విడుదలవుతుందో, అందులోనైనా తమకు అవకాశం ఉంటుందో, లేదోనని బిక్కుబిక్కుమంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు కాంగ్రెస్‌ సీనియర్లు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close